ఉప్పూ కారం లేదు.. ఈ సప్పిడి కూడు మాకొద్దు..! భోజనం సరిగా లేదని టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి
T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు.. భారతీయ వంటకాలకు మిస్ అవుతున్నారు. సిడ్నీలో ప్రాక్టీస్ సెషన్ తర్వాత తమకు అందించిన ఫుడ్ సరిగా లేదని పలువురు ఆటగాళ్లు బాయ్‌కాట్ చేసి హోటల్ కు వెళ్లినట్టు సమాచారం.
గత ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్ తో ముగిసిన హై ఓల్టేజీ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత సిడ్నీకి వెళ్లిన టీమిండియా.. ఈనెల 27న నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడనుంది. అయితే సోమవారమే సిడ్నీకి వెళ్లిన భారత జట్టు.. గడిచిన రెండ్రోజులుగా అక్కడ నెట్ ప్రాక్టీస్ సెషనల్ లో పాల్గొంటున్నది.
మంగళవారం ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న తర్వాత తమకు అందజేసిన ఫుడ్ పై పలువురు టీమిండియా ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ప్రాక్టీస్ సెషన్ తర్వాత తమకు ఇచ్చిన ఫుడ్ నచ్చక హోటల్ రూమ్ కు వెళ్లి తిన్నట్టు సమాచారం.
నిన్న టీమిండియాకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ఉండగా బౌలర్లు, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ మినహా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రాక్టీస్ ముగిశాక ఆటగాళ్లకు సాండ్ విచ్, ఫ్రూట్స్, ఫలాఫెల్ (బీన్స్ తో తయారుచేసే డీప్ ఫ్రై వంటకం) ఇవ్వగా ఈ మెనూపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసి దానిని అక్కడే వదిలేసి హోటల్ రూమ్ కు వెళ్లి లంచ్ చేసినట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
అయితే ఈ విషయమై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఆటగాళ్లు ఫుడ్ మెనూను ఆటగాళ్లు బాయ్‌కాట్ చేశారని వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పాడు ‘అది బాయ్‌కాట్ కాదు. పలువురు ఆటగాళ్లు ఫ్రూట్స్, ఫలాఫెల్ ను తిన్నారు. అప్పటికే లంచ్ కావడంతో చాలా మంది హాట్ ఫుడ్ తినాలని అనుకున్నారు. అందుకే నేరుగా హోటల్ రూమ్ కు వెళ్లి లంచ్ చేశారు..’ అని తెలిపాడు.
అయితే ఇక్కడొచ్చిన సమస్యేమిటంటే.. ప్రాక్టీస్ సెషన్ తర్వాత ఐసీసీ లైట్ ఫుడ్ తప్ప హాట్ ఫుడ్ ఇవ్వదు. ద్వైపాక్షిక సిరీస్ లు అయితే జట్టుకు సంబంధించిన కేటరింగ్ ఇంచార్జి ఆటగాళ్లకు నచ్చిన వంటలు చేస్తాడు. కానీ ఐసీసీ టోర్నీలో అలా కుదరదు. అందరికీ ఒకేరకమైన ఫుడ్ ఇస్తారని బీసీసీఐ ప్రతినిధి చెప్పాడు. ట్రైనింగ్ తర్వాత అవకాడోతో తయారుచేసిన గ్రిల్డ్ సాండ్‌విచ్, టొమాటో, దోసకాయ వంటివి మెనూలో ఉంటాయని తెలిపాడు.
మామూలుగా భారతీయులందరికీ ఉప్పు కారం ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. అందుకు క్రికెటర్లేమీ మినహాయింపు కాదు. డైట్ ఫాలో అయినా తమకు నచ్చినవి తగు మోతాదులో తింటారు. కానీ ఇప్పుడు ఐసీసీ సొంత చెఫ్ లను అనుమతించదు గనక వాళ్లు పెట్టే ఫుడ్ మనోళ్లకు నచ్చక ఇబ్బందులు పడుతున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.