- Home
- Entertainment
- ట్రంప్ నిర్ణయం వల్ల మన తెలుగు సినిమాలకు ఎన్ని కోట్లు నష్టమంటే? ఆ నిర్మాతలు దుకాణం మూసేయాల్సిందే
ట్రంప్ నిర్ణయం వల్ల మన తెలుగు సినిమాలకు ఎన్ని కోట్లు నష్టమంటే? ఆ నిర్మాతలు దుకాణం మూసేయాల్సిందే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ నిర్ణయం ఇండియన్ సినిమాకి పెద్ద షాకిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపని ఆడియెన్స్
తెలుగు సినిమానే కాదు, ఇప్పుడు ఇండియన్ మూవీ ప్రమాదంలో ఉంది. ఓ వైపు పెరుగుతున్న బడ్జెట్, మరోవైపు ఆడియెన్స్ థియేటర్ కి రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. భారీ సినిమాలకే జనం కదులుతున్నారు. ఇప్పుడు సినిమా చూసే ఆడియెన్స్ సంఖ్య తగ్గిపోయింది. ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా వరకు సినిమాకి దూరమయ్యారు. కేవలం యూత్, మాస్ ఆడియెన్స్ మాత్రమే సినిమాలు చూస్తున్నారు. దీంతో రాను రాను సినిమాలకు గడ్డు పరిస్థితులు వస్తున్నాయి. అందుకే టికెట్ రేట్లు పెంచితేగానీ సినిమాలకు బడ్జెట్ రికవరీ కష్టంగా మారింది. అయినా పెట్టిన డబ్బులు వస్తున్నాయా? అంటే కష్టమనే చెప్పాలి.
వందల కోట్ల పారితోషికంతో పెరిగిన సినిమా నిర్మాణ వ్యయం
ప్రస్తుతం సినిమా నిర్మాణం భారీగా పెరిగింది. హీరోల పారితోషికాలు పెరిగాయి. పదేళ్ల క్రితం పది, ఇరవై కోట్లు తీసుకునే హీరోలు ఇప్పుడు వంద కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్ విస్తరించాక ఈ పారితోషికాలు బాగా పెరిగాయి. ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్, రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి వారు ఒక్కో సినిమాకి రూ.150 నుంచి రెండు వందల కోట్లు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సల్మాన్, అమీర్ ఖాన్, అక్షయ్, రణ్ బీర్ కపూర్, ఇటు అజిత్, యష్ వంటి వారు వంద కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు. మిగిలిన స్టార్ హీరోలు యాభై కోట్లకుపైగానే పారితోషికం అందుకుంటున్నారు. దీంతో పారితోషికాలే సినిమా బడ్జెట్‌ని అమాంతం పెంచుతున్నాయి. దీనికితోడు ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగింది. వస్తువుల రేట్లు కూడా పెరగడంతో అది సినిమా నిర్మాణంపై భారీగా భారం పడుతుంది.
నిర్మాతల పాలిట వరంగా మారిన ఓవర్సీస్ మార్కెట్, ఓటీటీ రైట్స్
ఇలాంటి పరిస్థితుల్లో పది కోట్లతో తీయాల్సిన సినిమాకి రూ.20-30కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. వంద కోట్లతో తీయాల్సిన మూవీకి రూ.200-300కోట్ల ఖర్చు అవుతుంది. ఇవి నిర్మాతకు భారంగా మారింది. ఆ ఖర్చు రాబట్టాలంటే టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. టికెట్ రేట్లు పెరగడంతో సినిమా చూసే ఆడియెన్స్ తగ్గిపోతున్నారు. అయితే ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్. ఓటీటీ మార్కెట్. ఈరెండు నిర్మాతలకు పెద్ద సపోర్ట్ గా నిలుస్తున్నాయి. పెద్ద సినిమాలకు ఓటీటీల రూపంలో భారీగానే వస్తున్నాయి. అలాగే బాగున్న సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్ల రూపంలో రిలీఫ్‌నిస్తున్నాయి. ఓవర్సీస్ అందులోనూ నార్త్ అమెరికా నుంచి మన ఇండియన్ సినిమాలకు, తెలుగు సినిమాలకు భారీగా వసూళ్లు వస్తుంటాయి. వచ్చే కలెక్షన్లలో దాదాపు 30శాతం ఓవర్సీస్ నుంచే వస్తుండటం విశేషం. ఇది నిర్మాతలకు ఆక్సీజన్‌లా మారుతుంది.
అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు
నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లని రాబట్టిన ఇండియన్ మూవీస్ చూస్తే, అత్యధికంగా అమెరికాలో `పుష్ప 2` వసూలు చేసింది. అక్కడ ఈ చిత్రానికి 40 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇప్పుడున్న అమెరికా కరెన్సీ ప్రకారం. ఈ మూవీకి అమెరికాలో రూ.360కోట్లు వచ్చాయి. ఆ తర్వాత 20 మిలియన్ డాలర్లతో `బాహుబలి 2` రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రానికి అమెరికాలో సుమారు రూ.180కోట్లు వచ్చాయి. `కల్కి 2898 ఏడీ` చిత్రానికి 18 మిలియన్ డాలర్లు(రూ.165కోట్లు), `పఠాన్`కి 17 మిలియన్ డాలర్లు(రూ.156కోట్లు), `జవాన్` 15 మిలియన్ డాలర్లు(రూ.135కోట్లు), `ఆర్‌ఆర్‌ఆర్`కి 15మిలియన్ డాలర్లు(రూ.133కోట్లు), `యానిమల్` చిత్రానికి 14 మిలియన్ డాలర్లు(రూ.126కోట్లు), `దంగల్` మూవీకి 12 మిలియన్ డాలర్లు (రూ.108కోట్లు), `పద్మావత్`కి 12 మిలియన్ డాలర్లు(రూ.107కోట్లు), `రాకీ ఔర్ రాణి కిల్ ప్రేమ కహానీ` చిత్రం పది మిలియన్లు(రూ.90కోట్లు) సాధించాయి. ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్ `ఓజీ`కి కూడా సుమారు ఐదు మిలియన్ డాలర్లు వచ్చాయి. అంటే దాదాపు రూ.45కోట్లు అక్కడి నుంచే వచ్చాయి. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన `మిరాయ్` 2.8మిలియన్ డాలర్లని వసూలు చేసింది. అంటే సుమారు రూ.26కోట్లు అక్కడి నుంచే వచ్చాయి. యానిమేషన్ మూవీ `మహావతార్ నరసింహ`కి కూడా అక్కడ రూ.15కోట్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఏడాదికి అమెరికా నుంచి ఈజీగా రూ.1500-2000 కోట్ల వరకు అమెరికా నుంచే వస్తున్నాయి. ఓవరాల్ కలెక్షన్లలో ఇవి సుమారు 20శాతానికిపైగా ఉన్నాయని చెప్పొచ్చు. ఓవర్సీస్‌లో కలెక్షన్లలో దాదాపు 75-80శాతం అమెరికా నుంచే వస్తున్నాయనేది ట్రేడ్ వర్గాల మాట.
విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్ విధిస్తూ ట్రంప్ నిర్ణయం
ఇప్పుడు ఈ కలెక్షన్లకి పెద్ద గండిపడబోతుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తెలుగు సినిమాలకు, ఇండియన్ మూవీస్‌కి పెద్ద దెబ్బగా మారబోతుంది. ట్రంప్ సినిమాలపై వంద శాతం టరీఫ్‌లు పెంచారు. అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై వంద శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమా టికెట్స్‌పై 8 శాతం ట్యాక్స్ చెల్లిస్తున్నారు. సినిమా స్థాయిని బట్టి అక్కడ టికెట్ ధర 12-20 డాలర్ల మధ్య ఉంటుంది. ఒకవేళ వందశాతం టారిఫ్ అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు ఏమాత్రం వర్కవుట్ కావని, టికెట్ ధరను రెండింతలు చేయాల్సి ఉంటుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. అప్పుడు కూడా వచ్చే కలెక్షన్లలో సగానికిపైగా టాక్స్ రూపంలో పోతుంది. ఇది ఆడియెన్స్ పై ప్రభావం పడుతుంది. సినిమా చూసే ఆడియెన్స్ భారీ తగ్గిపోతారు. ఒకవేళ 100 శాతం టారిఫ్ అమలైతే అమెరికాలో తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తెలుగు మూవీస్ మీదనే కాదు, అన్ని ఇండియన్ సినిమాలపై ఈ ప్రభావం పడుతుంది. వందశాతం టారిఫ్ చెల్లిస్తూ లాభాలు పొందాలంటే తక్కువ మొత్తానికి అమెరికా రైట్స్ అమ్మాలి. అలా అమ్మితే నిర్మాతకు గిట్టుబాటు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో మన సినిమాలను విడుదల చేసేందుకు ఏ డిస్రిబ్యూటర్లు ముందుకు రారు. ఆల్మోస్ట్ అమెరికా మార్కెట్‌ని వదిలేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏడాదికి వచ్చే దాదాపు దాదాపు రెండు వేల కోట్లని భారతీయ సినిమాలు కోల్పోవల్సి వస్తుంది. ఇది మామూలు దెబ్బ కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
చిన్న సినిమాలపై కోలుకోలేని దెబ్బ
ట్రంప్ నిర్ణయం చిన్న సినిమాలపై గట్టి దెబ్బగా మారబోతుంది. చిన్న సినిమాలు బాగుంటే, ఓవర్సీస్‌లో, అందులోనూ నార్త్ అమెరికాలో మంచి వసూళ్లని రాబడుతున్నాయి. అందుకు తేజ సజ్జా `మిరాయ్`నే ఉదాహరణ చెప్పొచ్చు. ఈ మూవీ అక్కడ సుమారు రూ.26కోట్లు రాబట్టింది. దీంతోపాటు ఇటీవల వచ్చిన `లిటిల్ హార్ట్స్` కూడా మంచి వసూళ్లని సాధించింది. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల ఈ చిత్రాలను అక్కడ విడుదల చేయడం కష్టమే. వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రారు. ఇప్పటికే చిన్న సినిమాలకు ఓటీటీ బిజినెస్ కావడం లేదు. థియేటర్ హక్కులు కూడా కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క ఆశ కూడా లేకుండా చేస్తున్నాడు. చిన్న నిర్మాతలు దుకాణం మూసేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ట్రంప్.
ట్రంప్ నిర్ణయం ఎలా ప్లస్ అవుతుందంటే?
ట్రంప్ నిర్ణయం ఒక రకంగా ప్లస్ కాబోతుంది. అది ఎలా అంటే. అమెరికాలో షూటింగ్ చేసే సినిమాలకు జీరో టాక్స్. ఎలాంటి టాక్స్ లేకుండా ఫ్రీగా షూటింగ్‌లు చేసుకోవచ్చు. అంటే అమెరికాలో చిత్రీకరించిన సినిమాలకు టాక్స్ వర్తించదు. ఈ టారిఫ్‌లు వర్తించవు. దీంతో రిలీజ్‌కి సమస్య లేదు. కలెక్షన్ల పరంగానూ నష్టం లేదు. కానీ అమెరికాలో మన సినిమాలు ఎన్ని చిత్రీకరణ జరుపుకుంటాయనేది సమస్య. ఏడాది మొత్తం రెండుమూడు, మహా అయితే పది సినిమాలు. అందులోనూ పూర్తిగా అమెరికాలోనే చిత్రీకరణ చేయడానికి కుదరదు. కేవలం పాటలు, ఏవైనా ఫారెన్ సీన్లకే సాధ్యం. ఈ రకంగా కొన్ని సినిమాలకే ఇది బెనిఫిట్‌గా ఉండబోతుంది. 99శాతం ఇది అన్ని ఇండియన్ మూవీస్‌కి దెబ్బ అనే చెప్పాలి.
హాలీవుడ్ సినిమా కళకళలాడించేందుకు ట్రంప్ నిర్ణయం
అయితే అమెరికాలో షూటింగ్ అంతా స్టూడియోలోనే జరుగుతుంది. హాలీవుడ్ సినిమాల 80శాతం చిత్రీకరణ వాటిలోనే జరుగుతుంది. కానీ కొంత కాలంగా ఆ షూటింగ్‌లు తగ్గిపోయింది. స్టూడియోలో నిర్మాణం చేసేందుకు అమెరికాలో రూపొందే చిత్రాల(హాలీవుడ్) మేకర్స్ కూడా ఆసక్తి చూపించడం లేదు. వాళ్లు చాలా వరకు విదేశాలపై ఆధాపడుతున్నారు. చాలా సినిమాలు మన ఇండియాలో, పైగా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దీంతో అమెరికాలోని స్టూడియోలు మనుగడ కోల్పోతున్నాయి. షూటింగ్‌లు లేక వెలవెలబోతున్నాయి. అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ నిర్ణయంతో ఇప్పుడు విదేశీ సినిమాలు కూడా తమ దేశంలో షూటింగ్‌లు జరుపుకోవచ్చని, ఆయా సినిమా షూటింగ్‌ల సంఖ్య పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నారట. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన వందశాతం టారిఫ్‌తో అమెరికాలో ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్లీ జీవం పోయాలని, దాన్ని ప్రపంచంలోనే అగ్రభాగంలో నిలబెట్టాలన్నది ట్రంప్ ఉద్దేశ్యం కావచ్చు.
వెయ్యి కోట్లకుపైగా మన తెలుగు సినిమాకి నష్టం
అయితే అమెరికాలో ఫిల్మ్ ప్రొడక్షన్ పరంగా ఉన్న మానవ వనరుల కొరత కారణంగా 100 శాతం టారిఫ్ అమలు అంత సులభం కాదనే సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెనడా, బ్రిటన్, బల్గేరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తక్కువ ఖర్చుతో షూటింగ్‌లు పూర్తి చేయొచ్చు. అక్కడి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కారణంగా అగ్ర నిర్మాణ సంస్థలన్నీ ఆయా దేశాల్లో చిత్రీకరణకు మొగ్గుచూపుతున్నాయి. అయితే ఈ ధోరణి వల్ల అమెరికాకు పన్నుల పరంగా రాబడి తగ్గిపోతోంది. స్థానిక కార్మికులకు కూడా ఉపాధి కరువవుతున్నది. బయటి దేశాల్లో షూటింగ్స్ చేస్తూ ఆ సినిమాలను అమెరికాలో విడుదల చేసి లాభాలను ఆర్జిస్తున్నారన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. అందుకోసమే ఆయన 100% టారిఫ్‌పై పట్టుదలతో ఉన్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఆయన నిర్ణయం వల్ల హాలీవుడ్ మూవీస్ కూడా అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకుంటాయి. దీంతో స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. స్టూడియోలు బతుకుతాయి. మళ్లీ అమెరికా సినిమా కళకళలాడుతుందని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ట్రంప్ తన ప్రకటనలో 100 శాతం టారిఫ్ అమలు గురించి ఎలాంటి విధివిధానాలు, కాలపరిమితిని వెల్లడించలేదు. దీన్ని ఎలా అమలు చేస్తారనేది క్లారిటీ లేదు. ఆ విధివిధానాలు ఖరారైన తర్వాతే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ట్రంప్ తాజా నిర్ణయం తెలుగు సినిమాకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. దీని వల్ల ఏడాదికి వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని మన తెలుగు సినిమా నష్టపోవాల్సి వస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.