- Home
- Sports
- Cricket
- Jasprit Bumrah: ఆసియా కప్‌కే కాదు.. టీ20 ప్రపంచకప్‌కూ అనుమానమే.. టీమిండియాకు భారీ షాక్ తప్పదా..?
Jasprit Bumrah: ఆసియా కప్‌కే కాదు.. టీ20 ప్రపంచకప్‌కూ అనుమానమే.. టీమిండియాకు భారీ షాక్ తప్పదా..?
Jasprit Bumrah: ప్రతిష్టాత్మక ఆసియాకప్‌కు ముందు భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయం కావడంతో అతడు మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కానీ బుమ్రా.. టీ20 ప్రపంచకప్ ఆడటమూ అనుమామనమేనట..

మరో రెండు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తప్పేట్టు లేదు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అయిన గాయం చిన్నదేమీ కాదని అతడు మరో మూడు నెలలు ఆటకు దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు చెప్పినట్టు తెలుస్తున్నది.
వెన్నునొప్పి కారణంగా బుమ్రా ఆసియా కప్ కు దూరమయ్యాడు. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ మినహా భారత్ కు పోటీనిచ్చే జట్లేమీ లేకపోవడంతో టీమిండియాకు బుమ్రా లేకున్నా పెద్ద సమస్య ఏమీ లేదు. కానీ ఆసియా కప్ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత అక్టోబర్ లో ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లనున్నది.
Image credit: Getty
అయితే బుమ్రాకు అయిన గాయం ఇప్పుడప్పుడే నయమయేది కాదని తెలుస్తున్నది. పలు జాతీయ మీడియాలలో వచ్చిన కథనాల మేరకు బీసీసీఐ అధికారులు బుమ్రా గాయం గురించి స్పందిస్తూ.. ‘బుమ్రా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతడికి వెన్నునొప్పి బాధిస్తున్నది. ప్రస్తుతం అతడు ఎన్సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం నొప్పి కంటే అతడిని పాత గాయం వేధిస్తున్నది.
పొట్టి ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో అతడి గాయం ఆందోళన కలిగిస్తున్నది. అయితే మేం అతడి పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ప్రపంచకప్ వరకు అతడు అందుబాటులో ఉంటాడనే నమ్ముతున్నాం..’ అని తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి.
బుమ్రా 2019 లో వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత కోలుకుని తిరిగి జట్టుతో చేరినా అప్పుడుప్పుడు నొప్పి బాధిస్తూనే ఉంది. దీంతో బుమ్రా ప్రధాన సిరీస్ లు మినహా చిన్న జట్లతో మ్యాచ్ లు ఆడటం లేదు. రోస్టర్ పాలసీ ప్రకారం ఆటగాళ్లను మారుస్తున్నా బుమ్రా మాత్రం గాయాలతో సావాసం చేస్తూనే ఉన్నాడు.
బుమ్రా దూరమైతే భారత జట్టుకు భారీ షాక్ తప్పదు. పేసర్లకు అనుకూలించే ఆసీస్ పిచ్ లపై బుమ్రా మెరుగ్గా రాణిస్తాడు. అయితే బుమ్రా గాయం అతడిని ఆడనిస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. సెప్టెంబర్ మూడో వారంలో ప్రపంచకప్ ఆడబోయే భారత జట్టును ప్రకటించే అవకాశముంది.