వాళ్లిద్దరి కంటే ముందు అక్షర్ పటేల్? కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్రయోగం... మ్యాచ్ తేడా కొట్టి ఉంటే...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఘన విజయంతో ఆరంభించింది టీమిండియా. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చాహార్ గాయాలతో తప్పుకోవడంతో పెద్దగా అంచనాలు లేకుండా మెగా టోర్నీని ఆరంభించిన భారత జట్టు... పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ చేసిన ఓ ప్రయోగం హాట్ టాపిక్ అవుతోంది...
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది టీమిండియా. ఈ దశలో అక్షర్ పటేల్ క్రీజులోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటికే మూడు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అక్షర్ పటేల్‌కి ప్రమోషన్ ఇవ్వడం షాక్‌కి గురి చేసింది...
Axar Patel
సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే రవీంద్ర జడేజా గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో అతని ప్లేస్‌లో అక్షర్ పటేల్‌కి అవకాశం కల్పించింది టీమిండియా. జడ్డూలాగే అక్షర్ పటేల్ కూడా స్పిన్ ఆల్‌రౌండరే. కానీ టెస్టుల్లో, వన్డేల్లో ఆడినట్టుగా టీ20ల్లో మెరుపులు మెరిపించడం అక్షర్ పటేల్‌కి సాధ్యం కాదు...
Image credit: Getty
దేశవాళీ క్రికెట్‌లో అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇలాంటి ప్రయోగం చేసేంత సత్తా అక్షర్ పటేల్‌లో ఉందా..! టీ20ల్లో అక్షర్ పటేల్ అత్యధిక స్కోరు 20 పరుగులే. అయినా హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ వంటి సీనియర్లు డగౌట్‌లో ఉన్నారు. వారిద్దరినీ పక్కనబెట్టి అక్షర్ పటేల్‌ని ఐదో స్థానంలో పంపించడం హాట్ టాపిక్ అయ్యింది.
Axar Patel
ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అక్షర్ పటేల్, 3 బంతుల్లో 2 పరుగులు చేసి విరాట్ కోహ్లీతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ గ్లవ్స్ తాకి వికెట్లు కదిలినట్టుగా కనిపించింది. బంతి, బెయిల్స్‌ని తాకిందా? లేదా? అనేది క్లారిటీగా కనిపించలేదు.. అయినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.
Image credit: PTI
టీమిండియా గెలిచింది కాబట్టి దీనిపై పెద్దగా చర్చ జరగలేదు కానీ రిజల్ట్ తేడా కొట్టి ఉంటే... బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసినందుకు భారత సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది... బౌలింగ్‌లో ఒకే ఓవర్ వేసి 21 పరుగులు ఇచ్చి, బ్యాటింగ్‌లో ఫెయిల్ అయిన అక్షర్ పటేల్, విలన్‌గా మారేవాడు...