క్లీన్ బౌల్డ్ అయ్యాక 3 రన్స్! విరాట్ కోహ్లీ చేసింది తప్పా? రైట్ ఆ... రూల్స్ ఏం చెబుతున్నాయంటే...
టీ20 వరల్డ్ కప్ 2022లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి నూటికి 200 శాతం కిక్‌ని అందించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్‌లో జరిగిన హై డ్రామా వేరే లెవెల్. టీమిండియా విజయానికి ఆఖరి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సిన దశలో మ్యాచ్‌లో తీవ్ర హై డ్రామా నడిచింది... ఈ ఓవర్‌లో రెండు సంఘటనల గురించి పాక్ ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..
మహ్మద్ నవాజ్ వేసిన 20వ ఓవర్ తొలి బంతికి హార్ధిక్ పాండ్యా, భారీ షాట్‌కి ప్రయత్నించి బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, సింగిల్ తీసి విరాట్ కోహ్లీకి స్ట్రైయిక్ అందించాడు. మూడో బంతికి విరాట్ కోహ్లీ 2 పరుగులు తీశాడు...
నాలుగో బంతిని విరాట్ కోహ్లీ సిక్సర్‌గా మలిచాడు. అయితే భుజానికి పైకి నేరుగా వచ్చిన బంతిని నో బాల్‌గా ప్రకటించారు ఫీల్డ్ అంపైర్లు. దీంతో ఆ తర్వాతి బంతిని ఫ్రీ హిట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత మహ్మద్ నవాజ్ వైడ్ బాల్ వేశాడు. ఫ్రీ హిట్ కొనసాగగా ఆ బంతికి విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అది ఫ్రీ హిట్ కావడంతో నాటౌట్.
Image credit: Getty
వెంటనే చురుగ్గా ఆలోచించిన విరాట్ కోహ్లీ 3 పరుగులు తీశాడు. దీనిపై బాబర్ ఆజమ్ అండ్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బంతి వికెట్లకు తాకిన తర్వాత డెడ్ అయిపోతుంది, అలాంటప్పుడు 3 పరుగులు ఎలా తీస్తారంటూ ప్రశ్నించారు. మరి విరాట్ కోహ్లీ చేసింది కరెక్ట్ ఆ... తప్పా? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి...
నో బాల్ తర్వాత వచ్చే ఫ్రీ హిట్‌లో బ్యాటర్ అవుటయ్యేందుకు రనౌట్ ఒక్కటే మార్గం. క్లీన్ బౌల్డ్ అయినా, క్యాచ్ ఇచ్చి అవుట్ అయినా అది లెక్కలోకి రాలేదు. అదీకాకుండా సాధారణ బాల్‌కి క్యాచ్ పట్టగానే, లేదా వికెట్లను తాకగానే బంతి డెడ్ అయినట్టుగా, ఫ్రీ హిట్‌కి కాదు... క్యాచ్ పట్టిన తర్వాత, బంతి వికెట్లను తాకిన తర్వాత కూడా బ్యాటర్‌కి పరుగులు తీసేందుకు అవకాశం ఉంటుంది...
virat kohli
ఫ్రీ హిట్ బాల్‌కి ఏ బ్యాటర్ అయినా ఫీల్డర్‌కి క్యాచ్ ఇస్తే ఆ లోపు పరుగులు తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తం అతని ఖాతాలో జమ అవుతుంది. అంటే ఒకవేళ విరాట్ కోహ్లీ 80 పరుగుల వద్ద ఉండి, ఫ్రీ హిట్‌కి ఫీల్డర్‌కి క్యాచ్ ఇచ్చాడనుకుందాం. ఈ లోపు అతను 2 పరుగులు తీస్తే... విరాట్ స్కోరు 82కి చేరుతుంది...
అదే ఫ్రీ హిట్ ఆడబోయి బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయితే... అప్పుడు తీసిన పరుగులు అతని బ్యాటు నుంచి రాలేదు కాబట్టి బైస్‌గా పరిగణిస్తారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ చేసింది అదే. ఇది ఐసీసీ రూల్స్ ప్రకారం తెలివిగా చేసిన పనే... టీమిండియా ఛీటింగ్ చేసి గెలిచిందని తెగ గోల చేస్తున్న పాక్ ఫ్యాన్స్, ఐసీసీ రూల్స్‌ని తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భారత అభిమానులు...