- Home
- Entertainment
- త్రివిక్రమ్ కి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? తన ప్రతి సినిమాలో ఆయనపై డైలాగ్ ఉండాల్సిందే
త్రివిక్రమ్ కి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా? తన ప్రతి సినిమాలో ఆయనపై డైలాగ్ ఉండాల్సిందే
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? తన ప్రతి సినిమాలోనూ ఆయనపై డైలాగ్స్, సీన్స్ ఉండాల్సిందే. అంతగా మాటల మాంత్రికుడు ఆరాధించే ఆ హీరో ఎవరు?

మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ ఫేమస్
తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రైటర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన కలం పదునేంటో చూపించారు. రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `స్వయంవరం`, `నిన్నే ప్రేమిస్తా`, `నువ్వే కావాలి`, `చిరునవ్వుతో`, `నువ్వు నాకు నచ్చావ్`, `వాసు`, `మన్మథుడు` వంటి చిత్రాలకు ఆయన రైటర్‌గా పనిచేశారు. వీటిలో కొన్ని చిత్రాలకు కథలు అందిస్తే, అన్ని సినిమాలకు డైలాగ్స్ రాశారు. అందుకే ఆయా సినిమాల్లో డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.
`అతడు`తో బ్రేక్ అందుకున్న త్రివిక్రమ్
`నువ్వే నువ్వే`(2002) చిత్రంతో దర్శకుడిగా మారారు త్రివిక్రమ్. తరుణ్, శ్రియా కలిసి నటించిన ఈ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీగా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంతోనే దర్శకుడిగా అందరి దృష్టిలో పడ్డారు త్రివిక్రమ్. ఇక మహేష్ బాబుతో `అతడు` మూవీ రూపొందించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. దీంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన ప్రతి సినిమాతో అలరిస్తూనే ఉన్నారు. మనుషులు, బంధాల విలువని తెలియజేస్తూ ఆయన రూపొందించే చిత్రాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనేలానే ఆయన సినిమాలుంటాయి. ఆయా చిత్రాలు ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. `అతడు` సినిమా అత్యధికంగా టీవీల్లో టెలికాస్ట్ అయిన సినిమాగా, అత్యధిక రేటింగ్ పొందిన మూవీగానూ నిలిచింది. అది త్రివిక్రమ్ రైటింగ్‌లో, సినిమా టేకింగ్‌లో ఉన్న పవర్.
త్రివిక్రమ్ ఫేవరేట్ హీరో చిరంజీవి
అయితే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌గా రాణిస్తున్న త్రివిక్రమ్ అభిమాన హీరో చిరంజీవి. సినిమాల్లోకి రావడానికి కారణం మెగాస్టార్. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు హీరో అయి, మెగాస్టార్ అవ్వగా లేనిది, ఒక రైతు కొడుకు డైరెక్టర్ కాకూడదా అని చెప్పి, చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని తాను సినిమాల్లోకి వచ్చినట్టు ఓ ఈవెంట్‌లో తెలిపారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సందర్బంగా `నా అభిమాన హీరో చిరంజీవి` అని ప్రకటించారు.
చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్న త్రివిక్రమ్
కేవలం మాటల్లో చెప్పడం కాదు, తన సినిమాల్లోనూ ఆ విషయాన్ని తెలియజేశారు త్రివిక్రమ్. చిరంజీవిపై డైలాగ్స్ పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. చివరగా త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం `గుంటూరు కారం`. ఇందులో మహేష్ బాబు పోలీస్ స్టేషన్‌కి వచ్చిన సీన్ ఉంటుంది. ఇందులో `మనకు ఆన్‌లైన్ చూసి బలుపు రాదు బాబాయ్, మనదంతా చిరంజీవి టైపు, స్వయంకృష్టి` అని చెబుతాడు మహేష్. అంతేకాదు `జల్సా` సినిమాలో ఓ విలన్‌ని కొట్టే సమయంలో `ఎవరు పంపార్రా నిన్ను` అంటే వాడు స్పందించడు, దీంతో `ఏం చేస్తాం, చిరంజీవిలా `స్వయంకృషి` చేసి కన్నుకోవాలి` అని పవన్ తో చెప్పించాడు త్రివిక్రమ్.
త్రివిక్రమ్ సినిమాల్లో చిరంజీవిపై డైలాగ్స్
ఇక అల్లు అర్జున్ `జులాయి` సినిమాలో తనికెళ్ల భరణి ఉండి డబ్బు సంపాదించడం అంతా ఈజీ అనుకుంటున్నావా? అని అల్లు అర్జున్‌ని ప్రశ్నించగా, అంతలోనే టీవీలో `డబ్బు సంపాదించడం అంత గొప్ప విషయమూ కాదు` అని ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి చెప్పే డైలాగ్ వస్తుంది. ఎవర్రా అది అని భరణి అడగ్గా, దానికి శ్రీముఖి రియాక్ట్ అవుతూ `ఛాలెంజ్` సినిమాలో చిరంజీవి` అని చెప్పగా, సౌండ్ తగ్గించమంటాడు భరణి. ఆ తర్వాత బన్నీ కల్పించుకుని హిట్ మూవీ అని చెప్పడం విశేషం. `అత్తారింటికి దారేదీ` మూవీలో చిరంజీవి, విజయశాంతిల మధ్య టాక్సీ డబ్బులకు సంబంధించిన సీన్ వస్తుంది. ఈయన ఎవరు అని పవన్ ప్రశ్నించగా, చిరంజీవి అని ఎమ్మెస్ నారాయణ చెప్పడం, చాలా బాగా చేస్తున్నాడని పవన్ అనగా, ఇప్పుడు మానేశాడు సర్ అని ఎమ్మెస్ చెబుతాడు. ఎందుకని ప్రశ్నించగా, వాళ్లబ్బాయి నటిస్తున్నట్టు ఎమ్మెస్ నారాయణ చెప్పడం విశేషం. `నువ్వే నువ్వే` సినిమాలో తరుణ్ చేత కూడా చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు త్రివిక్రమ్. రాజీవ్ కనకాలకి ఫోన్ చేసి అంజలి ఉంటే కొంచెం పిలువమ్మా అని తరుణ్ అనగా, మీరెవరు అని రాజీవ్ అడుగుతాడు. దానికి చిరంజీవి మాట్లాడుతున్నా అని, అల్లు రామలింగయ్య అల్లుడిని, అల్లు అరవింద్ బావమర్ది` అని చెప్పించాడు మాటల మాంత్రికుడు. ఆ తర్వాత మళ్లీ `జల్సా`లోనూ సంజూ అని ఓ అమ్మాయి పిలవగా, పవన్ పాటపాడుతూ వస్తాడు. అప్పుడు హీరోయిన్ `వీడెవడే చిక్కిపోయిన చిరంజీవిలా ఉన్నాడు` అంటుంది. అలా మాగ్జిమమ్ తన సినిమాల్లో చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చి ఆయనపై తనకు ఉన్న అభిమానాన్ని చాటి చెబుతున్నాడు త్రివిక్రమ్.