ఆకాశాన ఐపీఎల్.. అడ్రస్ లేని పీఎస్ఎల్.. పాక్ సూపర్ లీగ్ పరిస్థితి ఏంటంటే..
IPL vs PSL: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో భారత క్రికెట్ బోర్డు రూ. 48వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఒక్కో మ్యాచ్ విలువ వంద కోట్లు దాటింది. మరి మన దాయాది దేశం పాకిస్తాన్ సూపర్ లీగ్ పరిస్థితి ఏంటి..?

మీడియా హక్కుల ద్వారా వచ్చిన నగదుతో ఐపీఎల్ ఆకాశాన్ని తాకింది. ప్రపంచంలోని రెండో అత్యంత ధనవంతమైన స్పోర్ట్స్ లీగ్ గా నిలిచింది. 2023-27 కాలానికి గాను మీడియా రైట్స్ ద్వారా రూ. 48,390 కోట్లు సంపాదించింది బీసీసీఐ.
మరి క్రికెట్ లో ప్రతీది మనతో పోల్చుకునే దాయాది దేశం కూడా తమ దేశంలో నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పరిస్థితి ఏంటి..? పీఎస్ఎల్ బ్రాడ్కస్టర్లు ఎవరు..? ఎవరికీ, ఎంతకీ హక్కులు దక్కాయి..? మనతో పోలిస్తే ఒక్క మ్యాచ్ విలువ లో పీఎస్ఎల్ ఎక్కడ ఉంది..? ఈ విషయాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం.
రాబోయే ఐదేండ్ల కాలానికి మీడియా హక్కుల ద్వారా ఐపీఎల్ కు రూ. 48,390 కోట్ల ఆదాయం వచ్చింది. 2022-2023 సీజన్లకు గాను పీఎస్ఎల్ మీడియా హక్కులు రూ. 166 కోట్లకు అమ్ముడుపోయాయి.
పెరిగిన ఆదాయం ద్వారా ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 118 కోట్లు (టీవీ, డిజిటల్, ఇతర రైట్స్ అన్నీ కలిపి) గా ఉంది. మరి పీఎస్ఎల్ లో ఎంతో తెలుసా..? అక్షరాలా రూ. 2.76 కోట్లు.
గట్టిగా చెప్పాలంటే రాబోయే ఐదు సీజన్లలో ఐపీఎల్ లో ఒక్కో ఓవర్ విలువ రూ. 2.90 కోట్లుగా లెక్కగట్టారు. పీఎస్ఎల్ లో మొత్తం మ్యాచ్ విలువ కూడా మన ఒక్క ఓవర్ విలువ కాదు.
పీఎస్ఎల్ ప్రసార హక్కులను ‘ఎ స్పోర్ట్స్’ తో పాటు ‘పీ టీవీ స్పోర్ట్స్ ’ దక్కించుకున్నాయి. ఈ మొత్తం మీడియా హక్కుల విలువ (రూ. 166 కోట్లు) కూడా దాదాపు మన ఒక మ్యాచ్ విలువ కంటే కాస్త ఎక్కువ. దీనిని రెండు సీజన్లుగా విభజిస్తే మాత్రం (రూ. 88 కోట్లు) ఐపీఎల్ ఒక మ్యాచ్ విలువతో చాలా తక్కువ అనేది సుస్పష్టం.
ఐపీఎల్ లో రాబోయే సీజన్ల నుంచి ఒక్కో బాల్ వేస్తేదాని విలువ సుమారు రూ. 49 లక్షలని లెక్కగట్టారు. పీఎస్ఎల్ లో దాని విలువ అక్షరాలా లక్ష కంటే తక్కువ. ఈ లెక్కన చూస్తే పీఎస్ఎల్ కంటే మనం 50 రెట్లు ఎక్కువ.
విలువ పరంగా చూసుకుంటే ఐపీఎల్.. పీఎస్ఎల్ కు అందనంత ఎత్తులో నిలిచింది. 2021 లెక్కల ప్రకారం.. ఐపీఎల్ విలువ రూ. 35,950 కోట్లు (తాజాగా మీడియా హక్కులతో అది చాలా రెట్లు పెరిగింది). పీఎస్ఎల్ విలువ ఎంతంటే.. రూ. 391 కోట్లు (2022 లెక్కలివి).