- Home
- Sports
- Cricket
- CWG 2022: గెలిస్తే సెమీస్‌కు.. ఓడితే ఇంటికి.. కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాకు నేడు కీలక మ్యాచ్
CWG 2022: గెలిస్తే సెమీస్‌కు.. ఓడితే ఇంటికి.. కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియాకు నేడు కీలక మ్యాచ్
India vs Barbados: కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా 8 జట్లతో ఆడుతున్న క్రికెట్ పోటీలలో భారత్ నేడు కీలక పోరులో తలపడనున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం బార్బడోస్ తో మ్యాచ్ ఆడనున్నది.

కామన్వెల్త్ గేమ్స్ లో భారత జట్టు సెమీస్ కు వెళ్తుందా..? లేక ఓడి ఇంటికి తిరుగు ప్రయాణమవుంతుందా..? అనేది నేడు తేలనుంది. ఈ మేరకు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు.. బార్బడోస్ తో కీలక పోరులో తలపడనున్నది. ఈ మ్యాచ్ భారత్ తో పాటే బార్బడోస్ కూ కీలకమే.
గ్రూప్-ఏ లో ఉన్న ఈ ఇరు జట్లు ఇప్పటికే చెరో రెండు మ్యాచులు ఆడి ఒక మ్యాచ్ లో గెలిచి ఒక మ్యాచ్ లో ఓడాయి. పాయింట్ల పట్టికలో ఇండియా.. (2 పాయింట్లు), బార్బడోస్ (2 పాయింట్లు) సమాన పాయింట్లతో నిలిచాయి.
భారత్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లతో మ్యాచులు ఆడి ఆసీస్ తో ఓడి పాక్ పై గెలిచింది. మరోవైపు బార్బడోస్ కూడా పైన పేర్కొన్న రెండు జట్లతో మ్యాచులు ఆడి ఆసీస్ పై ఓడి పాక్ పై నెగ్గింది. అయితే రెండు జట్లకు 2 పాయింట్లతో సమాన పాయింట్లు ఉన్నా నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం భారత్ (+1.165), బార్బడోస్ (-1.794) కంటే మెరుగైన స్థితిలో నిలిచింది.
కాగా నేటి మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానున్నది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగాల్సి ఉన్న ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే సెమీస్ కు అర్హత సాధిస్తుంది. గ్రూప్-ఏ లో ఇప్పటికే ఆస్ట్రేలియా రెండు మ్యాచులకు గాను రెండింటిలో గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. నేడు భారత్-బార్బడోస్ మధ్య జరిగే మ్యాచ్ లో విజేత సెమీస్ కు వెళ్లబోయే రెండో జట్టు అవుతుంది.
ఇక తొలి మ్యాచ్ లో ఆసీస్ తో ఉత్కంఠపోరులో ఓడినా తర్వాత పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. తద్వారా నెట్ రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత్.. బార్బడోస్ కూ షాక్ ఇవ్వాలని చూస్తున్నది. ఇంక గత రెండు మ్యాచులకు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ పూజా వస్త్రకార్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండనుంది.
ఇదే గ్రూప్ లో రెండు మ్యాచులు ఓడిన పాకిస్తాన్ కామన్వెల్త్ క్రికెట్ పోటీలలో గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించింది.గ్రూప్-బిలో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లు చెరో రెండు మ్యాచులు గెలిచి సెమీస్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. శ్రీలంక, సౌతాఫ్రికాలు రెండు మ్యాచులు ఓడాయి.