బన్నీ కంటే ముందే థియేటర్ రచ్చలో అరెస్టైన అల్లు అరవింద్, చిరుని తిట్టిన వ్యక్తిని ఉతికేసి..మ్యాటర్ సీఎం దాకా
ప్రస్తుతం అల్లు అర్జున్ వయసు 42 ఏళ్ళు. అల్లు అరవింద్ కూడా తన వయసు 40 లలో ఉన్నపుడు థియేటర్ దగ్గర జరిగిన గొడవ కారణంగా అరెస్ట్ అయ్యారట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. రేవతి అనే మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ ని సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు ఎ 11 నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం మ్యాటర్ ఇంకా సీరియస్ కావడం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటనని చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే.
కాలేజ్ డేస్ లో రెబల్ గా అల్లు అరవింద్
ప్రస్తుతం అల్లు అర్జున్ వయసు 42 ఏళ్ళు. అల్లు అరవింద్ కూడా తన వయసు 40 లలో ఉన్నపుడు థియేటర్ దగ్గర జరిగిన గొడవ కారణంగా అరెస్ట్ అయ్యారట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు. ఆ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వయసులో ఉన్నపుడు తాను బాగా రెబల్ గా ఉండేవాడిని అని అల్లు అరవింద్ తెలిపారు. ఎవరు తప్పు చేసినా భరించేవాడిని కాదు.
బస్సు డ్రైవర్, కండక్టర్ పై దాడి
చెన్నైలో కాలేజీలో చదువుతునప్పుడు నేను నా ఫ్రెండ్స్ సిటీ బస్ లో ప్రయాణిస్తున్నాం. అది కాలేజీ స్టూడెంట్స్ కోసం వేసిన స్పెషల్ బస్. కండెక్టర్ కి మా ఫ్రెండ్స్ కి గొడవ జరిగింది. వెంటనే మేమంతా కలసి బస్సు ఆపేసి కండెక్టర్ ని, డ్రైవర్ ని కొట్టి కిందికి దింపేసాం. బస్సుని మేమే డ్రైవ్ చేసుకుని స్టూడెంట్స్ ని వారి వారి ఏరియాల్లో డ్రాప్ చేశాం. ఆ తర్వాత పోలీసులు మా ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు.
ఎంజీఆర్ దగ్గరకి అల్లు రామలింగయ్య
దీనితో అల్లు అరవింద్ నాన్నగారు లెజెండ్రీ అల్లు రామలింగయ్య రంగంలోకి దిగారట. అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో మాట్లాడి బెయిల్ ఇప్పించారట. కేసు కొన్ని రోజులు సాగింది. అల్లు రామలింగయ్య ఎంజీఆర్ తో మాట్లాడడం వల్ల పోలీసులు అల్లు అరవింద్ కి వార్నింగ్ ఇచ్చి కేసు కొట్టేశారట. నేను స్టూడెంట్ కాబట్టి వార్నింగ్ తో సరిపెట్టారు అని అల్లు అరవింద్ నవ్వుతూ చెప్పారు. కొన్ని రోజులు ఆ వార్త పత్రికల్లో హాట్ టాపిక్ అయింది.
థియేటర్ దగ్గర మరో సంఘటన
మరో సంఘటన నాకు 40 ఏళ్ళు దాటాక జరిగింది. చెన్నైలో దేవి, శ్రీదేవి అనే థియేటర్స్ ఉన్నాయి. ఆ థియేటర్స్ లో అల్లు అరవింద్ పార్ట్నర్ అట. ఒక పెద్ద ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవారు. అతడి పేరు చెప్పను. మా నాన్నగారి కాల్ షీట్, చిరంజీవి, శ్రీదేవి ఇలా కొందరు స్టార్స్ కాల్ షీట్స్ ని ఆటాడు మేనేజ్ చేసేవారు. చిరంజీవి గారు ఆ టైంలో అతడికి కాల్ షీట్స్ ఇచ్చి ఉన్నారు. కఆయన చాలా ట్యాలెంటెడ్ కానీ ఒక సమస్య ఉంది.
తాగేసి చిరంజీవిపై బూతులు
అతడికి తాగుడు అలవాటు ఎక్కువ. తాగితే మనిషి కాదు. అప్పటికే కొన్నిసార్లు అతడు మందు తాగి చిరంజీవి గారిపై కామెంట్స్ చేశారు. నేను వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేశా. ఇకపై చిరంజీవి గారి కాల్ షీట్స్ జోలికి వెళ్ళకు అని వార్నింగ్ ఇచ్చాను. ఇదంతా చిరంజీవి గారికి తెలియకుండా మేనేజ్ చేశా. ఒకసారి అతడి గురించి చిరంజీవి గారికి కూడా తెలిసింది. వాడిని ఒకసారి నా దగ్గరకి తీసుకురా.. బుద్ది చెబుతా అని చిరంజీవి అన్నారు.
నేను, నా ఫ్రెండ్స్ కొంతమంది ఒక రోజు శ్రీదేవి థియేటర్ లో సినిమా చూస్తున్నాం. అక్కడికి అతడు ఫుల్ గా తాగేసి వచ్చాడు.. చిరంజీవి ఎక్కడ బయటకి రమ్మను అంటూ మత్తులో ఊగిపోతూ బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.. గొడవ చేయడం బాగోదు అని కారులో ఎక్కించబోయా .. నన్ను కిందకి తోసేశాడు. చిరంజీవిని బూతులు తిట్టడం ఆపడం లేదు. అతడు మాట్లాడే మాటలు వింటే కోపం నషాళానికి చేరుకుంది.
కాలర్ పట్టుకుని ఉతికేసిన అల్లు అరవింద్
వెంటనే నా వాచ్, కళ్ళజోడు పక్కన పెట్టి కాలర్ పట్టుకుని ఉతికేశాను. అల్లు అరవింద్ కొట్టడంతో అతడికి 13 కుట్లు పడ్డాయట. చిరంజీవి గారు కూడా థియేటర్ లోనే ఉన్నారు. చిరంజీవి గారు ఆ బూతులు విని ఉంటే ఆయనకి ఇంకా కోపం వచ్చేది. ఒక వేళ చిరంజీవి ఆ గొడవలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఎంత పెద్ద ఇష్యూ అయ్యేదో ఊహించుకోండి అని అల్లు అరవింద్ అన్నారు. చిరంజీవి గారిని ఎవరు ఎమన్నా అంటే ఊరుకునే వాడిని కాదు అని అల్లు అరవింద్ అన్నారు.