NTR-Balakrishna: నందమూరి హీరోల మల్టీస్టారర్ ... టైటిల్ NBK... డైరెక్టర్ ఎవరంటే?
నందమూరి ఫ్యాన్స్ కి ఇది నిజంగా కిక్ ఇచ్చే న్యూస్. ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ హీరోలుగా మల్టీస్టారర్ కథ సిద్ధం చేస్తున్నాడు ఓ దర్శకుడు. ఆ మూవీ టైటిల్ కూడా ఫిక్స్ కాగా, ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
NTR - Balakrishna
టాలీవుడ్ ని ఏళ్లుగా ఏలుతున్న నందమూరి,అక్కినేని, దగ్గుబాటి, కొణిదెల కుటుంబాల హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతూ ఉంటున్నారు. ముఖ్యంగా నందమూరి, మెగా హీరోలు కలిసి మల్టీస్టారర్స్ చేయాలని ఫ్యాన్స్ ఉబలాటం. మెగా ఫ్యామిలీ హీరోలు ఈ దిశగా ఫ్యాన్స్ కోరికలు తీర్చుతున్నారు.
ఆచార్య చిరంజీవి - రామ్ చరణ్ కలిసి చేస్తున్న పూర్తి స్థాయి మల్టీస్టారర్ అని చెప్పాలి. గతంలో చిరంజీవి సినిమాలో పవన్ తళుక్కున మెరిశాడు. ఇక చరణ్ నటించిన చిత్రాల్లో చిరంజీవి క్యామియో రోల్స్ చేశారు.
అక్కినేని హీరోలు మనం మూవీతో మరుపురాని మల్టీస్టారర్ చేశారు. ఏఎన్నార్ నుండి అఖిల్ వరకు అందరూ ఆ మూవీలో కలిసి నటించారు. అక్కినేని హీరోల ఆల్ టైం క్లాసిక్ గా మనం మిగిలిపోయింది. ఇక వెంకీ సైతం అల్లుడు నాగ చైతన్యతో వెంకీ మామ చిత్రం చేశారు. అలాగే కొడుకు రానా తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ విషయంలో నందమూరి హీరోలు వెనకబడిపోయారు.
డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న నందమూరి హీరోలు మల్టీస్టారర్స్ చేయడం లేదు. ఈ ఫ్యామిలీ నుండి స్టార్స్ గా ఎదిగింది ఇద్దరు హీరోలు మాత్రమే. ఎన్టీఆర్ నిర్మించిన సినిమా రాజకీయ సామ్రాజ్యంలో వారసులు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ కి తొమ్మది మంది కుమారులు కాగా.. వీరిలో బాలకృష్ణ, హరికృష్ణ మాత్రమే నటులయ్యారు. ఇక స్టార్ హోదా తెచ్చుకుంది మాత్రం బాలయ్య ఒక్కడే. మూడవ తరం వారసుల్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడికే స్టార్ హోదా దక్కింది. తారక రత్న పూర్తిగా ఫేడ్ అవుట్ కాగా, కళ్యాణ్ రామ్ మాత్రం ఏదో అలా నెట్టొకొస్తున్నాడు.
ఎన్టీఆర్, బాలయ్య మల్టీస్టారర్ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో వుంది. నందమూరి హీరోలు ముగ్గురు కలిసి నటించినా ఓకె అంటున్నారు. కానీ ఇది సాధ్యం కావడం లేదు. ఎన్టీఆర్-బాలకృష్ణ పరస్పరం తమ అంగీకారం తెలిపారు. మంచి కథ, డైరెక్టర్ కుదిరితే చేయడానికి సిద్దమే అంటున్నారు. కాగా గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు నందమూరి హీరోల మల్టీస్టారర్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఆయన చాలా కాలంగా ఆ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారట.
ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ నటించే ఈ ప్రాజెక్ట్ టైటిల్ NBK నట. వారి ముగ్గురు పేర్లలో మొదటి అక్షరం కలిసి వచ్చేలా, అదే సమయంలో నందమూరి బాలకృష్ణ పేరు కుదిరేలా ఈ టైటిల్ నిర్ణయించారట. నందమూరి హీరోలు పచ్చజెండా ఊపితే ప్రాజెక్ట్ ముందుకు కదలనుందట.
ఒక వేళ నిజంగా ఈ కథ నచ్చినా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. బాలయ్య, కళ్యాణ్ రామ్ సిద్ధంగా ఉన్నప్పటికీ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన ఎన్టీఆర్, ఈ మూవీ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాడని చెప్పలేం.
మరోవైపు బాలయ్య, ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఎన్టీఆర్-బాలయ్య కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. చంద్రబాబు చెప్పినట్లు నడుచుకునే బాలకృష్ణ... అన్న హరికృష్ణ కుటంబాన్ని దూరం పెట్టాడు. టీడీపీకి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ వినిపిస్తున్న డిమాండ్ బాలయ్యకు కోపం తెప్పిస్తుంది. కాబట్టి నందమూరి హీరోల మల్టీస్టారర్ అంత తేలికగా అయ్యేపని కాదు.