IPL 2021: పొలార్డ్ అరుదైన ఘనత.. టీ20లలో మరెవరికీ సాధ్యం కాని మైలురాయి సొంతం
Kieron Pollard: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో మరెవరికీ సాధ్యం కాని మైలురాయిని ఈ విండీస్ వీరుడు సాధించాడు.
కీరన్ పొలార్డ్.. ఈ పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు. బ్యాటింగ్ కు దిగాడంటే కొండంత లక్ష్యాన్నైనా ఉఫ్ మని ఊదేస్తాడు. ముంబయి ఇండియన్స్ కు అలాంటి విజయాలు ఎన్నో అందించాడు.
బ్యాట్ తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేసే ఈ ఆల్ రౌండర్ ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్నాడు. తాజాగా మరో అరుదైన ఘనతను పొలార్డ్ సొంతం చేసుకున్నాడు. టీ20లలో పది వేల పరుగులు పూర్తి చేయడమే గాక 300 వికెట్లు తీసిన బౌలర్ గా పొలార్డ్ రికార్డు సృష్టించాడు.
Mumbai Indians
కరేబియన్ దీవుల్లో టెస్టులు, వన్డే ఫార్మాట్ కంటే టీ20 కు ఉండే క్రేజే వేరు. దీంతో అక్కడ్నుంచి పొట్టి క్రికెట్ కు ప్రతి సీజన్ కు పదుల సంఖ్యలో క్రికెట్లు దిగుమతి అవుతుంటారు. అలా వెలుగులోకి వచ్చిన పొలార్డ్.. ఒక్క భారత్ లోనే గాక వెస్టిండీస్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా లో జరిగే టీ20 టోర్నీలలో ఆడుతున్నాడు.
ఈ క్రమంలో చాలా కాలంగా ముంబయి తరఫున ఆడుతున్న పొలార్డ్.. మంగళవారం నాడు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కెఎల్ రాహుల్ ను ఔట్ చేయగానే టీ 20లలో 300 వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందాడు.
ఇప్పటిదాకా పొలార్డ్ సుమారు 25 అంతర్జాతీయ ఫ్రాంఛైజీలతో 565 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 11,000+ పరుగులు, 300 వికెట్లు తీసుకున్నాడు.
పొలార్డ్ కంటే ముందు పదివేల పరుగులు సాధించిన వారి జాబితాలో మరో విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ ఉన్నాడు. టీ20 క్రికెట్ లో గేల్ సుమారు 13 వేల పరుగులు చేశాడు.