- Home
- Sports
- Cricket
- మూడు మ్యాచుల్లో నేను ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ ఆడిస్తున్నారు: టీమిండియా బౌలర్ షాకింగ్ కామెంట్స్
మూడు మ్యాచుల్లో నేను ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ ఆడిస్తున్నారు: టీమిండియా బౌలర్ షాకింగ్ కామెంట్స్
Avesh Khan: దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ లో భారత జట్టు ఆటగాళ్లలో పలువురు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నారు. అయితే జట్టు మేనేజ్మెంట్ మాత్రం వారిని మార్చడం లేదు.

ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లు కూడా పదే పదే అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. తాత్కాలిక కెప్టెన్ పంత్ తో పాటు గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.
అయినా తొలి టీ20 లో ఆడిన జట్టునే భారత జట్టు కొనసాగిస్తున్నది. బెంగళూరు వేదికగా ఆదివారం జరుగబోయే ఆఖరి మ్యాచ్ లో కూడా ఇదే జట్టు ఆడనున్నది. అయితే దీనిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ పై కూడా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నాలుగో మ్యాచ్ అనంతరం టీమిండియా పేసర్ అవేశ్ ఖాన్ స్పందిస్తూ.. ‘గత నాలుగు మ్యాచులుగా జట్టులో మార్పులు లేవు. ఈ క్రెడిట్ రాహుల్ ద్రావిడ్ దే. ఆయన అందరికీ అవకాశాలిస్తాడు. దానిని చాలాకాలం పాటు కొనసాగించేలా కృషి చేస్తాడు.
ఒకటి, రెండు మ్యాచుల్లో విఫలమయ్యారని ఆటగాళ్లను మార్చడం ఆయన చేయరు. ఎందుకంటే రెండు మ్యాచులలో సరిగా ఆడలేదని ఒక ఆటగాడిని జడ్జ్ చేయలేం కదా.. ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవడానికి తగిన అవకాశాలిస్తారు.
సిరీస్ లో తొలి మూడు మ్యాచులలో నాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కానీ రాహుల్ సార్, టీమ్ మేనేజ్మెంట్ నామీద నమ్మకముంచింది. నాకు మరో అవకాశమిచ్చింది. దాంతో నేను ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయగలిగాను..’ అని ద్రావిడ్ ను కొనియాడాడు.
శుక్రవారం సఫారీలతో రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అవేశ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తొలుత డ్వేన్ ప్రిటోరియస్ ను ఔట్ చేసిన అవేశ్.. ఆ తర్వాత ఒకే ఓవర్లో డసెన్, జాన్సేన్, కేశవ్ మహారాజ్ లను ఔట్ చేసి సఫారీల పతనాన్ని శాసించాడు.
కాగా కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అవేశ్.. నేటి తన ప్రదర్శనను తన తండ్రికి అంకితమిచ్చాడు. శుక్రవారం అవేశ్ ఖాన్ తండ్రి పుట్టినరోజు కావడం గమనార్హం.