- Home
- Entertainment
- బాలీవుడ్ లో చక్రం తిప్పిన అల్లు అరవింద్ ... `అల వైకుంఠపురములో` విషయంలో ఆయనదే గెలుపు..!
బాలీవుడ్ లో చక్రం తిప్పిన అల్లు అరవింద్ ... `అల వైకుంఠపురములో` విషయంలో ఆయనదే గెలుపు..!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ తన హవాని చూపించుకుంటున్నారు. తాజాగా ఆయన అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` సినిమా రిలీజ్ విషయంలో ఆయన విజయం సాధించారు. మరి కథేంటో చూస్తే..

తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో బాగా ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉందని అక్కడి ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ `పుష్ప` చిత్రం హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గోల్డ్ మైన్స్ సంస్థ దీన్ని హిందీలో రిలీజ్ చేయగా, ఇది ఎనభై కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి అక్కడి వర్గాలను షాక్‌కి గురి చేసింది. తెలుగు సినిమాలకు ఇంతటి డిమాండ్ ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేసింది. బాలీవుడ్‌లో తెలుగు చిత్రాలకు ఉన్న గిరాకీని క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.
తెలుగు చిత్రాలను డబ్ చేసి హిందీలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగా `పుష్ప`తో బన్నీకి మార్కెట్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` సినిమాని హిందీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కరోనా కారణంగా హిందీ సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ కాలేని పరిస్థితుల్లో `అల వైకుంఠపురములో` చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది ఈ చిత్ర డబ్బింగ్ హక్కులు దక్కించుకున్న గోల్డ్ మైన్స్ సంస్థ. జనవరి 26న రిలీజ్ చేయబోతున్నట్టు ఆ సంస్థ అధినేత మనీష్ షా వెల్లడించారు. దీంతోపాటు రామ్‌చరణ్ నటించిన `రంగస్థలం` చిత్రాన్ని కూడా హిందీలో డబ్ చేయబోతున్నారు. ఈ సినిమాని కూడా గోల్డ్ మైన్స్ సంస్థ రిలీజ్ చేయబోతున్నారు. దీంతోపాటు `మెర్సల్`, `విశ్వాసం` చిత్రాలను సైతం ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. సౌత్ యాక్షన్ చిత్రాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో మనీష్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే `అల వైకుంఠపురములో` చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా ఈ చిత్రాన్ని హిందీలో `షేహజాదా` పేరుతో రూపొందిస్తున్నారు. రోహిత్ దావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మనిషా కోయిరాలా, పరేష్ రావల్, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్‌లోకి రానుంది.
అయితే ఓ వైపు రీమేక్ సినిమా రాబోతున్న నేపథ్యంలో డబ్బింగ్ చిత్రాన్ని ఎలా రిలీజ్ చేస్తారనే సందేహాలు అందరికి కలిగాయి. డబ్బింగ్ వర్షన్ వస్తే రీమేక్ చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గోల్డ్ మైన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ `అల వైకుంఠపురములో` చిత్ర హిందీ డబ్బింగ్ వర్షన్ ప్రకటించగానే ఈ వార్త పెద్ద దుమారం రేపింది.
అయితే తాజాగా మనీష్ షా దిగొచ్చినట్టు తెలుస్తుంది. `షేహజాదా` చిత్రాన్ని కూడా అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. భూషణ్‌కుమార్, అమన్ గిల్ లతో కలిసి అరవింద్ హిందీ రీమేక్ నిర్మాణంలోనూ భాగమయ్యారు. తన కుమారుడి సినిమా తనకే అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో ఆయన రంగంలోకి దిగారు. ఎట్టకేలకు మనీష్ షాతో ఆయన చర్చలు జరిపారు. ఒప్పించారు. `అల వైకుంఠపురములో` హిందీ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు.
తాజాగా గోల్డ్ మైన్స్ సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. `అల వైకుంఠపురములో` చిత్ర డబ్బింగ్ వర్షన్ విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. `షేహజాదా` చిత్ర నిర్మాతలు, మనీష్ షాతో చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సందర్భంగా మనీస్ షాకి `షెహజాదా` టీమ్ ధన్యవాదాలు తెలిపింది. అయితే ఈ చర్చల్లో అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించారని తెలుస్తుంది. మొత్తంగా తన రీమేక్ సినిమాకి లైన్ క్లీయర్ చేసుకున్నారు. అల్లు అరవింద్ తెలుగులోనే కాదు ఇప్పుడు హిందీలోనూ తన ప్రొడక్షన్‌ని విస్తరింప చేస్తున్నారు. అక్కడ వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు.