తగ్గేగేలే: 'హైడ్రా' దూకుడు.. మురళి మోహన్ కి నోటీసులు
చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కీలకనేతల్లో ఒకరైన సినీనటుడు మురళీ మోహన్ కు హైడ్రా నోటీసులు...
అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో ఆక్రమణలు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కీలకనేతల్లో ఒకరైన సినీనటుడు మురళీ మోహన్ కు హైడ్రా నోటీసులు పంపింది.
హైదరాబాద్ నగరంలోని రంగలాల్ కుంట చెరువులో బఫర్ జోన్ లో జయభేరీ అక్రమ నిర్మాణాలు కట్టిందని వాటిని తొలగించాలని ఆ నోటీసుల సారాంశం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రంగలాల్ కుంట చెరువు ఉంది. ఈ చెరువు చుట్టూ అన్నీ అతి భారీ భవనాలే ఉన్నాయి.
ఈ నేపధ్యంలో హైడ్రా తమకు నోటీసులు ఇచ్చిన మాట నిజమేనన్నారు మురళీమోహన్. అయితే.. జయభేరి ఎక్కడా ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు తమ సైట్‌కి వచ్చారని బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్టు గుర్తించారని మీడియాతో చెప్పారు.
గచ్చిబౌలి రంగలాల్‌కుంట చెరువు బఫర్ జోన్‌లోకి ఈ షెడ్ వస్తుందని చెప్పారన్నారు. ఆ షెడ్ తామే తొలగించేస్తున్నామని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. తాను 33 ఏళ్లుగా రియల్‌ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని అన్నారు. తమకు 15 రోజుల సమయం ఇచ్చినా.. మంగళవారం సాయంత్రంలోపు తాత్కాలిక షెడ్‌ను తొలగిస్తామని చెప్పారు.
హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో రంగలాల్‌కుంట చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించే యాక్షన్ ప్లాన్‌లో భాగంగా FTL, బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలు కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జయభేరికి చెందిన నిర్మాణాలున్న చోట.. 3 అడుగుల మేర రేకుల షెడ్ పరిధి దాటి నిర్మించినట్టు గుర్తించారు.
దాన్ని తొలగించేందుకు 15 రోజులు టైమిచ్చింది హైడ్రా.. లేదంటే తామే కూల్చేస్తామని జయభేరి సంస్థకు నోటీసులు పంపింది. రంగలాల్‌కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికుల నుంచి హైడ్రాకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో చెరువు ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరో ప్రక్క దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు .
అలాగే మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో ఉంది. దీనిలోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మించిన షెడ్లు, భవనాలను అధికారులు కూల్చివేశారు. ఎఫ్‌టీఎల్‌లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, రియల్టర్ గా మంచి గుర్తింపు తెచ్చకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా కీర్తి పొందారు. ఇక ఆయన 350కి పైగా సినిమాల్లో నటించారు. సీనియర్ నటుడు, రియల్టర్ మాగంటి మురళీ మోహన్ (Murali Mohan) తెలుగు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అప్పటి ప్రేక్షకులకు ఈయనను అభిమానించే వారి సంఖ్య ఎక్కువే.