సూర్య ఇలా ఆడతాడని ఇండియాలో ఏ ఒక్కరు కూడా అనుకోలేదు : కపిల్ దేవ్
T20 World Cup 2022: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ఐసీసీ టీ20 ర్యాంకింగులలో ప్రపంచ నెంబర్ 2 గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ పై భారత జట్టు మాజీ సారథి కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
గడిచిన ఏడాది కాలంగా భారత జట్టు తరఫున టీ20లలో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడు. అతడు లేని మిడిలార్డర్ ను ఊహించుకోలేని పరిస్థితి. అయితే రెండేండ్ల క్రితం సూర్యను ఎవరూ పట్టించుకోలేదు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు సూర్య ఈ రేంజ్ లో ఆడగలడని భారత్ లో ఎవరూ ఊహించలేదని.. కానీ అతడు తన ప్రదర్శనల ద్వారా తానెంటో నిరూపించుకున్నాడని కపిల్ దేవ్ అన్నాడు.
Image credit: PTI
ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘సూర్య కొత్తగా జట్టులోకి వచ్చినప్పుడు అతడు జట్టుపై ఇంతలా ప్రబావం చూపే ఆటగాడు అవుతాడని ఇండియాలో ఎవరూ ఊహించలేదు. కానీ సూర్య మాత్రం తన ప్రదర్శనలతో ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకునేవిధంగా చేశాడు.
ఇప్పుడు చూడండి. సూర్య లేని భారత జట్టును ఊహించుకోలేని పరిస్థితిని అతడు కల్పించాడు. సూర్య వంటి బ్యాటర్ జట్టులో ఉంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లకు ఇంకా అదనపు బలం పెరిగినట్టు అవుతుంది. దీంతో జట్టు కూడా ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ గా తయారవుతుంది..’ అని చెప్పాడు.
కపిల్ దేవ్ చెప్పినట్టుగా గత ఏడాది కాలంగా సూర్య టీ20లలో భారత జట్టుకు మెరుపులు మెరిపిస్తున్నాడు. ఒకరకంగా భారత విజయాలలో ప్రధాన పాత్ర కూడా సూర్యదే. ఇటీవల స్వదేశంలో ముగిసిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లలో సూర్య ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించి భారత్ కు సిరీస్ దక్కడంలో సాయపడ్డాడు.
అయితే టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ తో ముగిసిన తొలి మ్యాచ్ లో సూర్య అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ మ్యాచ్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య.. 10 బంతులు ఎదుర్కుని 2 ఫోర్లు బాది 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.