గుజరాత్‌ను ఆలౌట్ చేసిన తొలి టీమ్‌గా చెన్నై.. రెండు సీజన్లలో తొలిసారి..
IPL 2023 Playoffs: ఐపీఎల్ - 16 లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ముగిసిన ఫస్ట్ క్వాలిఫయర్ లో చెన్నై సూపర్ కింగ్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ కు షాకిచ్చింది.

చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య ముగిసిన ఫస్ట్ క్వాలిఫయర్ లో ధోని సారథ్యంలోని చెన్నై.. గుజరాత్ ను 15 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్.. 157 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్ లో గుజరాత్ పది వికెట్లు కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ కు తమ టోర్నీ చరిత్రలో ఇలా ఆలౌట్ అవడం ఇదే ప్రథమం. ఇప్పటివరకూ టోర్నీలో 31 మ్యాచ్ లు ఆడిన గుజరాత్.. ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు.
గతంలో రెండు మూడు సార్లు 9 వికెట్ల వరకూ కోల్పోయిన గుజరాత్.. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో మాత్రం పదో వికెట్ కూడా కోల్పోవడం గమనార్హం. పతిరాన వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి షమీ.. భారీ షాట్ ఆడగా మిడాఫ్ వద్ద దీపక్ చాహర్ రన్నింగ్ క్యాచ్ అందుకుని గుజరాత్ ఇన్నింగ్స్ కు శుభం కార్డు వేశాడు.
Image credit: PTI
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (60), డెవాన్ కాన్వే (40) లు రాణించారు.
అనంతరం గుజరాత్.. 20 ఓవర్లలో 157 పరుగులే చేయగలిగింది. ఛేదనలో శుభ్‌మన్ గిల్ (42) రాణించినా.. ఆఖర్లో రషీద్ ఖాన్ (16 బంతుల్లో 30, 3 సిక్సర్లు, 2 ఫోర్లు) భయపెట్టినా చెన్నైనే విజయం వరించింది. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ -16 ఫైనల్స్ కు అర్హత సాధించింది.