- Home
- Entertainment
- అల్లూరి సీతారామరాజు మూవీ రివ్యూ, ఎన్టీఆర్ ను ఎదిరించి, సక్సెస్ సాధించిన కృష్ణ, రామారావు ఏమన్నాడంటే?
అల్లూరి సీతారామరాజు మూవీ రివ్యూ, ఎన్టీఆర్ ను ఎదిరించి, సక్సెస్ సాధించిన కృష్ణ, రామారావు ఏమన్నాడంటే?
విప్లవ యోధుడు సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని రూపొందించబడిన సినిమా అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ పట్టుదలతో పూర్తి చేసిన ఈమూవీలో ఎన్నో విశేషాలున్నాయి. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం.

50 ఏళ్ల అల్లూరి సీతరామరాజు
స్వాతంత్ర్య సమరయోధుడు , గిరిజన విప్లవ నాయకుడిగా అల్లూరి సీతారామరాజుది ఆంధ్రచరిత్రలో ప్రత్యేక పాత్ర. ఆయన జీవితం ఆధారంగా తీసిన సినిమానే అల్లూరి సీతారామరాజు. ఈసినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ ఎంతో పట్టుదలతో, ఇబ్బందులు అధిగమించి మరీ తెరకెక్కించారు. 1974లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. రీసెంట్ గా అల్లూరి సీతారామారాజు సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ కొత్త చరిత్రను సృష్టించిందని చెప్పాలి. ఈసినిమాను మొదటగా వి. రామచంద్రరావు డైరెక్ట్ చేశారు. కాని ఆయన అకాల మరణంతో కే.ఎస్ .ఆర్ దాస్ చేతికి ఈసినిమా వెళ్ళింది. ఆయన ఈసినిమాలో పోరాట సన్నివేశాలను డైరెక్ట్ చేసి పూర్తి చేశారు. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ఈ సినిమా పూర్తయింది. ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సంయుక్తంగా సీతారామరాజు సినిమాను నిర్మించారు.
KNOW
సూపర్ స్టార్ కృష్ణ 100వ సినిమా
ఈసినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను సూపర్ స్టార్ కృష్ణ పోషించారు. భారతీయ సినిమాలలో గొప్ప చరిత్రను ఈసినిమా తిరగరాసింది. అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణకు 100వ సినిమా. ఆయన మూవీ కెరీర్ లో ఇది మైలురాయిగా నిలిచింది. నంది పురస్కారం తో పాటు ఆఫ్రో-ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమా ప్రదర్శించబడి అరుదైన గౌరవాన్ని పొందింది. ఎన్టీఆర్ తో కృష్ణకు విభేదాలు కొనసాగుతున్న టైమ్ లోనే పెద్దాయిన ఈసినిమాను చూసి, కృష్ణ నటనను మెచ్చుకున్నారు. ఈ పాత్రను ఇంత బాగా మరెవరు పోషించలేరు, ఈ చిత్రాన్ని అంత గొప్పగా ఇంకెవరు తీయలేరు, అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అంతకు ముందు ఈసినిమాను తాను తీద్దామనుకుని ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నారు.
కథ విషయానికి వస్తే..
అల్లూరి సీతారామరాజు చిన్నతనంలోనే బ్రిటీష్ పరిపాలన పట్ల వ్యతిరేకత చూపాడు. ఆంగ్ల విద్యను తిరస్కరించి భారతీయ యోగవిద్యను అభ్యసించాడు. ఆతరువాత రోజుల్లో ఆయన దేశమంతా పర్యటించి బ్రిటీష్ పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకున్నాడు. ఆహింసా విధానాన్ని తిరస్కరించి, ప్రజల మధ్య తిరుగుబాటు ప్రేరేపించాడు. బ్రిటీష్ పాలకులకు ఎప్పటికప్పుడు చుక్కులు చూపిస్తూ, వారిపై డాడులు చేస్తూ.. కష్టజీవుల వెన్నంటే ఉంటూ వచ్చాడు. హింసకు గురవుతున్న పేదవారిని బ్రిటీష్ పాలకుల హస్తాల నుంచి విడిపిస్తూ.. వనజీవితం గడిపిన గొప్ప నాయకుడు సీతారామరాజు. గంటందొర, మల్లుదొర వంటి స్థానిక నాయకులతో కలిసి, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించిన రామరాజు జీవితంలోని కొన్నిఘట్టాలను ఈసినిమాలో చూపించారు. అంతే కాదు ఈ సినిమాలో, సీత పాత్ర ద్వారా రామరాజు ప్రేమను కూడా చూపించారు. సీతను ఎంతో ప్రేమతో పెళ్ళి చేసుకున్న రామరాజు, తనభార్య పేరును తన పేరుతో జతచేసి సీతారామారాజుగా మారాడు. తుదలో దేశసేవలో తన ప్రాణాలను అర్పించిన యోధుడి కథే అల్లూరి సీతారామరాజు.
అల్లూరి సీతారామరాజు రివ్యూ
అల్లూరి సీతారామరాజు సినిమా అద్బుంతగా వచ్చింది. కృష్ణ అనుకున్నదానికంటే ఎక్కువగానే సాధించారు. ఈమూవీకోసం వారు పడ్డ కష్టం ఫలించింది. ప్రతీ పాత్ర ప్రేక్షకుడిని ఆ కాలంలోకి తీసుకెళ్తుంది. సీతారామరాజు చేసిన పోరాటం ప్రతీ ఒక్కరిని కదిలించింది. ఈసినిమాలో సీతారామరాజుగా కృష్ణ నటన ప్రత్యేకంగా చెప్పకోవాలి. బ్రిటీష్ వారు ఇండియన్స్ ను ప్రత్యేకంగా తెలుగువారినిపెట్టిన హింసలు, వారిని ఎదిరించి, వారిదగ్గర ఆయుధాలను తీసుకుని వారిపైనే సీతారామరాజు దాడులు చేయడం లాంటి సన్నివేశాలు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యాయి. అందుకే ఈసినిమాను బాగా ఆదరించారు ప్రేక్షకులు. దేశ భక్తిని నరనరాన నింపిన సీతారామరాజు సినిమా, తెలుగు ప్రేకక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. ఈసినిమాను ఇంతకంటే అద్భుతంగా ఇంకెవరు తీయ్యలేరు అని ఎన్టీఆర్ అన్నారంటే అంతకంటే ఇంకేం కావాలి. అంతే కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది తొలి కలర్ స్కోప్ సినిమాగా కూడా రికార్డుకెక్కింది. అల్లూరి సీతారామరాజు సినిమా తెలుగు సినిమా రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది.
పాత్రలకు ప్రాణం పోశారు.
ఈసినిమాలో ప్రతీ పాత్ర నిజంగా పుట్టుకొచ్చినట్టే ఉంటుంది. ఎవరికి వారు వారి నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోశారు. మరీ ముఖ్యంగా అల్లూరి పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్న కృష్ణ, సీతారామరాజుగా అలరించారు. అద్భుతంగా నటించి మెప్పించారు. మహారధి రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్ ను కృష్ణ చెప్పిన తీరు ఇప్పటి ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరుస్తుంటుంది. రూథర్ ఫర్డ్ అంటూ బ్రిటీష్ అధికారిని ఉద్దేశించి చెప్పే ఓ డైలాగ్ ను ఆడియన్స్ ఇప్పటికి మర్చిపోలేదు. అంతే కాదు ఈసినిమా క్లైమాక్స్ లో కృష్ణ నటన ప్రతీ ఒక్కరిలో పోరాట స్పూర్తిని నింపుతుంది, చివరిగా తన ప్రాణ త్యాగం, బ్రిటీష్ తుపాకీ గుండుకు తన గుండెలు చూపించడం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఇక సీత పాత్రలో విజయనిర్మల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటం దొరగా గుమ్మడి, మల్లు దొరగా ప్రభాకర్ రెడ్డి, అగ్గిరాజుగా బాలయ్య, పడాలు పాత్రలో కాంతారావు, వీరయ్యదొర క్యారెక్టర్ లో రావు గోపాలరావు, గోవిందుగా చంద్రమోహన్ తమ పాత్రలకు వన్నె తెచ్చారు. ఇక రూథర్ ఫర్డ్ గా జగ్గయ్య కృష్ణకు సరిసమానమైన నటనను ప్రదర్శించి మెప్పించారు. మొత్తానికి అల్లూరి సీతారామరాజు సినిమాకు ఈ పాత్రల్లో నటీనటులు ప్రాణం పోశారని చెప్పవచ్చు.
ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు
నందమూరి తారక రామారావు ఇతర ప్రముఖ నటులు ఈ సినిమాను తీయాలని అనేక ప్రయత్నాలు చేశారు. పాడాల రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు వంటి ప్రముఖులు కూడా అల్లూరి పాత్రను పోషించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సమయంలో కృష్ణ మాత్రమే ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి ప్రేక్షకులను అలరించారు. ఈసినిమా విషయంలోనే కృష్ణ, ఎన్టీఆర్ మధ్య విభేదాలు వచ్చాయని పలు ఇంటర్వ్యూల్లో సూపర్ స్టార్ వెల్లడించారు. ఈసినిమా చేయవద్దు అని పెద్దాయన చెప్పినా వినకుండా కృష్ణ ఈ మూవీని చేశారు. కాని ఆతరువాత ఎన్టీఆర్ కూడా కృష్ణ ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. అల్లూరి సీతారామరాజు సినిమాను మళ్లీ తీద్దామనుకున్న ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చూసిన తరువాత ప్రయత్నం మానుకుని, కొన్ని సినిమాల్లో అల్లూరిగా క్యామియో రోల్స్ చేశారు.
ముగింపు
అల్లూరి సీతారామరాజు సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. అద్భుతంగా నిలిచింది. ఈ సినిమాలో ప్రతీ ఒక్క సన్నివేశం ఆడియన్స్ ను అలరిస్తుంది. అయితే అప్పట్లోఈసినిమాపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. విప్లవ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఈసినిమా బాగా నచ్చుతుంది. దేశ భక్తి సినిమాల కోసం వెతికేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈమూవీ చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.