ఒక్క ప్రాజెక్ట్ తో మహేష్, బన్నీ, రాజమౌళి, త్రివిక్రమ్‌లను డిస్టర్బ్ చేసిన ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్క సినిమాతో అంతా చిన్నాభిన్నం చేశాడు. మహేష్‌బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, త్రివిక్రమ్‌లను డిస్టర్బ్ చేశాడు. వారి ప్లాన్స్ అన్నింటిని తలక్రిందులు చేశాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ టౌన్ అయ్యాడు. మరి ఆ కథేంటో చూస్తే..
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఓవర్ నైట్‌లో కాంబినేషన్లే మారిపోవచ్చు. ఓ హీరోతో అనుకున్న ప్రాజెక్ట్ మరో హీరోతో కావచ్చు, ఓ దర్శకుడితో అనుకున్న సినిమా మరో దర్శకుడితో సెట్ కావచ్చు. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్టీఆర్ తాజాగా తన `ఎన్టీఆర్30` చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్నట్టు ప్రకటించారు. ఉగాది స్పెషల్‌గా సోమవారం సాయంత్రం ఈ విషయాన్ని ప్రకటించి అందరికి సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ ఇచ్చారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. ఇది జూన్‌లో ప్రారంభమై, వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెరకెక్కించనున్నారు.
దీంతో త్రివిక్రమ్ డిస్టర్బ్ అయ్యారు. నిజానికి ఎన్టీఆర్ 30వ సినిమా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. త్వరలోనే ఈ అప్‌డేట్ వస్తుందని, ఈ రోజు ప్రకటించేది ఈ సినిమానే అని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా త్రివిక్రమ్‌కి హ్యాండిచ్చారు ఎన్టీఆర్. త్రివిక్రమ్‌తో సినిమా లేదని స్పష్టం చేశాడు. కొత్త సినిమా ప్రకటించారు. దీంతో మాటల మాంత్రికుడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
కొరటాల ప్రస్తుతం `ఆచార్య` చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత బన్నీతో సినిమా చేయాల్సి ఉంది. బన్నీ 21వ సినిమా కొరటాలతో అని గతంలో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాని నిర్మించబోతున్న సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఎన్టీఆర్ నిర్ణయంతో మారిపోయింది. కొరటాల.. ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటించడంతో అల్లు అర్జున్‌తో సినిమా క్యాన్సిల్ అయ్యిందని స్పష్టమవుతుంది.
దీంతో ఇప్పుడు బన్నీ ఆలోచనలో పడ్డారు. ఆయన ప్రస్తుతం సుకుమార్ తో `పుష్ప` చిత్రం చేస్తున్నారు. ఇది ఆగస్ట్ 13న విడుదల కానుంది. ఆ తర్వాత సినిమా ఏంటనేది సస్పెన్స్ లో పడింది. గతంలో ఆయన వేణు శ్రీరామ్‌తో `ఐకాన్` చిత్రాన్ని ప్రకటించారు. దాన్ని పక్కన పెట్టి కొరటాల చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు కొరటాల సినిమా లేకపోవడంతో ఆ స్థానంలో `ఐకాన్`ని మళ్లీ పట్టాలెక్కిస్తాడా? లేక మరో దర్శకుడితో చేస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాగా మహేష్‌తో చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ `సర్కారువారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకుడు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్ అయ్యిందట. మహేష్ నెక్ట్స్ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందని టాక్.
అయితే త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్‌ని, రాజమౌళిని కూడా డిస్టర్బ్ చేశాడని చెప్పొచ్చు. మహేష్ నెక్ట్స్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని అంతా అనుకున్నారు. రాజమౌళి కూడా తన తదుపరి సినిమా మహేష్‌తో అని అధికారికంగా ప్రకటించాడు. దీంతో ఇప్పుడు ఆ సినిమా వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. జనరల్‌గా జక్కన్న సినిమా అంటే చాలా టైమ్ పడుతుంది. ఈ లోపు మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట మహేష్. దీంతో రాజమౌళి కూడా కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే.
ఆ గ్యాప్‌లో అనిల్ రావిపూడితో సినిమా చేసే అవకాశం ఉందని, వీరి మధ్య చర్చలు కూడా జరిగాయని ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ తాజా ఎన్టీఆర్ ప్రకటనతో ఈ లెక్కలన్నీ మారిపోయాయి. ఒక్క సినిమా అనౌన్స్ మెంట్ ఇన్ని కాంబినేషన్లని డిస్టర్బ్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపై ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతుంది.