Samantha Yashoda Review: `యశోద` మూవీ రివ్యూ.. సమంత విశ్వరూపం
స్టార్ హీరోయిన్ సమంత నుంచి వస్తోన్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం `యశోద`. సరోగసి నేపథ్యంలో అనేక షాకింగ్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`యూటర్న్`, `ఓ బేబీ` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల తర్వాత సమంత నుంచి వస్తోన్న మరో లేడీ ఓరియెండెట్ మూవీ `యశోద`. చైతూతో డైవర్స్ తర్వాత ఆమె నుంచి విడుదలవుతున్న తెలుగు పాన్ ఇండియా చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికితోడు ఆమె ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందనే విషయం తెలిసి అంతా ఆమె విషయంలో సానుభూతితో ఉన్నారు. అదే సమయంలో ఆమె నటించిన `యశోద` విడుదలవుతున్న నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భాషలకు అతీతంగా సెలబ్రిటీలు విశెష్ తెలియజేయడం విశేషం. ఇక అనేక అంచనాల మధ్య, అనేక ప్రశ్నల మధ్య శుక్రవారం(నవంబర్ 11) ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? సమంత లేడీ ఓరియెంటెడ్ కథతో సక్సెస్ కొట్టిందా? అనేది `యశోద` రివ్యూలో తెలుసుకుందాం. Yashoda Review
కథః
యశోద(సమంత) జోమాటో ఫుడ్ డెలివరీ గర్ల్ గా పనిచేస్తూ తన చెల్లిని చూసుకుంటుంది. చెల్లికి అనారోగ్యం కోసం ఆమెకి డబ్బు కావాలి. అందుకోసం సరోగసి ద్వారా బిడ్డకి జన్మనిచ్చేందుకు సిద్ధమవుతుంది. డబ్బు అందిన వెంటనే ఆమెని `ఈవా` అనే సరోగసి ఫెర్టిలిటీ సెంటర్‌కి తీసుకెళ్తారు. సకల సౌకర్యాలకు నెలవు. ఏది కావాలన్నా వారి వద్దకే వచ్చి చేరుతుంటాయి. అవి చూసి యశోద సంతోషిస్తుంది. ఆ సెంటర్ మధు(వరలక్ష్మి శరత్ కుమార్) సమక్షంలో నిర్వహించబడుతుంది. ప్రెగ్నెంట్ లేడీలకు డాక్టర్ గౌతమ్(ఉన్నిముకుందన్)చెకప్ చేస్తుంటారు. ఈ క్రమంలో సరోగసి కోసం వచ్చిన ఇతర ప్రెగ్నెంటీ లేడీలతో యశోదకి మంచి స్నేహం ఏర్పడుతుంది. కానీ ఉన్నట్టుండి ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీలు నొప్పులొస్తున్నాయని చెప్పి సీక్రెట్ రూమ్‌కి తీసుకెళ్తారు. వారు తిరిగి రారు. బిడ్డ చనిపోయింది, వారిని ఇంటికి పంపించామని చెబుతుంటారు. కానీ ఏదో అనుమానం, ఇందులో ఇంకేదో జరుగుతుందని యశోదకి అనుమానం వస్తుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నంలో అనేక షాకింగ్ విషయాలు బయటపడతాయి. మరి ఆ షాకింగ్ విషయాలేంటి? ఆ సెంటర్‌లో ఇంకా ఏం జరుగుతుంది? దాన్ని యశోద ఎలా ఎదుర్కొంది? Yashoda Review
మరోవైపు ఈ కథకి పారలల్‌గా మరో స్టోరీ నడుస్తుంటుంది. హైదరాబాద్ లో ఓ ఇంగ్లీష్ నటి అనుమానస్పద స్థితిలో చనిపోతుంది. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. హైలీ క్వాలిఫైడ్ ఆఫీసర్లతో ఇన్వెస్టిగేషన్ జరుపుతుంటారు. ఈ క్రమంలో వరుసగా మర్డర్లు జరుగుతుంటాయి. మరి ఈ హత్యలకు, ఆ ఫెర్టిలిటీ సెంటర్‌కి ఉన్న సంబంధం ఏంటి? సమంత ఫెర్టిలిటీ సెంటర్లో ఎలా సర్వైవ్ అయ్యింది? సరోగసి వెనకాల జరిగే రహస్య మెడికల్ మాఫియా ఏంటనేది ఈ చిత్ర కథ. Yashoda Review
విశ్లేషణః
ప్రపంచంలో `బ్యూటీ` అనేది అతిపెద్ద మెడికల్ రిలేటెడ్ బిజినెస్. మధ్య తరగతి కుటుంబాల నుంచి, సంపన్న కుటుంబాల వరకు అందం కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీన్ని అసరాగా చేసుకుని కొందరు ఎంతటి దారుణమైన బిజినెస్ చేస్తున్నారనేది, దీనికోసం ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చర్చించారు. బ్యూటీ ప్రొడక్ట్స్ తయారి వెనకాల జరిగే క్రైమ్‌ని, బిజినెస్‌ని కళ్లకి కట్టినట్టు చూపించిన చిత్రమిది. దానికి సరోగసి అనే పాయింట్ ఎలా ఉపయోగపడుతుందనేది `యశోద`లో ఆవిష్కరించారు. గర్భంలో ఉన్న బేబీ కణజాలంతో బ్యూటీ ప్రొడక్ట్ లు తయారు చేస్తున్నారనే షాకింగ్ విషయాన్ని ఇందులో చూపించారు. Yashoda Review
`యశోద`లో సరోగసి ఒక్కటే మెయిన్ పాయింట్ కాదని, దానికి మించిన అంశాలుంటాయని టీమ్ చెప్పింది. చెప్పినట్టుగానే ఊహించని విషయాలను చర్చించారు. ప్రస్తుత సమాజంలో బ్యూటీ ప్రొడక్ట్ వెనకాల జరిగే క్రైమ్‌ని అద్భుతంగా ఆవిష్కరించారు. అయితే అదేదో సందేశం ఇవ్వాలనే యాంగిల్‌లో సినిమాని తీయకపోవడం ఇందులో హైలైట్ అంశం. దీనికి తోడు సమంత పాత్రలోని ట్విస్ట్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి మరో హైలైట్. సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్లలో బీజీఎం సినిమాని ఇంకో లెవల్‌లోకి తీసుకెళ్లింది.
ఇక సినిమాగా చూస్తే మొదటి భాగం చాలా వరకు బోరింగ్‌గా సాగుతుంది. చాలా అంశాలు మిస్టరీగా ఉండటంతో ఏం జరుగుతుందనేది అర్థం కాదు. పైగా ఈవా సరోగసి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఆఫీస్ స్టాఫ్‌తో, అలాగే తనతోటి ప్రెగ్నెంటీ లేడీల మధ్య జరిగే కన్వర్జేషన్ కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమాపై ఆసక్తిని డైవర్ట్ చేస్తుంది. మొదటి భాగం వరకు అసలు కథ రివీల్ కాదు. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ నుంచి సినిమా మరో లెవల్‌కి వెళ్తుంది. ఒకదాని తర్వాత ఒక్కో కొత్త విషయం తెరపైకి రావడం, సస్పెన్స్ గా, థ్రిల్లింగ్‌గా సాగడంతో ఆడియెన్స్ పూర్తిగా కథలో ఇన్‌వాల్వ్ అయిపోతారు. ఈవా స్టాఫ్ పై సమంత తిరగబడే సన్నివేశాలు ఆద్యంతం ఇంట్రెస్ట్ గా సాగుతాయి. అంతలోనే సమంత అసలు క్యారెక్టర్ రివీల్ చేసే ట్విస్ట్ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఇది `పోకిరి` సినిమా క్లైమాక్స్ ని గుర్తు చేస్తుంది. పోలీసులు చేసే సీక్రెట్ ఆపరేషన్ బయట పడ్డప్పుడు ఎంత సర్‌ప్రైజ్ ఉంటుందో ఇందులోనూ అలాంటి ఫీలింగే కలుగుతుంది. చివరి 20 నిమిషాలు సినిమాని నిలబెట్టింది. ఆడియెన్స్ కి మరో ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. దీనికితోడు మదర్ ఎమోషన్స్ మరో ప్లస్ అవుతాయి. ఓవరాల్‌గా థ్రిల్లింగ్‌గా సాగే మంచి సందేశాత్మక ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఫస్టాఫ్‌లో కొంత ఎంగేజింగ్‌గా చేస్తే సినిమా ఇంకా అదిరిపోయేలా ఉండేది.
నటీనటుల ప్రదర్శనః
సినిమాకి సమంతనే బలం. ఆమె లేకపోతే సినిమా లేదనే చెప్పాలి. తన నట విశ్వరూపం చూపించారు. ఆమె పలికించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. నటిగా మరింత పరిణతి కనబరడంతోపాటు సినిమాని తనభుజాలపై మోసింది. ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్‌లోనూ తనే కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. హీరోయిజానికి మరో అర్థాన్ని చెప్పింది. సినిమాకి హీరో ఉండాల్సిన అవసరం లేదని, తనే హీరోని మించి చేయగలను అని నిరూపించింది. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయితే ఇండియన్ సినిమాలో సమంత నెక్ట్స్ బిగ్ నేమ్‌గా మారబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇతర నటుల విషయానికి వస్తే కాస్త పాజిటివ్, ఇంకాస్త నెగటివ్ రోల్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్నిముకుందన్ సూపర్బ్ గా చేశారు. సమంత తర్వాత ఈ ఇద్దరి నటన ఆకట్టుకుంటుంది. అలాగే రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు ఎప్పటిలాగే అదరగొట్టారు. సినిమాకి తమ వంతు హెల్ప్ అయ్యారు.
టెక్నీషియన్ల పనితీరుః
హరి, హరీష్ దర్శకద్వయం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి చిత్రమిది. తక్కువబడ్జెట్ అనుకుని చేశారు. నిర్మాతతో బడ్జెట్ మారిపోయింది. లార్జ్ స్కేల్‌లో చాలా బాగా డిజైన్ చేశారు. వీరు ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉంటుంది. కాంటెంపరరీగా ఉండటంతో సాధారణ ఆడియెన్‌కి కూడా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. వారికి నచ్చిందంటే సినిమా ఇంకో లెవల్‌కి చేరుతుందని చెప్పొచ్చు. అయితే చాలా చోట్ల లాజిక్‌లు మిస్ అయ్యారు. సమంత మొదట సరోగసి సెంటర్‌కి వెళ్లడం, సరోగసి సెంటర్లో, అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ లో కొన్ని ప్రైమరీ లాజిక్స్ ని మిస్ చేశారు. అవి ఆడియెన్స్ ఈజీగా పట్టేసేలా ఉండటం గమనార్హం. అవి పక్కన పెడితే ఓ మంచి ప్రయోగం చేశారని, వారు ఎంచుకున్న కాన్సెప్ట్ ని అభినందించాల్సిందే.
సినిమాటోగ్రఫీ సినిమాకి మరో బలం. ఎం సుకుమార్ కెమెరా విజువల్ చాలా బాగున్నాయి. ఆ విషయంలో వంక పెట్టడానికి ఏం లేదు. సినిమాకి సంగీతం, బీజీఎం మరో బలం. సినిమాకి అది మరో ప్రాణం. మణిశర్మ తన అనుభవాన్ని చూపించారు. సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. మొదటి భాగంలో ఎడిటింగ్ వర్క్ కి ఇంకా పనిచెప్పాల్సింది. సినిమాలోని కొన్ని అనవసరంసీన్లు లేపేస్తే ఇంకా క్రిస్పీగా ఉండేది. ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేసేలా ఉంది. ప్రతి సెట్ వర్క్ గ్రాండియర్‌గా ఉంది. పులగం చిన్నారాయణ, చల్లా భగ్యలక్ష్మి మాటలు సినిమాకి మరింత సపోర్టివ్ గా నిలిచాయి. సింప్లీ సూపర్బ్ అనేలా ఉన్నాయి. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు సినిమాకి మరో ప్లస్. ఆయన లేకపోతే ఈసినిమా లేదనేది అందరికి తెలిసిందే.
Yashoda Movie Review
ఫైనల్‌గాః కొన్ని లాజిక్స్ పక్కన పెడితే `యశోద` మంచి సందేశాత్మక ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్. సమంత విశ్వరూపం కోసం, సందేశం కోసం చూడాల్సిన చిత్రమిది. Yashoda Review
రేటింగ్‌ః 3
Review: అయితగోని రాజు
నటీనటులు : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ, ప్రీతి అస్రాణి తదితరులు.
మాటలు : పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి
పాటలు: రామజోగయ్య శాస్త్రి
ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్
సంగీతం: మణిశర్మ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం : హరి శంకర్, హరీష్ నారాయణ్.