- Home
- Entertainment
- తీవ్ర విషాదం, క్యాన్సర్ తో పోరాడుతూ బుల్లితెర కర్ణుడు మృతి.. రెండు ఆలయాల్లో నిత్యం ఆయనకి పూజలు
తీవ్ర విషాదం, క్యాన్సర్ తో పోరాడుతూ బుల్లితెర కర్ణుడు మృతి.. రెండు ఆలయాల్లో నిత్యం ఆయనకి పూజలు
90వ దశకంలో చారిత్రాత్మక టీవీ సిరీస్ గా నిలిచిన మహాభారతంలో పంకజ్ ధీర్ కర్ణుడిగా నటించారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ మరణించారు. పంకజ్ ధీర్ కర్ణుడి పాత్ర, ఆయన సాధించిన ఘనతల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

బుల్లితెర కర్ణుడు పంకజ్ ధీర్ మృతి
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు పంకజ్ ధీర్ (68) నేడు అంటే బుధవారం అక్టోబర్ 15న తుదిశ్వాస విడిచారు. దాదాపు 4 దశాబ్దాలు చిత్ర పరిశ్రమలో రాణించిన లెజెండ్రీ నటుడు ఆయన. పంకజ్ ధీర్ పేరు చెప్పగానే మహాభారతంలో కర్ణుడి పాత్ర గుర్తుకు వస్తుంది. 90 దశకంలో బుల్లితెరపై దూరదర్శన్ లో ప్రసారమైన చారిత్రాత్మక టీవీ సిరీస్ మహాభారతంలో పంకజ్ ధీర్ కర్ణుడి పాత్రలో నటించారు.
మహాభారతం టీవీ సిరీస్ లో కర్ణుడిగా..
90వ దశకంలో ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు మహాభారతాన్ని చూపించిన సిరీస్ అది. బిఆర్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన మహాభారతం టీవీ సిరీస్ భారతీయ సినిమా రంగం ఉన్నన్ని రోజులు చరిత్రలో ఉంటుంది. ఈ సిరీస్ లో కర్ణుడిగా పంకజ్ ధీర్ అద్భుతంగా నటించారు. కర్ణుడి పాత్రకి అప్పట్లో తాను తప్ప ఇంకెవరూ సరిపోరు అనే విధంగా ఆయన నటించారు. అలాంటి నటుడు పంకజ్ ధీర్ మరణించడంతో యావత్ భారత సినీ లోకం మొత్తం విషాదంలో మునిగిపోయింది. క్యాన్సర్ కారణంగా పంకజ్ ధీర్ మరణించారు.
క్యాన్సర్ తో పోరాడుతూ మృతి
కొంతకాలంగా పంకజ్ ధీర్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. పంకజ్ ధీర్ మృతిని ధృవీకరిస్తూ, ఆయనకి సంతాపం తెలుపుతూ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(CINTAA) అధికారికంగా స్పందించింది. 'సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ శ్రీ పంకజ్ ధీర్ గారు మరణించిన విషయాన్ని తీవ్ర షాదకర పరిస్థితిలో తెలియజేస్తున్నాం. ఆయన అంత్యక్రియలు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ముంబైలో జరుగుతాయి' అని పేర్కొన్నారు.
పంకజ్ ధీర్ కొడుకు ఎవరో తెలుసా ?
పంకజ్ ధీర్ కి భార్య అనిత ధీర్, కొడుకు నికితిన్ ధీర్ ఉన్నారు. పంకజ్ కొడుకు నికితిన్ కూడా నటుడే. నికితిన్ ధీర్ తెలుగులో కంచె చిత్రంతో నటుడిగా అడుగుపెట్టాడు. హీరోయిన్ సోదరుడిగా ఈశ్వర్ ప్రసాద్ పాత్రలో నటించింది ఇతడే.
పంకజ్ ధీర్ విగ్రహాలతో రెండు ఆలయాలు
ఇక పంకజ్ ధీర్ విషయానికి వస్తే ఆయన కర్ణుడి పాత్రలో నటనతో చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆయన పోషించిన కర్ణుడి పాత్ర విగ్రహాలని రెండు చోట్ల ప్రతిష్టించారు. ఒక ఆలయం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని బాస్టర్ అనే జిల్లాలో ఉంది. మరో ఆలయం హర్యానాలోని కర్నల్ అనే పట్టణంలో ఉంది. ఈ రెండు ఆలయాల్లో ప్రజలే తనపై అభిమానంతో కర్ణుడి విగ్రహాలని ప్రతిష్టించినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో పంకజ్ ధీర్ తెలిపారు. నిత్యం ప్రజలు అక్కడ పూజలు చేస్తుంటారట. తాను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎనలేని ప్రేమ కురిపించారని పంకజ్ గుర్తు చేసుకున్నారు. అలాంటి కర్ణుడి పాత్రని మళ్ళీ బుల్లితెరపై ఆవిష్కరించడం కష్టం అని పంకజ్ ధీర్ పేర్కొన్నారు. పిల్లలకు కర్ణుడు ఎలా ఉంటాడో తెలియజేయడానికి పాఠ్య పుస్తకాలలో పంకజ్ ధీర్ ఫోటోలే ముద్రిస్తున్నారు. ఆ పుస్తకాలలో తన బొమ్మ ఉన్నంత కాలం తాను పోషించిన కర్ణుడి పాత్ర చిరస్థాయిగా ఉంటుందని పంకజ్ అన్నారు. అలాంటి నటుడు మరణించడంతో సినీ రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.