నటి కస్తూరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, అరెస్ట్ కి రంగం సిద్ధం!
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఆమె అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధురై హైకోర్ట్ ఆమెకు షాక్ ఇచ్చింది.
నటి కస్తూరి శంకర్ సంచలన కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల ఆమె తెలుగువారిని కించపరుస్తూ మాట్లాడారు. కస్తూరి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. తమిళనాడులో బ్రాహ్మణులపై జరుగుతున్న వేధింపులను వ్యతిరేకిస్తూ జరిగిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలను ఉద్దేశిస్తూ కస్తూరి అనుచిత కామెంట్స్ చేశారు.
కస్తూరి మాట్లాడుతూ.. 400 ఏళ్ల క్రితం తెలుగు వారు తమిళనాడుకు వలస వచ్చారు. మన రాజుల అంతఃపురాల్లో ఆడవారికి సేవకులుగా ఉండేవారు. అలా వలస వచ్చినవారు తమిళులమని చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్న బ్రాహ్మణులను తమిళులు కాదంటున్నారని కస్తూరి ఆరోపణలు చేశారు. కస్తూరి తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. అలాగే కస్తూరి తెలుగువారికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కస్తూరి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంది.
నాకు తమిళనాడు పుట్టినిల్లు అయితే తెలుగు గడ్డ మెట్టినిల్లు లాంటిది. నేను తెలుగువారిని అవమానించలేదు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలు నన్ను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నాయని ఆమె అన్నారు. కస్తూరి పై కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్ కి ఆమె అప్లై చేశారు. అయితే కోర్టులో కస్తూరికి చుక్కెదురైంది.
కస్తూరి బెయిల్ పిటిషన్ మదురై హైకోర్ట్ కొట్టివేసింది. కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్ట్ మధురై బ్రాండ్ జడ్జి ఆనంద్ వెంకటేష్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కస్తూరి పరారీలో ఉండగా, పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఆమె కోసం టీమ్స్ జల్లెడ పడుతున్నాయి.
ఈ ఉదంతం అనంతరం కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అమరన్ మూవీ పై సైతం కస్తూరి ఆరోపణలు చేయడం విశేషం. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఇటీవల విడుదలైన భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ముకుంద్ వరదరాజన్ బ్రాహ్మణుడు. ఆయన భార్య క్రిస్టియన్ ఎలా అవుతుంది.. అంటూ కస్తూరి అభ్యంతర కామెంట్స్ చేసింది.
తమిళనాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కస్తూరి 1991లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం గ్యాంగ్ వార్. అనంతరం నిప్పురవ్వ, అన్నమయ్య, మా ఆయన బంగారం వంటి హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి టైటిల్ తో ఒక సీరియల్ చేసింది.
గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై కూడా కస్తూరి కీలక కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. గతంలో నేను వీటి గురించి మాట్లాడాను కూడాను. అందుకు ఒప్పుకోలేదని సినిమాల్లో నుండి తీసేశారు. ఎపిసోడ్స్ లేపేశారు. తెలుగులో అలాంటి అనుభవం లేదని అన్నారు.