- Home
- Entertainment
- Mahesh babu: రీమేక్ అని ఇండస్ట్రీ హిట్‌ని మిస్ చేసుకున్న మహేష్.. లవర్ బాయ్ జాతకమే మారిపోయింది
Mahesh babu: రీమేక్ అని ఇండస్ట్రీ హిట్‌ని మిస్ చేసుకున్న మహేష్.. లవర్ బాయ్ జాతకమే మారిపోయింది
సూపర్ మహేష్ బాబు కెరీర్ బిగినింగ్‌లో పెద్ద బ్లండర్ చేశారు. రీమేక్ అని చెప్పి ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ చేసుకున్నారు. అది లవర్ బాయ్ తరుణ్ జాతకమే మార్చేసింది.

పాన్ వరల్డ్ ఇమేజ్ పై కన్నేసిన మహేష్ బాబు
మహేష్ బాబు.. సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు. అన్న రమేష్ బాబు హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో తమ్ముడు మహేష్ బాబు ఆ లోటుని భర్తీ చేశారు. కృష్ణకి వారసుడిగా నిలబడ్డారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళితో చేస్తోన్న సినిమాని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ అయితే ఏకంగా పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ స్టార్ అవుతారని చెప్పడం అతిశయోక్తి లేదు.
`ఒక్కడు`తో మహేష్ కెరీర్ టర్న్
మహేష్ బాబు బాలనటుడిగా సినిమాల్లోకి పరిచయం అయ్యారు. తండ్రి కృష్ణ నటించిన చిత్రాల్లోనే ఎక్కువగా కనిపించారు. ఆ తర్వాత 1999లో `రాజకుమారుడు` మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మహేష్‌కి జోడీగా ప్రీతి జింటా నటించింది. అశ్వినీదత్ నిర్మించారు. ఇది ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. జస్ట్ యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత `యువరాజు`, `వంశీ` చిత్రాలు కూడా పెద్దగా ఆదరణ పొందలేదు. మూడు సినిమాలు డిజప్పాయింట్ చేశాయి. ఈ క్రమంలో `మురారి`తో ఫస్ట్ హిట్ అందుకున్నారు మహేష్. ఆ తర్వాత `టక్కరిదొంగ`, `బాబీ` నిరాశ పరిచాయి. మళ్లీ `ఒక్కడు`తో బిగ్ బ్రేక్ అందుకున్నారు. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మహేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
`నువ్వే కావాలి`ని మిస్ చేసుకున్న మహేష్ బాబు
అయితే మహేష్ బాబు కెరీర్‌లో ఇప్పటి వరకు రీమేక్ సినిమాలు చేయలేదు. ఆయన రీమేక్‌లు చేయోద్దనే నియమం పెట్టుకున్నారు. ఈ క్రమంలో రీమేక్ అని ఒక బ్లాక్ బస్టర్‌ని మిస్ చేసుకున్నారు. ఆ మూవీనే `నువ్వే కావాలి`. ఇది మలయాళంలో హిట్ అయిన `నిరం` సినిమాకి రీమేక్. నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. దర్శకుడు కె విజయ భాస్కర్‌ని సంప్రదించగా, సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఓ మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోతో చేస్తే బాగుంటుందని నిర్మాత భావించారు. మహేష్ ని సంప్రదించారు. ఆయన్ని `నిరం` సినిమా చూడమని ప్రింట్ పంపించారు. కానీ రెండు నెలలు అయినా ఈ సినిమా చూడలేదు. దీంతో మహేష్‌ని పక్కన పెట్టి సుమంత్‌ని సంప్రదించారు. ఆ సమయంలో సుమంత్ బిజీగా ఉన్నారు.
తరుణ్‌కి లైఫ్ ఇచ్చిన `నువ్వే కావాలి`
ఆ సమయంలో ఓ యాడ్‌లో తరుణ్ కనిపించాడు. అప్పటికే బాలనటుడిగా పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. పెద్దయ్యాక చాలా క్యూట్‌గా, లవర్‌బాయ్‌గా కనిపించాడు. దీంతో తరుణ్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అదే సమయంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ జరుగుతుంది. తల్లి రోజా రమణి ఆ ప్రయత్నాల్లో ఉందని తెలిసింది. దీంతో వారిని సంప్రదించగా, ఆమె ఓకే చెప్పడం, పారితోషికం కూడా సెట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. అలా తరుణ్ `నువ్వే కావాలి` సినిమాలోకి వచ్చాడు. ఈ మూవీతోనే హీరోగా పరిచయం అయ్యాడు. బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నాడు. ఈ మూవీ అప్పట్లో యూత్‌ని బాగా ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. అలా మహేష్ బాబు రీమేక్ అనే ఆలోచనతో ఈ చిత్రం చేసేందుకు రిజెక్ట్ చేశారట. కానీ అదే సినిమా తరుణ్‌కి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు.
ఇండస్ట్రీ హిట్ అందుకున్న తరుణ్
తరుణ్ హీరోగా, రీచా పల్లాడ్ హీరోయిన్‌గా కె విజయ భాస్కర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీకి స్రవంతి రవికిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఉషాకిరణ్ మూవీస్‌పై రామోజీ రావు నిర్మించారు. 2000 అక్టోబర్ 13న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశారు. కోటీ సంగీతం అందించారు. ఈ మూవీకి సంగీతమే పెద్ద అసెట్. పాటలు హిట్ కావడంతో సినిమా జనాల్లోకి వెళ్లింది. ఫ్రెష్ లవ్ స్టోరీ కావడంతో జనం బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా కుర్రాళ్లు ఇరగబడి చూశారు. పెద్ద హిట్ చేశారు. ఈ మూవీ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుని అందుకుంది. నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. కోటిన్నర బడ్జెట్‌తో రూపొంది ఏకంగా రూ.24కోట్లు వసూలు చేసింది. ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.