పాక్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా దిగ్గజ రికార్డు బద్దలుకొట్టిన టీమిండియా..
T20 World Cup 2022: ఆదివారం భారత్-పాక్ మధ్య ముగిసిన ఉత్కంఠ పోరులో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. విరాట్ కోహ్లీ-హార్ధిక్ పాండ్యా సెంచరీ భాగస్వామ్యంతో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ స్టీవ్ వా సారథ్యంలోని అలనాటి ఆస్ట్రేలియా రికార్డును బద్దలుకొట్టింది.
పాకిస్తాన్ పై విజయంతో ఈ ఏడాది భారత జట్టు టెస్టులు, వన్డేలు, టీ20లలో కలిపి 39 విజయాలు సాధించింది. తద్వారా మాజీ సారథి స్టీవ్ వా సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు 2008లో సాధించిన 38 విజయాల రికార్డును బ్రేక్ చేసింది. 2008లో ఆసీస్ జట్టు.. 47 మ్యాచ్ లు ఆడి 38 విజయాలు సాధించింది.
కొద్దిరోజుల క్రితం స్వదేశంలో దక్షిణాఫ్రికా పై వరుసగా రెండు టీ20లలో విజయం సాధించడం ద్వారా ఈ ఏడాది 38 విజయాలను సొంతం చేసుకున్న ఇండియా.. ఆసీస్ రికార్డును సమం చేసింది. ఇక తాజాగా పాకిస్తాన్ పై గెలవడం ద్వారా 39 విజయాలు సాధించినట్టైంది.
2003లో ఆస్ట్రేలియా జట్టు 38 వన్డేలు ఆడి 30 మ్యాచ్ లలో విజయా సాధించింది. ఇందులో 2003 వన్డే ప్రపంచకప్ విజయం కూడా ఉంది. 8 టెస్టులలో కూడా గెలుపొందింది. ఇప్పుడు టీమిండియా.. 2 టెస్టులు, 12 వన్డేలు,24 టీ20లలో గెలిచి ఆసీస్ రికార్డును చెరిపేసింది.
ఈ ఏడాది భారత విజయాలను ఓసారి పరిశీలిస్తే.. ఐదు టెస్టులు ఆడి రెండింటిలో గెలిచి మూడు మ్యాచ్ లలో ఓడింది. 2022 ప్రారంభంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. అక్కడ మూడు టెస్టులాడి ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. అయితే అది 2021 డిసెంబర్ 30కే ముగిసింది. జనవరి లో జరిగిన రెండు టెస్టులలో భారత్ కు ఓటమి తప్పలేదు. ఇక వన్డేలలో కూడా అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి.
రోహిత్ శర్మ గైర్హాజరీలో కెఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. కానీ మూడింటికి మూడు వన్డేలలో భారత్ ఓడింది. అయితే ఆ తర్వాత పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు తీసుకున్న రోహిత్ వరుస విజయాలతో టీమిండియాను ముందుకు నడిపించాడు.
వెస్టిండీస్ తో మూడు వన్డేలు, మూడు టీ20లలో బారత్ గెలిచింది. ఆ తర్వాత శ్రీలంకపై రెండు టెస్టులు, మూడు టీ20లలో అవే ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత సౌతాఫ్రికా భారత పర్యటనలో నాలుగు టీ20 లు ఆడి రెండు మ్యాచ్ లలో గెలిచింది. ఈ సిరీస్ కు రిషభ్ పంత్ సారథిగా ఉన్నాడు.
ఈ సిరీస్ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్ కూడా గెలుచుకుంది. అట్నుంచి విండీస్ పర్యటనలో వన్డే సిరీస్ తో పాటు టీ20లలో విజయాలు సాధించింది. జింబాబ్వేపై మూడు వన్డేలలోనూ అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి. ఆ తర్వాత ఆసియా కప్ లో కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై భారత్ సిరీస్ లు సాధించింది.