Pawan Kalyan: అసలేం చేస్తున్నావ్ పవన్ అన్నా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఆయన వరుసగా రీమేక్స్ ప్రకటించడమే దీనికి కారణం. ఒక ప్రక్క యాంటీ ఫ్యాన్స్ రీమేక్స్ స్టార్ అంటూ ఎగతాళి చేస్తుంటే, పవన్ మాత్రం వరుసగా రీమేక్స్ ప్రకటించడం వాళ్లకు తలనొప్పిగా మారింది. అయితే పవన్ ఈ నిర్ణయాలకు కారణం త్రివిక్రమ్ అని భావిస్తున్న ఫ్యాన్స్ ఆయనను తిట్టిపోస్తున్నారు.

ప్రజాసేవకే ఇక జీవితమన్న పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కొత్త సినిమాకు సైన్ చేశాడు. మూడేళ్ళ తర్వాత అది కూడా ఓ రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు. హిందీ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ చిత్రం చకాచకా పూర్తి చేశారు. వకీల్ సాబ్ మూవీని ఎంచుకోవడానికి కారణం, చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తవుతుంది. ఆయన ప్రణాళిక ప్రకారమే నెలల వ్యవధిలో వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్.
కరోనా కారణంగా ఆ సినిమా విడుదల ఆలస్యమైంది, నిండా మునిగాక చలి ఎందుకు అనుకున్న పవన్.. ఎటూ వ్రతం చెడింది కదా అని... వరుసగా కొత్త చిత్రాల ప్రకటన చేశారు. పవన్ ని సీఎంగా చూడాలనే కలలు కంటున్న డైహార్డ్ ఫ్యాన్స్ కి ఈ నిర్ణయాలు షాక్ ఇచ్చాయి. అయితే సినిమా తప్ప మరొకటి తెలియని నాకు బ్రతకడానికి అవసరమైన డబ్బు కోసం సినిమాలు చేస్తున్నా అంటూ.. ప్రతిపక్షాలకు, ఫ్యాన్స్ కి సమాధానం, సంజాయిషీ చెప్పుకున్నాడు.
అయితే ఈ డబ్బులు సంపాదించే క్రమంలో పవన్ ఎంచుకుంటున్న సినిమాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. చిత్రీకరణకు అంతగా సమయం తీసుకొని చిత్రాలు ఎంచుకుంటున్నారు. సినిమాలో తన పాత్ర నిడివి కూడా తక్కువ ఉండేలా ఆ చిత్రాలు ఉంటున్నాయి. వకీల్ సాబ్ చిత్రం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం, నివేదా, అంజలి, అనన్య పాత్రలతోనే సరిపోతుంది. సెకండ్ హాఫ్ లో మాత్రమే పవన్ పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుంది.
ఇక భీమ్లా నాయక్ (Bheemla Nayak)కథను పరిశీలించినా ఇదే విషయం అర్థం అవుతుంది. పవన్ కి సమానంగా రానా పాత్ర ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేశారు. ముందుగా ఒప్పుకున్న హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి చిత్రాలను పక్కన పెట్టి భీమ్లా నాయక్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. తాజాగా తమిళ చిత్రం వినోదాయ చిత్తం పై పవన్ కన్నుపడినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ మూవీ ఖాయమేనట.
మరో హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న వినోదాయ చిత్తం రీమేక్ కోసం కేవలం 20 రోజులు మాత్రమే పవన్ కేటాయించారట. ఒరిజినల్ లో సముద్రఖని చేస్తున్న పాత్ర పవన్ చేస్తున్నారు. ఈ పాత్ర ఎంట్రీ చాలా లేట్ గా ఉంటుంది. సెట్స్ పై ఉన్న హరి హరి వీరమల్లు మూవీని పక్కనబెట్టి మరీ ఈ తమిళ రీమేక్ కి పవన్ రెడీ అవుతున్నాడట.
భీమ్లా నాయక్ మాదిరే (Vinodaya chittam)వినోదాయ చిత్తం వెనుక కూడా కర్త, కర్మ, క్రియ త్రివిక్రమే. ఆయన మాటలు, స్క్రీన్ ప్లే అందించనున్నారు. తక్కువ టైం లో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి పవన్ త్రివిక్రమ్ కి బంగారు గనిలా దొరికాడు. భీమ్లా నాయక్ చిత్రానికి రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ లాభాల్లో వాటా తీసుకున్న త్రివిక్రమ్... భారీగా దండుకున్నాడు. ఇక వినోదాయ చిత్తం మూవీకి కూడా అదే స్థాయిలో లేదా అంతకు మించి తీసుకోనున్నాడు. ఇలాంటి రీమేక్స్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జించే ఐడియాలు త్రివిక్రమ్(Trivikram) వే అయినా.. రెమ్యూనరేషన్ పరంగా పవన్ కి కూడా బాగానే లబ్ధి చేకూరుతుంది.
ఎలాంటి సినిమా చేసినా ఆదరించే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. పవన్ ఇమేజ్ ఎలివేట్ చేసేలా నాలుగు ఫైట్లు, కాసిని హైవోల్టేజ్ డైలాగ్స్ రాసి వదిలితే చాలు. అన్న గౌరవం కోసం సోషల్ మీడియాలో వేడుకోలు, విజ్ఞప్తులు, రెచ్చగొట్టే ట్వీట్స్ వేసి భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే ఫ్యాన్స్ ఎటూ ఉన్నారు. అసలు కథకు సంబంధం లేకుండా రాజకీయంగా మైలేజ్ తెచ్చుకోవడానికి, పవన్ వైఫల్యాలు కప్పిపుచ్చడానికి త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంటే, సగటు ప్రేక్షకుడికి వెగటు పుట్టిస్తున్నాయి.
pawan kalyan
వినోదాయ చిత్తం రీమేక్ విషయంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వ్యతిరేకత చూస్తుంటే.. అభిమానులు కూడా మనసు మార్చుకునే తరుణం దగ్గర పడుతుందనిపిస్తుంది. అసలు ఈ రీమేక్ పవన్ ఇమేజ్ కి సరిపోదు వద్దని మొరపెట్టుకుంటున్నారు. ఓ అభిమానైతే.. డబ్బులు కావాలంటే ఫండ్స్ రూపంలో మేము ఇస్తాం.. కానీ ఇలాంటి రీమేక్స్ చేయకు అన్నా.. అంటూ పవన్ ని ట్యాగ్ చేసి విజ్ఞప్తి పెట్టాడు.
pawan kalyan
అధికారమే పరమావధిగా పవన్ రాజకీయం సాగుతుంది. 2024 ఎన్నికలకు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడానికి సినిమాను మార్గంగా ఎంచుకున్నాడు. రానున్న రెండేళ్లలో సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నాడు. మన అసలు లక్ష్యం రాజ్యాధికారం అని గట్టిగా నమ్ముతున్న స్పృహ కలిగిన జనసైనికులు మాత్రం, ఈ రీమేక్ లు చేసి పరువు పోగొట్టుకోవద్దు, పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండండి, పార్ట్ టైం పాలిటిక్స్ వదిలేయండని సీరియస్ గా డిమాండ్ చేస్తున్నారు.