- Home
- Sports
- Cricket
- గెలిచాం సరే, ఇలా ఆడితే సిరీస్ వస్తుందా... టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్రమైన ట్రోలింగ్...
గెలిచాం సరే, ఇలా ఆడితే సిరీస్ వస్తుందా... టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్రమైన ట్రోలింగ్...
మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత విశాఖలో జరిగిన మూడో టీ20లో బోణీ చేసి, సిరీస్ ఆశలను నిలబెట్టుకుంది భారత జట్టు. తొలి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయిన భారత బౌలింగ్ యూనిట్, మూకుమ్మడిగా మూడో టీ20లో చెలరేగి... టీమిండియాకి విజయాన్ని అందించారు...

Image credit: PTI
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు..
9.5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసిన భారత జట్టు, ఒకానొక దశలో ఈజీగా 200+ స్కోరు చేసేలా కనిపించింది. అయితే ఓపెనర్లు రాణించినట్టుగా మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేయలేకపోయింది టీమిండియా...
Image credit: PTI
శ్రేయాస్ అయ్యర్ 11 బంతులాడి 2 సిక్సర్లతో 14 పరుగులు చేసి అవుట్ కాగా రిషబ్ పంత్ 8 బంతులు ఆడినా 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Rishabh Pant
స్వదేశంలో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం రిషబ్ పంత్‌కి ఇది ఏడో సారి. మిగిలిన భారత వికెట్ కీపింగ్ బ్యాటర్లు అందరూ కలిసి స్వదేశంలో 6 సార్లు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరుకి అవుటైతే, రిషబ్ పంత్ ఒక్కడే వారిని అధిగమించేశాడు...
Image credit: PTI
దినేశ్ కార్తీక్ కూడా సెటిల్ అవ్వడానికి సమయం తీసుకుని 8 బంతుల్లో 6 పరుగులు చేసి, మెరుపులు మెరిపించకుండానే అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా 21 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు..
Image credit: PTI
అయితే తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసిన భారత జట్టు, ఆఖరి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెత్ ఓవర్లలో టీమిండియాకి రావాల్సినన్ని పరుగులు రాలేదు...
Image credit: PTI
భారత బౌలర్లు హర్షల్ పటేల్ 4, యజ్వేంద్ర చాహాల్ 3 వికెట్లు తీసి భారత జట్టుకి విజయాన్ని అందించారు కానీ లేకపోతే భారత బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా టీమిండియా సిరీస్ కోల్పోయేదే...
ముఖ్యంగా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. కెప్టెన్సీ ప్రెషర్ కారణంగానో లేక అలవాటు ప్రకారమే ఆడుతున్నాడో కానీ అతని నుంచి టీమ్ ఆశించిన పర్ఫామెన్స్ మాత్రం రావడం లేదు...
Image credit: PTI
బ్యాటింగ్‌లో తడబడడమే కాదు, వికెట్ కీపింగ్‌లోనూ విలువైన క్యాచులను వదిలేస్తున్నాడు రిషబ్ పంత్. ఇది అతని కెరీర్‌ని మాత్రమే కాదు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం సిద్ధమవుతున్న భారత జట్టును కలవరపెట్టే విషయం...
రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్, బ్యాటుతో కానీ బాల్‌తో కానీ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. టీమిండియా సిరీస్ గెలవాలంటే మాత్రం రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌ల నుంచి కూడా మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు రావాలి...