- Home
- Sports
- Cricket
- బుమ్రా లేడు, విరాట్ ఫామ్‌లో లేడు! రాహుల్ ఆడనేలేదు... ఆసియా కప్‌కి ముందు టీమిండియాకి...
బుమ్రా లేడు, విరాట్ ఫామ్‌లో లేడు! రాహుల్ ఆడనేలేదు... ఆసియా కప్‌కి ముందు టీమిండియాకి...
ఆసియా కప్ 2022 టోర్నీకి మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. యూఏఈ వేదికగా జరగబోయే ఆసియా కప్ 2022 టోర్నీకి ఇప్పటికే జట్టును ప్రకటించేసింది టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2018 ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు, నాలుగేళ్ల తర్వాత మళ్లీ అతని నాయకత్వంలోనే ఆసియా కప్ బరిలో దిగనుంది. అయితే కీలక టోర్నీకి ముందు భారత జట్టును కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి..

Asia Cup 2018
2018 ఆసియా కప్‌కి ముందు వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ, ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2018 ఆసియా కప్ ఆడి టైటిల్ గెలిచింది భారత జట్టు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని టై చేసుకున్న భారత జట్టు, ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని 3 వికెట్ల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో ఏడో సారి టైటిల్ గెలిచింది...
విరాట్ కోహ్లీ లేకపోయినా 2018 ఆసియా కప్ ఆడిన భారత జట్టులో శిఖర్ ధావన్, ఎమ్మెస్ ధోనీ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు ఉన్నారు. అయితే ఈసారి జస్ప్రిత్ బుమ్రా లేకుండానే ఆసియా కప్ బరిలో దిగుతోంది భారత జట్టు..
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు జస్ప్రిత్ బుమ్రాతో పాటు హర్షల్ పటేల్ కూడా గాయపడి జట్టుకి దూరమయ్యారు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రా లేని లోటు భారత్‌ని వెంటాడే అవకాశం ఉంది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు మహ్మద్ రిజ్వాన్ మంచి ఫామ్‌లో ఉండడం కూడా టీమిండియాని కలవరబెట్టే విషయం...
అలాగే పాక్‌పై బీభత్సమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం సరైన ఫామ్‌లో లేడు. ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో కలిసి పాకిస్తాన్‌పై 5 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచాడు విరాట్ కోహ్లీ. 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ విఫలమైనా విరాట్ హాఫ్ సెంచరీతో రాణించి భారత్‌కి ఓ మోస్తరు స్కోరు అందించగలిగాడు...
2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత పెద్దగా మ్యాచులు కూడా ఆడలేదు విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్ టూర్‌లో ఓ టెస్టు, రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో ఎలా ఆడతాడనేది టీమిండియాకి కీలకంగా మారింది...
Image credit: PTI
వీటితో పాటు భారత జట్టు భారీ అంచనాలు పెట్టుకున్న కెఎల్ రాహుల్, ఈ ఏడాది ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. సౌతాఫ్రికా టూర్‌లో వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముందు గాయపడ్డాడు...
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత దాదాపు మూడు నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్న కెఎల్ రాహుల్, రీఎంట్రీ ఇవ్వగానే అదరగొట్టడం కష్టమే. మునుపటి రిథమ్‌ని అందుకోవడానికి కెఎల్ రాహుల్‌కి కాస్త సమయం కావాలి...
Rohit Sharma Asia Cup
వీటికి తోడు ఇప్పటికే ఓపెనింగ్ పొజిషన్‌లో అనేక రకాల ప్రయోగాలు చేసింది టీమిండియా. కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడంతో వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్, మళ్లీ తన పాత పొజిషన్‌లో రావాల్సి ఉంటుంది. ఇది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు...
టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ శర్మకు అసలైన ఛాలెంజ్ ఆసియా కప్ టోర్నీతోనే మొదలుకానుంది. పాకిస్తాన్‌తో పాటు కాస్త ఏమరపాటుగా ఉన్నా ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు భారత్‌ను ఓడించగల సత్తా ఉన్నావే. టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్న రోహిత్ శర్మ, ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న భారత జట్టును ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలపగలిగితే... కెప్టెన్‌గా మొదటి టెస్టు పాస్ అయినట్టే..