వ్యాపారంలో మునిగిపోయిన దీపికా పదుకొణె..? 2025లో ఎన్ని కోట్ల నష్టం వచ్చిందంటే?
Deepika Padukone Business Losses : తక్కువ ధరలకు మంచి ఉత్పత్తులు అందించే బ్రాండ్లు మార్కెట్‌ను ఆక్రమించడం, ఎస్టీ లాడర్ లాంటి గ్లోబల్ బ్రాండ్లతో పోటీ దీపికా పదుకొణెకు ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఈ ఏడాది దీపికా వ్యాపారంలో నష్టాలు చూసింది.

వ్యాపారంలో నష్టపోయిన దీపికా పదుకొణె
దీపికా పదుకొణె ప్రారంభించిన స్కిన్ కేర్ బ్రాండ్ '82°E' తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు సమాచారం. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.12.3 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్టు తెలుస్తోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించిన పత్రాల్లో ఈ విషయం స్పష్టమైంది. అదే సమయంలో, కత్రినా కైఫ్ మేకప్ బ్రాండ్ 'కే బ్యూటీ' మార్కెట్లో భారీ వృద్ధిని సాధిస్తోంది.
ఖర్చులు తగ్గించుకునే పనిలో కంపెనీ..
గత ఆర్థిక సంవత్సరంలో 21.2 కోట్లుగా ఉన్న దీపిక కంపెనీ ఆదాయం, ఈసారి 14.7 కోట్లకు తగ్గింది. 2022 నవంబర్‌లో భారీ అంచనాలతో మార్కెట్లోకి వచ్చిన ఈ బ్రాండ్ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయింది. 2024లో 23.4 కోట్ల నష్టాన్ని 12.3 కోట్లకు తగ్గించడం ఒక్కటే ఈ బ్రాండుకు ఊరట అని చెప్పవచ్చు. సంక్షోభం నుంచి బయటపడటానికి ఈ కంపెనీ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది. గతేడాది 47.1 కోట్లు ఖర్చు చేయగా, ఈసారి అది 25.9 కోట్లకు తగ్గింది. మార్కెటింగ్ ఖర్చులు 20 కోట్ల నుంచి కేవలం 4.4 కోట్లకు తగ్గాయి.
దీపికా పదుకొణెకు ఎదురు దెబ్బలు..
'82°E' మార్కెట్లో ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు అధిక ధరలే. ఉత్పత్తుల ధరలు 2,500 నుంచి 4,000 వరకు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లతో భారీగా ప్రచారం చేసినా, ఈ బ్రాండ్ సామాన్యులకు చేరలేకపోయింది. ఫాక్స్‌టైల్, ప్లమ్, డాట్ & కీ లాంటి బ్రాండ్లు తక్కువ ధరలకు లభించడం, మంచి ఉత్పత్తులను కూడా అందించి మార్కెట్‌ను ఆక్రమించడం దీపికకు ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఎస్టీ లాడర్ లాంటి గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లతో పోటీ కూడా తీవ్రంగా ఉంది.
దూసుకుపోతున్న కత్రీనా కైఫ్
దీపిక బ్రాండ్ నష్టాల్లో ఉన్నా, కత్రినా 'కే బ్యూటీ' వేగంగా వృద్ధి చెందుతోంది. నైకాతో కలిసి ప్రారంభించిన ఈ కంపెనీ 2019 నుంచి లాభాల్లో నడుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 88.23 కోట్ల ఆదాయం, 11.3 కోట్ల లాభం సంపాదించింది. ఈ ఏడాది ఆదాయం 100-105 కోట్లకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలో 51 శాతం వాటా నైకాకు, 42 శాతం కత్రినాకు ఉన్నాయి.

