- Home
- Entertainment
- ఎన్టీఆర్ చెప్పినా వినని కృష్ణ.. పోటీగా సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడా? `కురుక్షేత్రం` వెనుక ఏం జరిగింది?
ఎన్టీఆర్ చెప్పినా వినని కృష్ణ.. పోటీగా సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడా? `కురుక్షేత్రం` వెనుక ఏం జరిగింది?
ఎన్టీఆర్‌తో పోటీగా సినిమా చేశాడు సూపర్ స్టార్ కృష్ణ. కానీ ఆయన ముందు నిలబడలేకపోయాడు. రామారావు ఎంత చెప్పినా వినలేదు. దీంతో చేదు అనుభవం ఎదురైంది.

ఎన్టీఆర్ అంటే పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. ఎన్టీఆర్‌కి పేరు తెచ్చిన చిత్రాలన్నీ పౌరాణికాలే. వాటిలో ఆయన్ని కొట్టేవారే లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకే ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్‌తో పోటీ పడితే ఏ హీరోకైనా చేదు అనుభవాలు తప్పవు. అలా సూపర్‌స్టార్ కృష్ణకి చేదు అనుభవం ఎదురైంది.
కృష్ణ అప్పట్లో ఎన్టీఆర్‌కి పోటీగా సినిమాలు తీస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగానూ సినిమాలు చేశారు. అయితే `కురుక్షేత్రం` సినిమా సమయంలో మాత్రం ఎన్టీఆర్‌కి పోటీగా చేశాడు కృష్ణ. ఈ మూవీ కోసం కాస్టింగ్ జరుగుతుంది. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. ఆంజనేయులు నిర్మాత. అర్జునుడుగా కృష్ణ ఎంపికయ్యారు. కృష్ణుడి పాత్రలో శోభన్‌బాబుని తీసుకున్నారు. కర్ణుడిగా కృష్ణంరాజు, దుర్యోధనుడిగా కైకాల సత్యానారయణ ఎంపికయ్యారు.
అయితే కృష్ణుడి పాత్ర కోసం మొదట ఎన్టీఆర్‌ని అడిగారు. కానీ ఆయన చేయలేదు. అంతేకాదు ఆ సబ్జెక్ట్ మీరు చేయకండి, ఆల్‌రెడీ నేను సినిమా చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పారట. తాను కాదండి జస్ట్ అందులో ఓ పాత్ర మాత్రమే చేస్తున్నా అని చెప్పాడట కృష్ణ. ఇలా దర్శక, నిర్మాతలు చేస్తున్నారు, తనకు సంబంధం లేదన్నాడట. అయినా రామారావు గట్టిగానే చెప్పారట. గతంలో `అల్లూరి సీతారామరాజు` విషయంలో ఇలానే వచ్చారు, ఇప్పుడు అలానే చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారట ఎన్టీఆర్.
అయినా దర్శక, నిర్మాతల ఒత్తిడి మేరకు తాను ఆ సినిమా చేయాల్సి వచ్చిందట. మరోవైపు సేమ్ టైమ్‌లో ఎన్టీఆర్ `దాన వీరశూర కర్ణ` సినిమా చేశారు. ఈ రెండు మూవీస్ 1977లో సంక్రాంతికి విడుదలయ్యాయి. పౌరాణికాల్లో ఎన్టీఆర్‌కి పోటీ ఎవ్వరూ నిలవరు. ఆ సమయంలో అదే జరిగింది. ఎన్టీఆర్ `దాన వీర శూర కర్ణ` ముందు కృష్ణ `కురుక్షేత్రం` నిలవలేదు. ఎన్టీఆర్ ముందు కృష్ణ తేలిపోయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో `దాన వీర శూరకర్ణ`కి జనం బ్రహ్మరథం పట్టారు.
అయితే తెలుగు స్టేట్స్ లో `కురుక్షేత్రం` ఆడలేదు, కానీ ఇతర స్టేట్స్ లో ఆడిందట. తమిళనాడు, కర్నాటక లో ఈ చిత్రం మంచి ఆదరణ పొందిందన్నారు కృష్ణ. పౌరాణిక పద్యాలు ఎన్టీఆర్‌కి ఉన్నాయి. ఆయన రెచ్చిపోయి చేశారు. చాలా అద్భుతంగా చేశారు. దాని ముందు మా మూవీ నిలబడలేదు, తెలుగు స్టేట్స్ లో పెద్దగా ఆడలేదు అని చెప్పారు కృష్ణ. కానీ ఇతర స్టేట్స్ లో బాగానే ఆడిందని, పైగా రిలీజ్‌కి ముందే బయ్యర్లు తమ సినిమాని కొన్నారట. దీంతో తమకు నష్టాలు రాలేదని తెలిపారు. బిజినెస్ పరంగా తాము సేఫ్‌లోనే ఉన్నామని తెలిపారు కృష్ణ. ఓ పాత ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. నేడు కృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆ అరుదైన విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ అన్నీ తానై చేసిన `దాన వీర శూర కర్ణ` సంచలన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేశారు. కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా మెప్పించాడు. అంతేకాదు స్వయంగా తానే దర్శకత్వం వహిస్తూ నిర్మించడం విశేషం. ఈ మూవీ అప్పట్లో ఒక సంచలనమని చెప్పొచ్చు. అలా ఎన్టీఆర్ ముందు కృష్ణ నిలవలేకపోయారు.