సిల్క్ స్మిత జీవితం మరోమారు తెరపైకి
అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడిన తెలుగు అమ్మాయి సిల్క్ స్మిత జీవితం మరోమారు తెరపైకి రానుంది. సిల్క్ స్మిత బయోపిక్ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్స్ వివరాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు నిర్మాతలు.
తెలుగు అమ్మాయి సిల్క్ స్మిత జీవితం ఓ సంచలనం కాగా ఆమె మరణం సమాధానం లేని ప్రశ్న. అర్థాంతరంగా ముగిసిన సిల్క్ స్మిత జీవితం అప్పట్లో ఆమె అభిమానులను కలచి వేసింది. 1996 సెప్టెంబరు 25న సిల్క్ స్మిత చెన్నైలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించింది.
అతిగా మద్యం సేవించిన సిల్క్ స్మిత జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నారని కథనాలు రావడం జరిగింది. ఐతే ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అనేది చాలా మంది ఆరోపణ. నిజం ఏదైనా శృంగార తారగా, నటిగా, డాన్సర్ గా సౌత్ ఇండియా ప్రేక్షకులకు వినోదం పంచిన సిల్క్ జీవితం విషాదాంతం అయ్యింది.
ప్రాధమిక విద్యకూడా లేని విజయలక్ష్మీ అనే ఏలూరు పక్కన పల్లెటూరికి చెందిన ఓ అమ్మాయికి బాల్య వివాహం చేయడం జరిగింది. అత్తింటి వేధింపుల తట్టుకోలేక, పేద తల్లిదండ్రులకు భారం కాలేక చెన్నై పారిపోయింది.
అనుకోకుండా సినిమా అవకాశం దక్కించుకొని, సినిమాలకు అవసరమైన డాన్స్,నటన, భాష, చదువు నేర్చుకుంది. ఇంతటి నాటకీయ పరిణామాలు సిల్క్ జీవితంలో ఉన్నాయి.
2011లో సిల్క్ స్మిత జీవితం డర్టీ పిక్చర్ పేరుతో వెండితెరపై ఆవిష్కృతం అయ్యింది. సిల్క్ పాత్రను నటి విద్యాబాలన్ పోషించగా మిలాన్ లుత్రియా దర్శకత్వం వహించారు.
విద్యా బాలన్ జీవితాన్నే మార్చివేసిన ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా భేష్ అనిపించింది. ఈ మూవీ విషయంలో సిల్క్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం జరిగింది.
కాగా మరోమారు సిల్క్ జీవితాన్ని వెండితెరపై తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. గాయత్రీ ఆర్ట్స్, మురళి సినీ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కించనున్నారు. నటుడు మరియు నిర్మాత చిత్రాల లక్ష్మణ్, హెచ్ మురళి నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కె ఎస్ మణికందన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.