- Home
- Entertainment
- NTR: పిల్లికి బిచ్చం పెట్టనోడు, ఎలా సక్సెస్ అవుతాడు.. ఎన్టీఆర్‌పై కామెంట్స్ కి గిరిబాబు క్రేజీ కౌంటర్
NTR: పిల్లికి బిచ్చం పెట్టనోడు, ఎలా సక్సెస్ అవుతాడు.. ఎన్టీఆర్‌పై కామెంట్స్ కి గిరిబాబు క్రేజీ కౌంటర్
NTR: తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో ఎన్టీఆర్‌పై వచ్చిన విమర్శలు, ఆయన రాజకీయ భవిష్యత్తుపై వ్యక్తమైన అనుమానాలు, వాటికి గిరిబాబు ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ సంచలనం
తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనూ ఎన్టీఆర్ పేరు ఒక సంచలనం. అప్పటివరకు వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలిగిన నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అదొక సంచలనాత్మక నిర్ణయంగా చెప్పొచ్చు. అయితే ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాల్లో స్టార్‌గా ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోనూ రాణించగలరా? పార్టీ పెట్టి అధికారంలోకి రాగలరా? అంటూ అప్పట్లో చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.
పిల్లికి బిచ్చం పెట్టనోడు ఏం సక్సెస్ అవుతాడు.. గిరిబాబు కౌంటర్
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు ఆయన నిర్ణయాన్ని అందరూ స్వాగతించలేదు. ఇండస్ట్రీలో చాలా మంది వ్యతిరేకించారు. ఆయనతో నడవలేదు. ముఖ్యంగా అప్పటికే రాజకీయాల్లో అనుభవం ఉన్నవారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన రాజకీయ ప్రస్థానంపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించడం వేరు, రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలను నడిపించడం వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌పై వ్యంగ్యంగా విమర్శలు వచ్చాయని, పిల్లికి బిచ్చం వేయడం కూడా తెలియని వ్యక్తి పార్టీ పెట్టి ఏం సక్సెస్ అవుతాడనే తరహాలో అవహేళన చేశారని గిరిబాబు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను బయటపెట్టారు. అప్పట్లో ఎన్టీఆర్‌తో నడిచేవాళ్లు చాలా తక్కువ అని, తాను, కైకాల సత్యనారాయణ, రావుగోపాల్ రావు, మురళీ మోహన్ మాత్రమే పార్టీలో చేరారట. ఆ సమయంలో తమని చాలా మంది ఎగతాళి చేశారని, ఆయనకు రాజకీయాలు ఏం తెలుసు? పిల్లికి బిచ్చం పెట్టడు, ఆయన సీఎం ఎలా అవుతాడని విమర్శించారట.
దానికి గిరిబాబు సమాధానం చెబుతూ, పిల్లికి బిచ్చం పెట్టనోడు అయితే ఒక్కో సినిమాకి అప్పట్లో ఇరవై లక్షల పారితోషికం తీసుకుంటున్న ఎన్టీఆర్ దాన్ని వదులుకొని రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడు? ప్రజలకు సేవ చేయాలని ఎందుకు అనుకుంటాడు. భారీ పారితోషికం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యాడు, ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజలు మెచ్చిన రాజకీయ నాయకుడు అయ్యాడుగా అని వాళ్లకి కౌంటర్ ఇచ్చారు గిరిబాబు. అప్పట్లో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ కావడం విశేషం.
గిరిబాబు, ఎన్టీఆర్ మధ్య వివాదం..
గిరిబాబు నటుడు, నిర్మాత, దర్శకుడు. ఆయన అప్పట్లో కృష్ణ, తాను హీరోలుగా `సింహగర్జన` అనే జానపద చిత్రాన్ని రూపొందించారు. ఇది అప్పుడే ఎన్టీఆర్ తీస్తున్న `సింహబలుడు` మూవీకి దగ్గరగా ఉంది. దీంతో చాలా మంది మీకు పోటీగా గిరిబాబు సినిమా చేస్తున్నారని ఎక్కించి చెప్పారట. ఎన్టీఆర్ దాన్ని నమ్మాడట.
దీంతో తమ మధ్య వివాదం నెలకొందని, కృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు గొడవలు పడే స్థాయికి వచ్చిందని, దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని ఒక రోజు వెళ్లి తమ సినిమా గురించి చెప్పాడట. తమ కథ వేరు, మీ కథ వేరు అని చెప్పడంతో ఎన్టీఆర్ నమ్మాడట. ఏ పర్వాలేదు బ్రదర్, రాజీ పడకుండా సినిమాని బాగా తీయండి అన్నారట. కానీ ఆ తర్వాత రెండు సినిమాలు విడుదలయ్యాయి.
గిరిబాబు నిర్మించిన `సింహగర్జన` పెద్ద హిట్ అయ్యింది, ఎన్టీఆర్, మోహన్ బాబు కలిసి చేసిన `సింహబలుడు` మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఎన్టీఆర్ మనసు నొచ్చుకుందని, ఆ తర్వాత అది తన ముఖంలో కనిపించిందని చెప్పారు గిరిబాబు. ఈ సందర్భంగానే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎదురైన సంఘటనలు వెల్లడించారు.
టీడీపీ స్థాపించి సక్సెస్ అయిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ప్రకటించారు. పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. చైతన్య రథంపై పర్యటించి ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని అందుకోవడం భారత రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. సినిమా హీరోగా ప్రజల్లో ఉన్న ఆదరణను ప్రజా సమస్యలపై పోరాటంగా మార్చగలిగారు ఎన్టీఆర్.











