ఐపీఎల్ వల్లే ఇలా ఆడుతున్నా.. ఇక్కడ చాలా నేర్చుకున్నా : జానీ బెయిర్ స్టో
ENG vs NZ: ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఇటీవలే ట్రెంట్ బ్రిడ్జ్ లో ముగిసిన రెండో టెస్టులో వీరవిహారం చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య ముగిసిన రెండో టెస్టులో కివీస్ నిర్దేశించిన 300 పరుగుల లక్ష్యాన్ని 50 ఓవర్లలోనే ఊదేయడంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లీష్ జట్టు ఆటగాడు జానీ బెయిర్ స్టో.. తాను ఇలా ఆడటానికి కారణం ఐపీఎల్ అని అంటున్నాడు. ఈ టెస్టులో అతడు 92 బంతుల్లోనే 136 రన్స్ చేశాడు.
ఐపీఎల్ లో అత్యంత మెరుగైన ఆటగాళ్లతో ఆడుతూ తాను చాలా నేర్చుకున్నానని.. ఒత్తిడి లో ఎలా వ్యవహరించాలో ఈ లీగ్ ద్వారానే తెలుసుకున్నానని చెప్పాడు.
రెండో టెస్టు అనంతరం బెయిర్ స్టో మాట్లాడుతూ.. ‘చాలా మంది నేను ఐపీఎల్ ఆడటం కంటే కౌంటీ క్రికెట్ ఆడాలని సూచించారు. టెస్టు క్రికెట్ కు ముందు కౌంటీ క్రికెట్ ఆడటం వల్ల ఆట చాలా మెరుగవుతుందని అంటారు.
అవును.. అది నిజమే. కానీ ప్రస్తుత అంతర్జాతీయ, ఫ్రాంచైజీ లీగ్స్ షెడ్యూల్ తో అలా చేయడం కష్టం. నేను ఐపీఎల్ ఆడటం ద్వారా చాలా నేర్చుకున్నా. అక్కడ ప్రపంచంలోని అత్యంత మెరుగైన ఆటగాళ్ల మధ్య టోర్నీ ఆడాల్సి వస్తుంది.
మ్యాచుల సమయంలో మేం ఎన్నో ఎత్తు పల్లాలను చూడాల్సి ఉంటుంది. ఒత్తిడిని ఎదుర్కోవడం.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం వంటివి ఇక్కడ నేర్చుకున్నా..’ అని బెయిర్ స్టో అన్నాడు.
ఐపీఎల్ లో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తో ఆడుతున్నాడు బెయిర్ స్టో. ఈ సీజన్ లో 11 ఇన్నింగ్స్ లలో 253 రన్స్ చేశాడు. ఇందులో రెండు ఫిఫ్టీలు కూడా ఉన్నాయి.
పంజాబ్ కంటే ముందు బెయిర్ స్టో.. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడేవాడు. 2019 నుంచి 2021 వరకు బెయిర్ స్టో ఎస్ఆర్హెచ్ కు ఆడాడు. మొత్తంగా ఐపీఎల్ లో 39 మ్యాచులాడి 1,291 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉండటం గమనార్హం.
ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో కివీస్ నిర్దేశించిన 299 పరుగుల (74 ఓవర్లలో) లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జానీ బెయిర్ స్టో (92 బంతుల్లో 136, 14 ఫోర్లు, 7 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 75 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) లు విధ్వంసకర ఆట ఆడి రెండో టెస్టులో ఇంగ్లాండ్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.