- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: కన్నడలో లాగా బిగ్ బాస్ తెలుగు 9 క్లోజ్ అవుతుందా? షో నిలిపివేయాలని ఫిర్యాదు
Bigg Boss Telugu 9: కన్నడలో లాగా బిగ్ బాస్ తెలుగు 9 క్లోజ్ అవుతుందా? షో నిలిపివేయాలని ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 9 షో ని నిలిపివేయాలని ఫిర్యాదు అందింది. మొన్న కన్నడలో బిగ్ బాస్ షోని ఆపేశారు. ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి పరిస్థితే ఎదురు కాబోతుందా? అనేది సస్పెన్స్ గా మారింది.

బిగ్ బాస్ తెలుగు 9 ఆపేయాలని ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 9 క్లోజ్ కాబోతుందా? మొన్న కన్నడలో బిగ్ బాస్ షో క్లోజ్ అయ్యింది. కాలుష్య నియంత్రణ అధికారులు ఆ స్టూడియోని క్లోజ్ చేశారు. కంటెస్టెంట్లని తీసుకెళ్లి ఒక రీసార్ట్ లో ఉంచారు. అయితే అలాంటి పరిస్థితే ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ విషయంలో జరుగుతుందా. తాజాగా ఓ వ్యక్తి బిగ్ బాస్ తెలుగు షోని నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడలో మాదిరిగానే తెలుగులోనే ఈ షోని ఆపేయాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యువతని తప్పుదోవ పట్టించేలా బిగ్ బాస్ షో
బిగ్ బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్‌కి చెందిన యువకులు కమ్మరి శ్రీనివాస్, బి రవీందర్ రెడ్డి బంజరాహిల్స్ పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేని వారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్నాటకలో బిగ్ బాస్ షోని ఆపేసిన నేపథ్యంలో దాని తరహాలోనే తెలుగులో కూడా బిగ్ బాస్ షోని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌజ్‌ని ముట్టడిస్తామని చెప్పారు.
దివ్వెల మాధురీ, రీతూ చౌదరీని ఎంపిక చేసి ఏం సందేశం ఇస్తున్నారు?
నాగార్జున కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. దివ్వెల మాధురీ, రీతూ చౌదరీ లాంటి వారిని కంటెస్టెంట్లుగా సెలక్ట్ చేసుకుని సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఇదిప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కన్నడలో లాగా తెలుగు బిగ్ బాస్ షోని కూడా నిలిపివేస్తారా? అనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. అయితే దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.
ఆగిపోయిన బిగ్ బాస్ కన్నడ 12 షో
ఇదిలా ఉంటే గతవారం కన్నడలో బిగ్ బాస్ 12 వ సీజన్ షోని నిలిపివేసిన విషయం తెలిసిందే. షో జరుగుతున్న బిడదిలోని అమ్యూజ్‌మెంట్ పార్క్ జూలీవుడ్ స్టూడియో నుంచి కలుషితమైన నీరు బయటకు వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన కాలుష్య నియంత్రణ మండలి బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు పంపింది. దాన్ని వాళ్లు పట్టించుకోలేదు. దీంతో అధికారులు డైరెక్ట్ గా రంగంలోకి దిగి స్టూడియోని సీజ్ చేశారు. కంటెస్టెంట్లని కొన్ని రోజులు రీసార్ట్ లో ఉంచారు. ఆ తర్వాత సరైన అనుమతులతో తిరిగిన ప్రారంభించినట్టు సమాచారం. మరి ఇప్పుడు కన్నడలో మాదిరిగానే తెలుగులో కూడా జరుగుతుందా అనేది చూడాలి.
బ్రోతల్ హౌజ్ అంటూ సీపీఐ నారాయణ ఫైర్
ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ షోపై పలు విమర్శలున్నాయి. చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజా సంఘాలు ఇందులో ముందున్నాయి. సీపీఐ నాయకులు నారాయణ తరచూ దీనిపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదొక బ్రోతల్ హౌజ్ అంటూ ఆయన గతంలో వ్యాఖ్యానించారు. దీన్ని బ్యాన్ చేయాలని ఆయన వెల్లడించారు. ఇటీవల కూడా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బిగ్ బాస్ షోని అద్భుతం అంటుంటారు. అది కరెక్టేనా అని ఆయన ప్రశ్నించారు. ఒక ఇంట్లో ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేని కొంత మంది అమ్మాయిలు, అబ్బాయిలను ఉంచి వంద రోజులు మీకు నచ్చినట్టు ఉండండి అని చెప్పడమేంటి. దాన్ని చూసిన జనం బయట ఏమనుకుంటారు. ఇది బ్రోతల్ హౌజ్‌లా ఉందనే అంటారు. కాకపోతే దీన్ని కొందరు సోషల్ ఎక్స్ పీరియెన్స్ గా చెబుతున్నారు. బిగ్ బాస్ షోని బ్రోతల్ హౌజ్ అని పిలిస్తే అది మీకు నచ్చకపోవచ్చు, కానీ నిజం చెప్పాలంటే ముక్కు మొహం తెలియని వాళ్లని తీసుకెళ్లి ఓ ఇంట్లో పెడితే వాళ్లని మన వద్ద అలాంటి మాటలే మాట్లాడుకుంటారు. మన కల్చర్‌లో ఇలాంటిది ఉంటుందా? అని ప్రశ్నించారు.
నాగార్జున ఇలాంటి షో చేయడం కరెక్ట్ కాదు
ఈ సందర్భంగా హీరో, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై కూడా ఫైర్ అయ్యారు నారాయణ. అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు. తెలుగు కళామతల్లికి ఆయన ముద్దుబిడ్డ. అలాంటి మహా మనిషి కొడుకైన నాగార్జున ఇలాంటి చెడు కల్చర్‌ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన ఎన్నో మంచి సినిమాలు తీసి విజయం సాధించారు. మంచి ప్రేక్షకాదరణ పొందారు. ఈ స్థాయికి వచ్చారు. ఆయన ఇలాంటి షోకి హోస్ట్ గా ఉండటం కరెక్ట్ గా లేదని తెలిపారు నారాయణ. ఇలాంటి నీచమైన షో ద్వారా వచ్చే డబ్బులు అవసరమా అంటూ నాగార్జునని ప్రశ్నించారు. గతంలోనూ రెచ్చిపోయిన ఆయన తాజాగా మరోసారి హాట్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ షోనే క్లోజ్ చేయాలని పోలీసులకు ఫిర్యాదులు రావడం గమనార్హం.