Bro v/s Vinodhaya Sitham: `బ్రో` సినిమాలో భారీ మార్పులు.. ఒరిజినల్‌తో పోలిస్తే ఇక్కడ ఏమేం మార్చారంటే?
`బ్రో` మూవీ ట్రైలర్ విడుదలైంది. పవన్ అభిమానులను అలరిస్తుంది. అదే సమయంలో మాతృక `వినోదయ సిత్తం` చిత్రంతో పోలికలు వెతుకుతున్నారు ఆడియెన్స్. మరి తెలుగులో చేసిన మార్పులేంటనేది చూస్తే..
పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `బ్రో`. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించారు. తాజాగా `బ్రో` ట్రైలర్ విడుదలయ్యింది. ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అదే సమయంలో సినిమా ఏంటనేది కూడా ఈ ట్రైలర్‌లో స్పష్టం చేశారు. మాస్ ఎలిమెంట్లు, పాటలు, లవ్ ట్రాక్, కామెడీ వంటి కమర్షియల్ అంశాలతో ట్రైలర్ సాగింది. అయితే దీన్ని మించి ఇందులో ఎమోషన్స్ కూడా ఉన్నాయని `బ్రో` ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్ వచ్చింది, సినిమాపై క్లారిటీ వచ్చింది. దీంతో మాతృకకి, ఒరిజినల్ కి మధ్య పోలీకలను వెతుకుతున్నారు ఆడియెన్స్.
`బ్రో`.. తమిళంలో హిట్ అయిన `వినోదయ సిత్తం` చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఆయనే దేవుడు(టైమ్)గా నటించారు. తంబిరామయ్య ముఖ్య పాత్ర పోషించారు. ఫ్యామిలీ డ్రామాగా, ఆద్యంతం ఎమోషనల్‌గా ఆ సినిమా సాగుతుంది. కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఆయన మార్క్ అంశాలను జోడించారు. పైగా సినిమా స్కేల్ కూడా మారిపోయింది. పెద్ద రేంజ్ లో తెరకెక్కించారు. దీనికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ లో ఎంట్రీతో చాలా మార్పులు జరిగిపోయాయి. మరి ఆ మార్పులేంటి? ఒరిజినల్(తమిళంలో)గా ఎలా ఉంది? `బ్రో`లో ఎలాంటి మార్పులు చేశారనేది ఓ సారి చూస్తే..
తమిళంలో(వినోదయ సిత్తం) ప్రధాన పాత్రల్లో సముద్రఖని, తంబిరామయ్య నటించారు. సముద్రఖని టైమ్‌గా, తంబిరామయ్య బ్యాంక్ మేనేజర్‌గా నటించారు. త్వరలో రిటైర్‌మెంట్ కాబోతాడు. తన ఫ్యామిలీనే సర్వస్వం అనుకునే తంబిరామయ్యకి ముగ్గురు పిల్లలు. వారిని సెటిల్ చేయాలనేది ఆయన ఆశ. కానీ అనూహ్యంగా ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఆయనలో దిగులు ఫ్యామిలీని సెట్ చేయకుండానే చనిపోయానే, ఒక్క అవకాశం ఉంటే అంతా సెట్ చేసేవాడిని అను బాధ పడుతున్న క్రమంలో టైమ్(సముద్రఖని) వచ్చి నెల రోజులు టైమిస్తాడు. ఆ తర్వాత అసలు లైఫ్ కనిపిస్తుంది తంబిరామయ్యకి. అదేంటనేది సినిమా.
`బ్రో` సినిమాలో కొంత మార్పులకు గురయ్యింది. ఇందులో టైమ్(దేవుడు)గా పవన్ కళ్యాణ్ నటించారు. తంబిరామయ్య పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించారు. ఇందులో ఓ కంపెనీ సీఈవోగా సాయి కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ పాత్ర లెంన్త్ ని ఇందులో పెంచారు. ఆయనకు పాటలు డాన్సులు పెట్టారు. తమిళంలో అవేవీ ఉండవు. ఓ మాంటేజ్ సాంగ్ మాత్రమే ఉంటుంది. `బ్రో`లో మూడు పాటలు, ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంది. అందులో ఇప్పటికే రెండు పాటలు విడుదలైన విషయం తెలిసిందే.
`బ్రో`లో సాయికి లవ్ ట్రాక్ ఉంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్‌లు నటించారు. గ్లామర్ సైడ్ యాడ్ చేశాడు. తమిళంలో ఫైట్లు ఉండవు, కేవలం ఎమోషన్స్ మాత్రమే, ఇందులో ఫైట్స్ కూడా పెట్టారు. మాస్ ఎలిమెంట్లు జోడించారు. తమిళంలో పెళ్లీడుకొచ్చిన తంబిరామయ్య పిల్లలు చుట్టూ కథ తిరిగితే, ఇందులో పెళ్లికాని సాయిధరమ్ తేజ్ వ్యాపారం, ప్రేమ చుట్టూ తిరుగుతుంటుంది. వినోదయ సిత్తం మూవీ కేవలం 99నిమిషాలుంటుంది. కానీ `బ్రో` రెండు గంటల 16 నిమిషాలుంది. తమిళ సినిమాకి కర్త, కర్మ, క్రియ దర్శకుడు సముద్రఖని, కానీ `బ్రో`కి మాత్రం ఆయన కేవలం దర్శకత్వం వహించారు, త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.
Bro Movie
`వినోదయ సిత్తం` చిత్రం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. సుమారు పది కోట్లు వసూలు చేసింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. తెలుగులో దీన్ని వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అందులో 45కోట్ల పవన్ కళ్యాణ్‌కే పారితోషికంగా అందించారు. కాస్టింగ్ కూడా పెరిగింది. ఈ సినిమా ఇప్పటికే సుమారు వంద కోట్ల బిజినెస్ చేసిందని టాక్. భారీ స్కేల్‌లో రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై వంద నుంచి 150కోట్ల కలెక్షన్ల టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నెల 28న విడుదల కాబోతున్న `బ్రో` ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.