Beast Review: బీస్ట్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. థళపతి విజయ్‌కి బౌన్సర్ పడిందా?
`మాస్టర్` తర్వాత విజయ్ నుంచి వస్తోన్న చిత్రం `బీస్ట్`. పూజా హెగ్డే కథానాయకగా, `డాక్టర్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన `బీస్ట్` బుధవారం విడుదలవుతుంది. ఈ సినిమా విదేశాల్లో షోలు పడ్డాయి. `బీస్ట్` ట్విట్టర్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
`థళపతి` విజయ్ `మాస్టర్` తర్వాత నటించిన చిత్రం `బీస్ట్`. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. `కోలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాలతో తమిళంలో దర్శకుడిగా నిరూపించుకున్నారు నెల్సన్. పూజా హెగ్డే ఇందులో ఫస్ట్ టైమ్ విజయ్‌కి జోడీ కట్టింది. జనరల్‌గా విజయ్ సినిమా అంటూ భారీ అంచనాలుంటాయి. `బీస్ట్` చిత్రంపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యాన్స్ ముందునుంచే సంబరాలు స్టార్ట్ చేశారు. పైగా ఈ సినిమాకి విజయ్ తన సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తూ ప్రమోషన్ కూడా చేశాడు. దీంతో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. విడుదలైన ట్రైలర్ పూనకాలు తెప్పించేలా ఉంది. Beast Twitter Review,
మరోవైపు పాటలు వంద మిలియన్స్ దాటి చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇవన్నీ `బీస్ట్` పై అంచనాలకు ఆకాశమే హద్దుగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో `బీస్ట్` భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా బుధవారం(ఏప్రిల్ 13)న విడుదలవుతుంది. సింగపూర్ లాంటి దేశాల్లో మంగళవారం రాత్రి నుంచే షోస్ పడ్డాయి. ఈ సందర్భంగా అభిమానులు ట్విట్టర్‌లో తమ రివ్యూలను వెల్లడిస్తున్నారు. సినిమా ఎలా ఉందో కామెంట్ చేస్తున్నారు. `బీస్ట్` ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.
షాపింగ్ మాల్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. ఉగ్రవాదులు ఎటాక్ చేయడంతోపాటు భారీ షాపింగ్ మాల్‌ని హైజాక్ చేస్తారు. వారి ఆదీనంలో కొంత మంది అమాయక ప్రజలుంటారు. ఉగ్రవాదుల నుంచి అమాయక ప్రజలను కాపాడేందుకు విజయ్ ఏం చేశాడు, షాపింగ్ మాల్‌లో ఏం జరిగింది, విజయ్ గతం ఏంటి? అనేది సినిమా కథగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ ల ప్రకారం సినిమాపై మిక్స్ డ్ టాక్ వస్తుంది. విజయ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే చిత్రమంటున్నారు నెటిజన్లు. విజయ్‌లోని కొత్త యాంగిల్ నటనని ఈ సినిమాలో చూడొచ్చంటున్నారు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారని, చాలా స్టయిలీష్‌గా నటించారని చెబుతున్నారు. విజయ్ విశ్వరూపం చూపించారనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. విజయ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని, ఫ్యాన్స్ మూవ్‌మెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఫస్టాఫ్ బ్లాస్ట్ అని, నెల్సన్ వేరే లెవల్‌లో సినిమా తీశారని చెబుతున్నారు. రాజకీయాలకు సంబంధించి, సిస్టమ్‌పై ఇదొక వ్యంగాస్త్రంగా ఉండబోతుందని చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు.
మరోవైపు చాలా వరకు సినిమా ఆశించిన స్థాయిలో లేదనే టాక్ వస్తుంది. యావరేజ్ ఫిల్మ్ అని, అంచనాలు లేకుండా సినిమా చూస్తే నచ్చుతుందని, ఒక్కసారి మాత్రమే చూడొచ్చని అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంటుందని, సెకండాఫ్ అంతకంటే పడిపోయిందని, చాలా స్లోగా, బోరింగ్‌గా ఉందని అంటున్నారు. విజయ్ ఈ స్క్రిప్ట్ ఎంచుకుని మిస్టేక్స్ చేశారనే కామెంట్లు వస్తున్నాయి. కథ, కథనాలు అస్సలు బాగా లేవని, నెల్సన్ ఈ సారి డిజప్పాయింట్ చేస్తారని, సినిమాని సరిగా డీల్ చేయలేదంటున్నారు.
విజయ్ కామిక్ టైమింగ్ చాలా పూర్ అని, ఈ చిత్రంతో మరోసారి నిరూపితమైందని, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా పూర్‌గా ఉన్నాయంటున్నారు. జెట్ సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు ట్విట్టర్ ఆడియెన్స్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకి ప్లస్ అంటున్నారు. విజయ్ మార్క్ యాక్షన్ బాగున్నా, అంతకు మించి సినిమాలో ఆకట్టుకునే అంశాలు లేవని, చాలా ఓల్డ్ కంటెంట్ ఇదని అంటున్నారు.
అయితే విజయ్ ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోతుందట. బెస్ట్ ఇంట్రో సీన్ అంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ కి అంతో ఇంతో నచ్చుతుందని, కానీ జనరల్ ఆడియెన్స్ కి నిరాశ తప్పదని చెబుతున్నారు. పూజా గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ అని, మంచి కమర్షియల్ చిత్రమని అంటున్నారు. మొత్తంగా ట్విట్టర్ ఆడియెన్స్ నుంచి మాత్రం `బీస్ట్` చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. మరి నిజంగానే సినిమా ఎలా ఉంది? విజయ్ సిక్సర్ కొట్టాడా, లేదా బౌన్సర్ పడిందా ..? మన ఇండియన్ ఆడియెన్స్ కి నచ్చుతుందా లేదా అనే విషయాలను `ఏషియానెట్` పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.