- Home
- Sports
- Cricket
- గెలవాలంటే అతను ఉండాల్సిందేనా... ఈ ఏడాది రోహిత్ శర్మ లేకుండా ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ...
గెలవాలంటే అతను ఉండాల్సిందేనా... ఈ ఏడాది రోహిత్ శర్మ లేకుండా ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ... అప్పటి నుంచి పరాజయమే లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఈ ఏడాది రోహిత్ శర్మ లేకుండా ఆడిన 6 మ్యాచుల్లోనూ ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది టీమిండియా...

సౌతాఫ్రికా టూర్‌లో సెంచూరియన్ టెస్టు గెలిచి, ఘన విజయంతో 2021 ఏడాదిని ముగించింది టీమిండియా. ఈ టూర్‌కి టెస్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ గాయం కారణంగా టోర్నీ ఆరంభానికి ముందే తప్పుకున్నాడు... దీంతో కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ దక్కింది...
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడుతూ బరిలో దిగలేదు. తొలిసారి టెస్టు పగ్గాలు అందుకున్న కెఎల్ రాహుల్, జోహన్‌బర్గ్‌లో టీమిండియాకి తొలి పరాజయం రుచి చూపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కేప్ టౌన్ టెస్టులోనూ ఓడింది భారత జట్టు...
వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న కెఎల్ రాహుల్, వన్డే సిరీస్‌లో ఒక్క విజయాన్ని కూడా అందించలేకపోయాడు. సఫారీ గడ్డపై మూడు వన్డేల్లోనూ క్లీన్ స్వీప్ అయ్యింది కెఎల్ రాహుల్ టీమ్...
ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వెస్టిండీస్, శ్రీలంక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 11 మ్యాచులు ఆడిన భారత జట్టు, 11 విజయాలు నమోదు చేసింది. స్వదేశంలో జరిగిన ఆరు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో ఘన విజయాలు అందుకుంది...
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ దక్కింది. రాహుల్ సిరీస్ ఆరంభానికి ముందు గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ లభించింది..
Image credit: PTI
అయితే రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీలో ఆడిన మొదటి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు. వరుసగా 12 టీ20ల్లో గెలిచిన టీమిండియా జైత్రయాత్రకి బ్రేకులు వేసిన సౌతాఫ్రికా, 11 మ్యాచుల్లో 200+ స్కోరు చేసిన ప్రతీసారీ గెలుస్తూ వచ్చిన రికార్డును కూడా చెరిపివేసింది...
ఈ ఏడాది టీమిండియా మొత్తంగా 17 మ్యాచులు ఆడగా ఇందులో రోహిత్ శర్మ ఆడిన 11 మ్యాచుల్లో గెలిచి, అతను ఆడని ఆరింట్లో పరాజయం పాలైంది. దీంతో టీమిండియా గెలవాలంటే రోహిత్ ఉండాల్సిందే, రావాల్సిందే... అంటూ డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...