శాంసన్ అందుక్కూడా పనికిరాడా..? అతడిపై ఎందుకీ కక్ష..? అభిమానుల ఆగ్రహం
Sanju Samson: ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేరు లేకపోవడాన్ని అతడి అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

త్వరలో యూఏఈ వేదికగా జరుగబోయే ఆసియా కప్-2022 కోసం భారత జట్టును సోమవారం ప్రకటించారు సెలక్టర్లు. రోహిత్ శర్మ నాయకుడిగా ఉన్న ఈ జట్టుకు వైస్ కెప్టెన్ గా కెఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో చేరనుండగా.. మిడిలార్డర్ లో సూర్యకుమర్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్ తమ స్థానాలను కాపాడుకున్నారు.
కోహ్లీ రాకతో శ్రేయాస్ కు చోటు దక్కడం కష్టమే కావడంతో అతడిని బ్యాకప్ గా పెట్టారు సెలక్టర్లు. కానీ ఆశ్చర్యకరంగా దీపక్ హుడాను మాత్రం నేరుగా ఎంపిక చేశారు. దినేశ్ కార్తిక్ ను రెండో వికెట్ కీపర్ గా తీసుకున్నారు.
నలుగురు స్పిన్నర్లుగా అశ్విన్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్ లను ఎంపిక చేసిన సెలక్టర్లు భువనేశ్వర్, అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్ లను పేసర్లుగా ఎంపిక చేశారు. వెస్టిండీస్ సిరీస్ లో రాణించిన అక్షర్ పటేల్ కు చోటు దక్కలేదు.
అయితే జట్టు ఎంపికపై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ కంటే ఈ ఏడాది సంజూ శాంసన్ మెరుగ్గా రాణిస్తున్నాడని కానీ సెలక్టర్లు కావాలనే అతడిని సైడ్ లైన్ చేస్తున్నారు.
బ్యాకప్ ప్లేయర్లుగా శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేసిన సెలక్టర్లకు శాంసన్ ఆ రోల్ లో కూడా పనికి రాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుడా, కార్తీక్, అయ్యర్ ల కంటే శాంసన్ బ్యాటింగ్ సగటు, స్ట్రైక్ రేట్ మెరుగ్గా ఉందని అంటున్నారు. ఈ మేరకు పంత్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ ల కంటే శాంసన్ బాగా రాణించాడని చెప్పాడు.
2022 టీ20లలో సంజూ శాంసన్ సగటు 44.75 గా ఉండగా స్ట్రైక్ రేట్ 158.40గా ఉంది. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ 130 స్ట్రైక్ రేట్, 30.71 సగటు ఉండగా రిషభ్ పంత్ సగటు 26, స్ట్రైక్ రేట్ 135.42గా ఉంది. దినేశ్ కార్తీక్ సగటు 21.33గా ఉండగా స్ట్రైక్ రేట్ 133 గా ఉంది.
ట్విటర్ వేదికగా పలువురు అభిమానులు స్పందిస్తూ.. ‘నేను సంజూ శాంసన్ అభిమానిని కాదు. కానీ హుడాకు బదులుగా అతడిని ఆడించాల్సింది..’, ‘బీసీసీఐ కావాలనే సంజూ శాంసన్ కెరీర్ ను నాశనం చేస్తున్నది. అశ్విన్, హుడా,శ్రేయాస్ లు శాంసన్ కంటే ఏమంత మెరుగ్గా ఆడతారో చూద్దాం..’అని కామెంట్ చేస్తున్నారు.