2025 లో 500 కోట్ల వసూళ్లు దాటిన 4 సినిమాలు, కాంతార చాప్టర్ 1 తో పాటు మిగతా 3 ఏవి?
Top 4 Indian Films : 2025 సినిమాలకు బాగా కలిసి వచ్చింది. పెద్దా,చిన్న తేడా లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయి. ఈ ఏడాది ఏకంగా 4 సినిమాలు 500 కోట్ల వసూళ్ళ మార్కును దాటాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీకి లక్కీ ఇయర్
2025 ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా కసొచ్చింది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా, మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ప్రతీ సినిమాకు జనాలు పట్టం కట్టారు. లో బడ్జెట్ సినిమాలు కూడా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి . ఇక భారీ బడ్జెట్ సినిమాలకు 2025 లక్కీ ఇయర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఏడాది 10వ నెల నడుస్తోంది. ఈ 10 నెలల్లో బాక్సాఫీస్ వద్ద చాలా మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు భారీగా వసూళ్లు సాధించి, బ్లాక్‌బస్టర్ సినిమాల జాబితాలో చేరాయి. ముఖ్యంగా నాలుగు సినిమాలు 500 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. 500 కోట్ల మార్క్ దాటిన సినిమాలలో రెండు బాలీవుడ్ మూవీస్ ఉండగా, రెండు సౌత్ సినిమాలు ఉన్నాయి.
కాంతార చాప్టర్ 1
కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన సినిమా కాంతార చాప్టర్ 1 . 2022 లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా రూపొందిన ఈసినిమా భారీ బడ్టెట్ తో తెరకెక్కింది. అక్టోబర్ 2, 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈమూవీ, మొదటి రోజునుంచే హిట్ టాక్ తో నడుస్తోంది, భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల వసూళ్ళ మార్క్ ను దాటేసింది సినిమా. ఇండియాలోనే ఈసినిమా ఇప్పటి వరకూ 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫైనల్ రన్ లో 800 కోట్ల వరకూ సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు టీమ్. ఈసినిమాలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం ముఖ్య పాత్రల్లో నటించారు.
రజినీకాంత్ కూలీ
వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్ తరువాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తలైవా నటించిన సినిమా కూలీ. ఆగస్టు 14, 2025న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర మాత్రం డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని కూలీ సినిమా 580 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఈమూవీలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున విలన్ పాత్రలో నటించగా, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్, యలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.
చిన్నసినిమాగా వచ్చి పెద్ద విజయం
ఈ ఏడాది చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించాయి అనడానికి బెస్ట్ ఎక్జాంపుల్ సైయారా. ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో అహాన్ పాండే, అనీత్ పడ్డా అనే కొత్త హీరో, హీరోయిన్లు నటించారు. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా 18 జూలై 2025న రిలీజ్ అయింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సైయారా మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 570 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది మూవీ. అంతే కాదు ఇండియాలో ఈ బ్లాక్‌బస్టర్ సినిమా 329.7 కోట్ల నెట్ కలెక్షన్స్ ను రాబట్టింది.
బాలీవుడ్ కి ఊపిరి పోసిన సినిమా
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాలు రెచ్చిపోతున్న టైమ్ లో, బాలీవుడ్ కు ఊపిరిపోసింది ఛావా సినిమా. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న రిలీజ్ అయింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విక్కీ కౌశల్ లీడ్ రోల్‌లో నటించారు. ఆయనతో పాటు రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా 807.91 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ను సాధించిన ఛావా ఇండియాలో 601.54 కోట్లు రాబట్టింది.