- Home
- Sports
- Cricket
- ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకలకు జై షాకి ఆహ్వానం... బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీని పంపుతున్న బీసీసీఐ..
ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకలకు జై షాకి ఆహ్వానం... బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీని పంపుతున్న బీసీసీఐ..
బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ అయినా, అంతకుముందు సౌరవ్ గంగూలీ అయినా చక్రం తిప్పుతున్నది మాత్రం సెక్రటరీ జై షానేనని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం. పదవీకాలం ముగిసినా కూడా బీసీసీఐ సెక్రటరీగా కొనసాగేందుకు ఏకంగా బీసీసీఐ రాజ్యాంగాన్ని మార్చేసిన ఘనత జై షాకి సొంతమని కూడా ట్రోల్స్ వినిపించాయి..

Jay Shah-Stuart Binny
గత ఏడాది ఆసియా కప్ ఆరంభానికి ముందు పాకిస్తాన్‌లో ఆసియా కప్ 2023 జరిగితే, అందులో టీమిండియా పాల్గొనదని జై షా చేసిన కామెంట్లు పెను దుమారం రేపాయి. ఆసియా కప్ కోసం టీమిండియా, పాకిస్తాన్‌కి రాకపోతే... వన్డే వరల్డ్ కప్ కోసం పాక్ జట్టు, ఇండియాకి రాదని పీసీబీ పట్టు బట్టేందుకు ప్రయత్నించింది..
Jay Shah
అయితే బీసీసీఐ అధికార బలం ముందు పాక్ క్రికెట్ బోర్డు పంతం నిలవలేదు. టీమిండియా, పాక్‌లో అడుగుపెట్టేందుకు ససేమీరా అనడంతో ఆసియా కప్ 2023 టోర్నీలో 4 మ్యాచులు పాకిస్తాన్‌లో, 9 మ్యాచులు శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు..
ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ ముల్తాన్‌లో పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనుంది. కొన్ని దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో జరుగుతున్న ఓ పెద్ద క్రికెట్ టోర్నీ ఇదే. దీంతో ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకుంటోంది పీసీబీ..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న బీసీసీఐ సెక్రటరీ జై షాకి ఆసియా కప్ 2023 ఆరంభవేడుకల్లో పాల్గొనాల్సిందిగా పీసీబీ నుంచి ఆహ్వానం కూడా అందింది. అయితే భారత హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకు పాకిస్తాన్‌లో అడుగుపెడితే... అది చాలా పెద్ద విశేషమే. జై షా క్షేమంగా పాక్‌కి వెళ్లి, తిరిగి ఇండియాకి వస్తే... పాకిస్తాన్ సురక్షిత దేశంగా ప్రపంచం ముందు ఒప్పుకోవాల్సి వస్తుంది..
అందుకే బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీని, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాని ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకలకు పంపాలని భావిస్తోందట. ఈ ఇద్దరూ ఆగస్టు 30న ముల్తాన్‌లో జరిగే ఆసియా కప్ 2023 మొదటి మ్యాచ్‌ని వీక్షించబోతున్నారని వార్తలు వస్తున్నాయి..
ఈ ఇద్దరూ పాకిస్తాన్‌కి వెళ్తే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై చర్చ మొదలవుతుంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ సిద్ధం లేకపోవడంతో ఈ టోర్నీ కూడా తటస్థ వేదికపై జరగడం ఖాయం..
అయితే బీసీసీఐ పెద్దలు, పాకిస్తాన్‌కి వెళ్లి క్షేమంగా తిరిగి వస్తే, ఐసీసీ కూడా పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2023 టోర్నీని తరలించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. బీసీసీఐ బాస్ భద్రంగా పాక్‌కి వెళ్లి, తిరిగి వచ్చినప్పుడు టీమిండియా క్రికెటర్ల భద్రతకు వచ్చిన ముప్పు ఏంటనే చర్చ తెరపైకి వస్తుంది..
దీంతో ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభ వేడుకల్లో బీసీసీఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పాల్గొంటారా? లేక ఏకంగా శ్రీలంకలో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కే ఈ ఇద్దరూ హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది..