Allari Naresh: అల్లరి నరేష్ ఇంట్లో విషాదం.. తాత కన్నుమూత.. కారణం ఇదే
Allari Naresh: అల్లరి నరేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తాత, ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు తుదిశ్వాస విడిచారు.

అల్లరి నరేష్ తాత కన్నుమూత
హీరో అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నరేష్ తాత ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు. ఒకప్పుడు అనేక బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు ఈవీవీ సత్యానారయణ తండ్రి ఈదర వెంకట్రావు కావడం విశేషం. ఆయన మంగళవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు వృద్ధాప్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లరి నరేష్ ఫ్యామిలీది నిడదవోలు మండలం కోరు మామిడి గ్రామం. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈదర వెంకట్రావు అంత్యక్రియలు తమ విలేజ్‌లో నిర్వహించనున్నారు.
హీరోగా రాణిస్తున్న అల్లరి నరేష్
ఈదర వెంకట్రావుకి ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుదే ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ. ఆయనతోపాటు ఈవీవీ గిరి, ఈవీవీ శ్రీనివాస్ కుమారులు. ఈవీవీ సత్యనారాయణ కుమారులే అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్. నరేష్ కంటే రాజేష్ పెద్ద. ఒకప్పుడు రాజేష్ హీరోగా సినిమాలు చేసి మెప్పించారు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అల్లరి నరేష్ ఒక్కడే హీరోగా రాణిస్తున్నారు. ఆయన ఒకప్పుడు కామెడీ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోగా రాణించారు. ఇటీవల కాలంలో యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలతో మెప్పిస్తున్నారు. చివరగా ఆయన 12ఏ రైల్వే కాలనీ` అనే చిత్రంలో నటించారు. ఇది ఆడలేదు.
స్టార్ డైరెక్టర్‌గా రాణించిన ఈవీవీ సత్యనారాయణ
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా రాణించిన ఈవీవీ సత్యనారాయణ టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందించారు. 1990లో `చెవిలో పువ్వు` చిత్రంతో దర్శకుడిగా మారారు`. `ప్రేమ ఖైదీ` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు, కమర్షియల్ చిత్రాలతో విజయాలు అందుకున్నారు. `వారసుడు`, `హలో బ్రదర్`, `ఆమె`, `అల్లుడా మజాకా`, `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `తాళి`, `వీడెవడండీ బాబు`, `మా నాన్నకు పెళ్లి`, `మావిడాకులు`, `ఆవిడా మా ఆవిడే`, `కన్యాదానం`, `సూర్యవంశం` ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. ఆయన 2011 జనవరి 21న క్యాన్సర్‌తో కన్నుమూశారు. సరిగ్గా 15ఏళ్లకి ఒక్క రోజు ముందుగా ఈవీవీ సత్యనారాయణ తండ్రి మరణించడం గమనార్హం. వెంకట్రావు భార్య వెంకటరత్నం 2019 మే 27న తుదిశ్వాస విడిచారు.

