కట్నం ఇవ్వలేదు, ఆ పని చేసి భర్తీ చేస్తా... మెగా కోడలు లావణ్య ఊహించని హామీ
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలిగా వెళ్లిన విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న ఈ నార్త్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
అందాల రాక్షసి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
Lavanya Tripathi
వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. హెబ్బా పటేల్ మరొక హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్స్ సమయంలో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది.
వరుణ్ తేజ్, లావణ్యల ప్రేమాయణం రహస్యంగా ఏళ్ల తరబడి సాగింది. ఓ రెండేళ్ల క్రితం మెల్లగా పుకార్లు బయలుదేరాయి. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను లావణ్య కొట్టిపారేసింది.
సడన్ గా గత ఏడాది నిశ్చితార్థం ప్రకటించారు. జూన్ నెలలో మణికొండలో గల నాగబాబు నివాసంలో వరుణ్-లావణ్యల ఎంగేజ్మెంట్ జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక నవంబర్ నెలలో ఇటలీ దేశంలో పెళ్లి చేసుకున్నారు.
కాగా తాజా ఇంటర్వ్యూలో లావణ్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారికకు ఆడపడుచు కట్నం ఇచ్ఛావా? అని లావణ్యను అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు లావణ్య ఆసక్తికర సమాధానం చెప్పింది.
నేను నిహారికకు ఆడపడుచు కట్నం ఇవ్వలేదు. అయితే ఆమె నా ఫ్యామిలీ మెంబర్. కాబట్టి తన కోసం ఏదో ఒకటి చేస్తాను. తన బ్యానర్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తాను, అని హామీ ఇచ్చింది. నిహారిక పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థ కలిగి ఉంది. సదరు బ్యానర్ లో లావణ్య ఒక చిత్రం చేస్తాను అంటుంది.
కాగా పెళ్లి తర్వాత కూడా లావణ్య యాక్టింగ్ కొనసాగిస్తోంది. ఆమె మిస్ పర్ఫెక్ట్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించాడు . ఈ సిరీస్ ఫిబ్రవరి 2 నుండి స్ట్రీమ్ కానుంది.