`రాజుగారి కోడి పులావ్` మూవీ రివ్యూ..
ఈ శుక్రవారం చిన్న సినిమాలదే హవా. అందులో భాగంగా వచ్చిన చిత్రం `రాజుగారి కోడి పులావ్`. ఈటీవీ ప్రభాకర్ ఇందులో నటించడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. శివ కోన ముఖ్య పాత్రలో నటిస్తూ, నిర్మిస్తూ దర్శకత్వం వహించారు.స్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి ఆడియెన్స్ ఆకట్టుకుందా? థ్రిల్ కి గురి చేసిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.
ఈ శుక్రవారం చిన్న సినిమాలదే హవా. నాలుగైదు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో భాగంగా వచ్చిన చిత్రం `రాజుగారి కోడి పులావ్`. ఈటీవీ ప్రభాకర్ ఇందులో నటించడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఆయనతోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశిక్, ప్రాచీ థాకేర్, రమ్య దేష్, అభిలాష్ బండారి ప్రధానపాత్రలు పోషించారు. శివ కోన ముఖ్య పాత్రలో నటిస్తూ, ఏఎంఎఫ్, కోన సినిమా పతాకంపై అనిల్ మోదుగతో కలిసి నిర్మించడంతోపాటు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి ఆడియెన్స్ ఆకట్టుకుందా? థ్రిల్ కి గురి చేసిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రాజుగారు(ప్రభాకర్) ఒక హోటల్ ను నడుపుతూ `కోడిపులావ్ ` స్పెషల్‌తో బాగా ఫేమస్ అవుతాడు. కోడిపులావ్ టేస్ట్ దొరకాలంటే ఆయన వద్దకు రావాల్సిందే. అంతటి ఫేమస్ అయిన రాజుగారికి ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేదు. తనకో కూతురు ఉంటుంది. కానీ తనకు కొడుకు పుట్టలేదని, తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తి ఆయన్ని వెంటాడుతుంటుంది. ఓ రోజు జరిగిన ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు కోల్పోతాడు. వీక్ చైర్‌కి పరిమితమవుతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ళ తర్వాత మూడు జంటలు రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అందులో డ్యాని(శివ కోన)-క్యాండీ (ప్రాచి కెథర్) ఒక పెయిర్, ఆకాంక్ష(నేహా దేష్ పాండే)-బద్రి( కునాల్ కౌశిక్) భార్యభర్తలు. ఫారుఖ్(అభిలాష్ బండారి)-ఈషా(రమ్య దినేష్) భార్యభర్తలు. క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ వీళ్లంతా కాలేజ్ ఫ్రెండ్స్. ఈషా ఒక ఐటీ ఎంప్లయ్. ప్లానింగ్ ప్రకారం రోడ్డు ట్రిప్ కు వెళ్లిన ఈ మూడు జంటలు అడవి మధ్యలోకి వెళ్లగానే వీరి కారు ప్రాబ్లెమ్ పెడుతుంది. దీంతో ఫారెస్ట్ లో నడవాల్సి వస్తుంది. మధ్యలో అనూహ్యంగా క్యాండీ రక్తం కక్కుకుని చనిపోతుంది. తర్వాత ఇషా మిస్ అవుతుంది. ఇలా ఒక్కొక్కరు మిస్ అవుతుంటారు. చివరికి ఫరూఖ్, బద్రి, ఆకాంక్ష మిగులుతారు. ఆ తర్వాత వీరిలో ఎవరు మిస్ అయ్యారు? వీళ్లు తెలుసుకున్నా నిజాలేంటి? క్యాండీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? డ్యానీ ఎవరు? వరుస మరణాలకు కారణమేంటి? ఈ కథకి అక్రమ సంబంధాల అంశాన్ని లింకేంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో ఆడియెన్స్ కి మంచి కిక్‌నిస్తాయి. చూస్తున్నంత సేపు నెక్ట్స్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ కొనసాగుతుంది. అది థియేటర్లో కూర్చొన్న ఆడియెన్స్ కి కిక్‌నిస్తుంది. ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంటుంది. అందుకే ఈ జోనర్ చిత్రాలకు ఒక సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ వర్గం ఇలాంటి చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ కంటెంట్‌లో ఆ కిక్ లేకపోతే ఎవరినైనా డిజప్పాయింట్ చేస్తుందని చెప్పొచ్చు. `రాజుగారి కోడి పులావ్` విషయంలో అదే జరిగిందని చెప్పాలి. తీసుకున్న పాయింట్ బాగుంది. కానీ దాన్ని చెప్పిన విధానంలో దర్శకుడు తడబడ్డాడు. చెప్పాలనుకున్న విషయానికి తీసుకెళ్లిన తీరు మధ్య పొంతన కుదరలేదనే ఫీలింగ్ కలుగుతుంది. దీంతో కొంత ఓపికతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే ఇందులో అక్రమ సంబంధాలు తప్పు అనే విషయాన్ని చెప్పాలనుకున్నారు దర్శకుడు శివ కోన. ఎంచుకున్న పాయింట్ విషయంలో మాత్రం అభినందించాల్సిందే. అక్రమ సంబంధాలు ఎలాంటి చిచ్చులు పెడతాయి, ఫ్యామిలీస్‌ని ఎలా నాశనం చేస్తుంటాయనే విషయాలను ఈ సినిమా ద్వారా వెల్లడించే ప్రయత్నం చేశారు. దానికి క్యాచీ టైటిల్‌ని ఎంచుకున్నారు. కానీ అసలు విషయాన్ని బలంగా చెప్పలేకపోయారు. అప్‌కమింగ్ మేకర్ అయినా బాగానే డీల్ చేశాడు. కాకపోతే దాన్ని అంతే ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించే ఉంటే బాగుండేది. తాను చెప్పాలనుకున్న విషయం ఆడియెన్స్ కి రీచ్ అయ్యేది. కానీ క్రైమ్‌ని, మిస్సింగ్ మిస్టరీని ఎంచుకుని తడబడినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే సినిమా ఇంకా బాగా వచ్చేది.
సినిమా ప్రారంభం చాలా సరదాగా సాగుతుంది. ముగ్గురు జంటలు టూర్‌కి వెళ్తూ సరదాగా మాట్లాడుకునే విషయాలు, వాళ్లు వేసుకునే పంచ్‌లు, వారి సీక్రెట్లు ఇంట్రెస్టింగ్‌గా, ఫన్నీగా ఉంటాయి. కాసేపు ఫర్వాలేదనిపిస్తుంది. అడవిలోకి వెళ్లాక కారు ఆగిపోవడంతో సినిమా ఒక్కసారిగా సీరియస్‌గా మారుతుంది, ఉత్కంఠకి గురి చేస్తుంది. మధ్యలో డ్యాని పాత్ర వేసే పంచ్‌లు, ఇషా పాత్ర చేసే ఓవరాక్షన్ నవ్వులు పూయించేలా చేస్తుంది. సీరియస్‌లోనూ కామెడీ పుట్టించే ప్రయత్నం చేశాడు. అయితే ఒక్కొక్కరు చనిపోతుంటే, మిస్ అవుతుంటే కాసేపు భయపడి, ఆ వెంటనే మామూలుగా మారిపోతున్న తీరు కాస్త అసహజంగా అనిపించింది. ట్విస్ట్ లు రివీల్ అవుతున్న సమయంలో కాసేపు వాహ్ అనిపించినా ఆ తర్వాత సాగదీయకుండా ఉండాల్సింది. కానీ థ్రిల్ చేసే ఎలిమెంట్లు మెప్పించేలా ఉంటాయి. ఇక ఇందులో రొమాంటిక్ ఎలిమెంట్లు బోనస్‌గా చెప్పొచ్చు. వాటిని యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. బోల్డ్ డైలాగ్ లు కొందరికి ఇబ్బంది పెడితే, మరికొందరికి ఎంజాయ్ చేసేలా ఉంటాయి.
నటీనటులుః
సినిమాలో డ్యానీ పాత్రలో శివ కోన నటన హైలైట్‌గా నిలుస్తుంది. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా మూడు విభాగాలను తనపై వేసుకుని చేయడం పెద్ద ఛాలెంజ్ తో కూడిన అంశమే. నటుడిగా ఆయన మెప్పించాడు. తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. `జోకర్` తరహా యాక్టింగ్ తో మెప్పించాడు. ఇక ఆయనకు జోడీగా చేసిన ప్రాచీ కేథర్ పాత్రలోని ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సర్‌ప్రైజ్ చేస్తుంది. ఆకాంక్షగా చేసిన నేహా దేశ్ పాండే మెప్పిస్తుంది. ఇషా పాత్రలో రమ్య దినేష్ నటన నవ్విస్తుంది. బద్రిగా కూనల్ కౌశిక్, అభిలాష్ బండారి పాత్రలు ఓకే అనిపించాయి. ప్రభాకర్ కాసేపే కనిపించడం డిజప్పాయింట్‌గా ఉంటుంది.
టెక్నీషియన్లుః
డైరెక్టర్ శివ కోన అన్నీ తానై సినిమా చేశాడని అర్థమవుతుంది. తాను ఎంచుకున్న కథ బాగుంది. కొత్త దర్శకుడిగా తన బెస్ట్ ఇచ్చారు. కాకపోతే ఇంకా జాగ్రత్తగా చేయాల్సింది. కంటెంట్‌పై ఫోకస్ పెడితే బాగుండేది. మంచి సందేశాత్మక మూవీగా నిలిచేది. కమర్షియల్ అంశాలను మేళవించి ఇలాంటి సినిమా చెప్పడం సాహసమనే చెప్పాలి. థ్రిల్లింగ్ అంశాలను, సస్పెన్స్ అంశాలను మెయింటేన్ చేస్తూ ఫైనల్‌గా ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. ఈ సినిమా మ్యూజిక్ హెల్ప్ చేస్తుంది. ప్రవీన్ మణీ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఉత్కంఠబరితమైన సన్నివేశాల్లో తన చక్కని ప్రతిభను కనబరిచారు. అలాగే సినిమాటోగ్రాఫర్ పవన్ గుంటుకు విజువల్స్ బాగున్నాయి. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. సినిమాలో ఎడిటింగ్ కి చాలా పని చెప్పాల్సింది. ఆయన లోపం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకి తగ్గట్టుగా ఖర్చు చేశారు.
చిత్రం: రాజుగారి కోడిపులావ్
నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు
బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా
నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన
డైరెక్టర్ : శివ కోన
సంగీతం : ప్రవీణ్ మని
సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు
ఎడిటర్ : బసవా- శివ కోన
సౌండ్ డిజైన్ : జీ. పురుషోత్తమ్ రాజు
వీఎఫ్ ఎక్స్ : విష్ణు పడిలోజు
సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్
రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన
పీఆర్ఓ : హరీష్, దినేష్
విడుదల: 04-08-2023