- Home
- Entertainment
- నా శవాన్ని ఇండస్ట్రీలో ఎవరూ చూడకూడదు, భార్య పేరుపై రూ.50 కోట్ల ఆస్తి రాసేశా.. పోసాని సంచలన వ్యాఖ్యలు
నా శవాన్ని ఇండస్ట్రీలో ఎవరూ చూడకూడదు, భార్య పేరుపై రూ.50 కోట్ల ఆస్తి రాసేశా.. పోసాని సంచలన వ్యాఖ్యలు
ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ.. తాను చనిపోతే శవాన్ని ఇండస్ట్రీలో ఎవరూ చూడకూడదు అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. దీని కోసం నా భార్యని, కుటుంబాన్ని బాగా ప్రిపేర్ చేసినట్లు పోసాని అన్నారు.

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏ అంశం గురించి అయినా వ్యంగ్యంగా మాట్లాడడంలో ఆయన శైలే వేరు. అయితే అలా మాట్లాడి పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు. చాలా కాలం నుంచి పోసాని వైసీపీ, వైఎస్ జగన్ మద్దతు దారుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలపై సైతం పోసాని ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూస్తున్నాం.
అయితే సీఎం జగన్.. పోసానిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పోసాని ప్రస్తుతం వైసిపి పార్టీలో జగన్ కి వీర విధేయుడిగా మారారు. ప్రత్యర్థులపై విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు పోసాని. తాజాగా పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ.. తాను చనిపోతే శవాన్ని ఇండస్ట్రీలో ఎవరూ చూడకూడదు అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. దీని కోసం నా భార్యని, కుటుంబాన్ని బాగా ప్రిపేర్ చేసినట్లు పోసాని అన్నారు. నాకు ప్రస్తుతం జీవితంలో ఎలాంటి దిగులు, ఆశలు లేవు. ఇప్పుడే కాదు మొదటి నుంచి అంతే. మా అమ్మ ద్వారా నాకు ఆ గుణం వచ్చింది.
ఉన్న పళంగా ఎవరైనా నా గొంతు కోసినా, నేను చనిపోయినా చిన్న కన్నీటి బొట్టు కూడా కార్చవద్దని నా భార్యకు చెప్పా. నా శవాన్ని కూడా ఇండస్ట్రీలో ఎవరూ చూడకూడదు. ఈ విషయం కూడా నా భార్యకి చెప్పా. ఎవరూ నాపై సింపతీ చూపించడం నాకు ఇష్టం లేదు. నా శవాన్ని చూసి ఇండస్ట్రీలో ఎవ్వరూ ఏడవకూడదు. పిల్లలు కూడా ఏడవకూడదు.
ఇండస్ట్రీలో తన శవాన్ని ఎవరూ ఎందుకు చూడకూడదు అని అడగగా.. నేను ఎంతో గొప్పగా బతికాను. కాబట్టి నా శవాన్ని రక్త సంబంధం ఉన్న వారు, బంధువులు తప్ప ఇంకెవరూ చూడడానికి వీల్లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. నా భార్య నాతో గడిపిన సమయాన్నే గుర్తుంచుకోవాలి. మరణించానని ఏడవకూడదు.
నేను లేకపోయినా నా ఫ్యామిలీ సంతోషంగా జీవించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాను. నా భర్త లేడు కదా ఇప్పుడు నేనేం చేయాలని నా భార్య భయపడకూడదు. అందుకే ఆమె పేరుపై రూ 50 కోట్ల ఆస్తి రాసేశా. కాబట్టి నా భార్య ఏమీ చేయాల్సిన అవసరం లేకుండానే నెలకి రూ 9 లక్షల వరకు ఆదాయం పొందుతుంది.
పిల్లలు రేప్పొద్దున ఎలా మారతారో చెప్పలేం.. వదిలేసి ఫారెన్ వెళ్లిపోవచ్చు.. ఏమైనా జరగొచ్చు. అందుకే ఆస్తులన్నీ ఆమె పేరుపై రాశాను అని పోసాని అన్నారు. నాకు ఎలాంటి అప్పులు లేవు. కాబట్టి ఏ చింతా లేదు అంటూ పోసాని తనదైన శైలిలో ఎమోషనల్ అయ్యారు.