కచ్చితంగా ఇతడు ఆ అఫ్రిది కాదు.. ఫిట్‌గా లేకున్నా భారత్‌తో మ్యాచ్ కోసమే తీసుకొచ్చారా..? పాక్ మాజీల విమర్శలు
ICC T20 World Cup: మూడు రోజుల క్రితం మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత్ చేతిలో ఓటమిని పాకిస్తాన్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్, పీసీబీతో పాటు జట్టు మేనేజ్మెంట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
భారత్ తో మ్యాచ్ లో ఓడిన తర్వాత ఆదివారం, సోమవారం నోబాల్, బైస్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన పాకిస్తాన్ మాజీలు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. తొలి రెండురోజులు పాకిస్తాన్ జట్టును పల్లెత్తు మాట అనని మాజీ క్రికెటర్లు ఇప్పుడు షాహీన్ షా అఫ్రిది ఫిట్నెస్ కు సంబంధించి జట్టు మేనేజ్మెంట్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ దిగ్గజ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్ లతో పాటు మాజీ సారథి మిస్బా ఉల్ హక్, పాక్ సూపర్ లీగ్ లో లాహోర్ కలాండర్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న అకీబ్ జావేద్ లు పీసీబీ పై దుమ్మెత్తిపోస్తున్నారు.
వకార్ యూనిస్ స్పందిస్తూ.. ‘ఇతడు మాకు తెలిసిన షాహీన్ అఫ్రిది కాదు. షాహీన్ బౌలింగ్ లో మునపటి రిథమ్ కనిపించలేదు. నాకు తెలిసి అతడింకా మ్యాచ్ కు ఫిట్ గా ఉన్నాడా..? లేదా..? అనేది అనుమానంగా ఉంది. ఈ మెగా టోర్నీ, మరీ ముఖ్యంగా భారత్ తో మ్యాచ్ అని షాహీన్ ను హడావిడిగా తీసుకొచ్చి ఆడించారా..?
న్యూజిలాండ్ లో ముక్కోణపు సిరీస్ సందర్భంగా షాహీన్ పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలుసుకునేందుకు నేను కెప్టెన్ బాబర్ ఆజమ్, కోచ్ సక్లయిన్ ముస్తాక్ తో మాట్లాడాను. నెట్స్ లో అతడు బౌలింగ్ ఎలా చేస్తున్నాడు..? వరల్డ్ కప్ కు సిద్ధమయ్యాడా..? లేదా..? అనే విషయాలు ఆరా తీశాను..’ అని తెలిపాడు.
ఈ ఏడాది జులైలో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన పాకిస్తాన్.. అఫ్రిది కూడా సభ్యుడు. గాలె టెస్టులో షాహీన్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఆసియా కప్ ఆడలేదు. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్ తో ముగిసిన ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో కూడా ఆడలేదు. సుమారు నెలన్నర పాటు షాహీన్ ఇంగ్లాండ్ లో చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత నేరుగా న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడ్నుంచి ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లలో ఆడి భారత్ తో మ్యాచ్ కు సిద్ధమయ్యాడు.
ఇక షాహీన్ బౌలింగ్ పై వసీం అక్రమ్ స్పందిస్తూ.. ‘షాహీన్ ను న్యూజిలాండ్ తో ముక్కోణపు సిరీస్ కు తీసుకెళ్లారు. అతడు ఫిట్ గా ఉంటే ఆ సిరీస్ ఆడిస్తే అయిపోయేదిగా.. అప్పుడు అతడు తన రిథమ్ ను అందుకునేవాడు. గాయం నుంచి తిరిగొచ్చిన బౌలర్ తన పాత లయను అందుకునేందుకు కాస్త సమయం పడుతుంది. అది మేం అర్థం చేసుకోగలం. తర్వాత మ్యాచ్ లలో అయినా అతడు ఎంత ఫిట్ గా ఉండి మ్యాచ్ లు ఆడతాడో చూడాలి..’ అని తెలిపాడు.
లాహోర్ కలాండర్స్ సారథి అయిన షాహీన్ అఫ్రిదితో కలిసి పనిచేసిన అకీబ్ జావేద్ స్పందిస్తూ. ‘భారత్ తో మ్యాచ్ లో షాహీన్ ను చూస్తే అతడిని ఏదో బలవంతంగా ఈ మ్యాచ్ కోసమే తీసుకొచ్చినట్టు అనిపించింది...’ అని తెలిపాడు.
ఇక మిస్బా ఉల్ హక్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ప్రాక్టీస్ తక్కువగా ఉన్న బౌలర్ తో కీలక మ్యాచ్ ఆడటం ఎప్పుడూ మంచిది కాదు..’ అన్నాడు. అంతేగాక తానైతే వంద శాతం ఫిట్ గా ఉన్నవారినే తుది జట్టులోకి తీసుకుంటానని చెప్పాడు.
భారత్ తో ముగిసిన మ్యాచ్ లో షాహీన్ అఫ్రిది.. నాలుగు ఓవర్లలో 34 పరుగులిచ్చాడు. తొలి రెండు ఓవర్లు ఫర్వాలేదనిపించిన అఫ్రిది చివర్లో గాడి తప్పాడు. ఆ రెండు ఓవర్లలో 25 పరుగులిచ్చాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత బ్యాటింగ్ ను దెబ్బతీసిన అఫ్రిది.. మెల్‌బోర్న్ లో ఆ మ్యాజిక్ చూపించలేదు.