ఇండియా- పాక్ మ్యాచ్! అందులోనూ విరాట్ క్రీజులో ఉంటే ఆ మాత్రం ఉంటది... హాట్ స్టార్ రికార్డులు బ్రేక్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌పై స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ భారీ ఆశలే పెట్టుకుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైతే, ఉదయం 6 గంటల నుంచే ప్రీ మ్యాచ్ ప్రెసెంటేషన్ మొదలెట్టి, క్రేజ్ పెంచడానికి చేయాల్సిందంతా చేసింది.. ఆ మార్కెటింగ్ ఎత్తులన్నీ, జిమ్మిక్కులన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి...
మెల్‌బోర్న్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని తేలడంతో వాన కురవద్దని దేవుడికి పూజలు చేసినవారిలో అభిమానుల కంటే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ముందుంటారు. ఎట్టకేలకు వాన ముప్పు తప్పి, మ్యాచ్ సజావుగా సాగింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్... క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది...
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
virat kohli
హార్ధిక్ పాండ్యా 37 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సిన దశలో అవుట్ కాగా దినేశ్ కార్తీక్ ఐదో బంతికి పెవిలియన్ చేరడంతో తీవ్ర ఉత్కంఠ చేరింది. దినేశ్ కార్తీక్ స్టంపౌట్ అయ్యే సమయానికి టీమిండియా విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి...
ఆ తర్వాతి వైడ్‌గా వెళ్లడంతో స్కోర్లు సమమైపోయాయి. ఆ తర్వాతి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు రవిచంద్రన్ అశ్విన్. ఒకానొక దశలో ఈ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్నారు టీమిండియా అభిమానులు. అయితే ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ, కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పాడు...
Virat Kohli
టీమిండియా విజయానికి ఆఖరి 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన సమయంలో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్. ఈ మ్యాచ్‌ని స్టేడియంలో వీక్షించేందుకు 90,293 మంది ప్రేక్షకులు స్టేడియానికి తరలివచ్చారు... ఇది ఓ రికార్డే...
virat kohli
రోహిత్, రాహుల్, సూర్య ఫెయిల్ అయినా పట్టువదలకుండా ‘కింగ్’ విరాట్ కోహ్లీ క్రీజులో వీరోచితంగా పోరాడుతుంటే టీఆర్పీ రేటింగ్ మార్మోగిపోయింది... డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రియల్ టైం వ్యూస్ 1.8 మిలియన్లను దాటిపోయింది. అంటే కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా మొబైల్‌లో మ్యాచ్‌ని వీక్షించిన వారి సంఖ్య కోటి 80 లక్షలకు పైగా రికార్డు అయ్యింది.
ఆఖరి ఓవర్‌లో రియల్ టైం వ్యూస్ లెక్క కూడా కనిపించలేదు... ఒక్కసారిగా బీభత్సంగా వ్యూస్ పెరిగిపోయి, సాఫ్ట్‌వేర్ క్రాష్ అయితేనే ఇలా జరుగుతుంది...
Image credit: PTI
మొత్తానికి వర్షం కారణంగా జరుగుతుందా? లేదా? అనుకున్న మ్యాచ్ కాస్తా... వన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మారి, ఇటు ఇరుదేశాల అభిమానులకు క్రికెట్ మజాని అందివ్వడమే కాకుండా అటు కమర్షియల్‌గానూ కాసుల పంట పండించింది.