మరోసారి తెరపైకి బ్రో మూవీ వివాదం.. శ్యాంబాబు పాత్రలో రాష్ట్రమంతా తిరుగుతా, కమెడియన్ పృథ్వీ కామెంట్స్
30ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో కమెడియన్ పృథ్వీ టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి.
30ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో కమెడియన్ పృథ్వీ టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మహిళతో ఫోన్ సంభాషణ లీక్ అయిన కారణంగా పృథ్వీ పదవి కోల్పోవడం, ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరిగింది.
కమెడియన్ పృథ్వీ చాలా కాలంగా రాజకీయాల్లో సైతం వార్తల్లో నిలుస్తున్నారు. మొదట వైసిపిలో జాయిన్ అయిన పృథ్వీ ఆ తర్వాత వివాదాలతో ఆ పార్టీకి దూరం అయ్యారు. తర్వాత పృథ్వీ క్రమంగా జనసేన పార్టీ మద్దతుదారుడిగా మారారు. అయితే తాజాగా పృథ్వీ కుటుంబ సమేతంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పృథ్వీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతరం పృథ్వీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బ్రో చిత్రంలో పృథ్వీ పోషించిన శ్యామ్ బాబు పాత్ర ఎంత వివాదం అయిందో తెలిసిందే. మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ ఆ పాత్ర క్రియేట్ చేసినట్లు పెద్ద కాంట్రవర్సీనే అయింది.
అయితే జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత కమెడియన్ పృథ్వీ మరోసారి బ్రో మూవీ వివాదం రేపారు. శ్యాంబాబు పాత్రలో రాష్ట్ర మంతా తిరిగి జనసేన టిడిపి కూటమికి ప్రచారం చేస్తానని పృథ్వీ ప్రకటించడం సంచలనంగా మారింది. శ్యాంబాబు వేషధారణ ధరించి రాష్ట్రం మొత్తం తిరుగుతానని అన్నారు.
అందరూ కోరుకుంటే అంబటి రాంబాబు నియోజకవర్గం సత్తెనపల్లి నుంచే శ్యాంబాబు పాత్రలో ప్రచారం మొదలు పెడతానని అన్నారు. టికెట్ కానీ పదవి కానీ తాను ఆశించడం లేదని పృథ్వీ అన్నారు. పృథ్వీ మాట్లాడుతూ ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయింది అని రాబోయేది జనసేన టిడిపి ప్రభుత్వమే అని పృథ్వీ అన్నారు.
బ్రో చిత్రంలో శ్యాంబాబు పాత్ర వైరల్ అయినప్పుడు అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించి మరీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు పృథ్వీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తారో లేదో చూడాలి.