IND vs PAK: 15 రోజుల్లో మూడు సార్లు.. భారత్-పాక్ క్రికెట్ అభిమానులకు ఇది పండగే..
India vs Pakistan: రాజకీయ, సరిహద్దు కారణాలతో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచులు జరగడమే గగనమౌతున్నది. ఇటీవలి కాలంలో ఇరు దేశాలు ఐసీసీ టోర్నీలలో మినహా ముఖాముఖి తలపడ్డ సందర్బాలూ చాలా తక్కువ.

ఏడాదికో, రెండేండ్లకో ఐసీసీ టోర్నీలలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అభిమానులు ఎగిరిగంతేస్తారు. ఇరుదేశాల క్రికెట్ అభిమానులకు అది పండగ దినం. గెలిచిన వాళ్లకు సంబురాలు, ఓడినోళ్లకు కన్నీళ్లు కామనే అయినా ఇరు దేశాల మధ్య క్రికెట్ మజాను ఆస్వాదించే వారికి మాత్రం ఆ ఒక్కరోజు.. చాలా రోజుల వరకు గుర్తుంటుంది.
ఇరుదేశాల మధ్య ఏర్పడిన రాజకీయ, సరిహద్దు సమస్యలతో భారత్-పాక్ లు 2013 నుంచి ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. ఐసీసీ ప్రపంచకప్ లు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ మినహా ఈ రెండు జట్లు క్రమం తప్పకుండా సిరీస్ లు ఆడటం లేదు.
అయితే రాబోయే కొద్దిరోజుల్లో అంటే ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 11వరకు ఇరు జట్లు మూడు సార్లు తలపడబోతున్నాయి. ఒక్క మ్యాచ్ అంటేనే ఎగిరి గంతేసే అభిమానులు.. మరి మూడు మ్యాచులంటే మాటలా..? ఇక ఆ ఆనందానికి అవధులే ఉండవు. మరి ఈ మ్యాచులకు షెడ్యూల్ ఎలా అంటే..
ఆసియా కప్-2022లో భాగంగా రెండు గ్రూపులుగా విభజించిన ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, క్వాలిఫైయర్ (యూఏఈ, సింగపూర్, కువైట్, హాంకాంగ్ లలో ఎవరో ఒకరు) ఉండగా గ్రూప్-బిలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. భారత్-పాకిస్తాన్ లో ఆగస్టు 28న తొలి మ్యాచ్ లో తలపడతాయి.
ఈ టోర్నీలో భాగంగా.. గ్రూప్ దశలో భాగంగా రెండు మ్యాచులు ఆడతాయి. అందులో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఈ లెక్కన చూస్తే భారత్, పాక్ లు సూపర్-4కు చేరడం లాంఛనమే. ఇక సూపర్-4లో సెప్టెంబర్ 4న గ్రూప్-ఏలో టాప్-2లో నిలిచిన జట్లు పోటీ పడతాయి. అంటే ఇక్కడా భారత్-పాక్ మ్యాచ్ ను వీక్షించొచ్చు.
సూపర్-4 ముగిశాక సెప్టెంబర్ 11న ఫైనల్ జరుగుతుంది. ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే భారత్-పాకిస్తాన్ లు ఫైనల్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మళ్లీ ఈ ఇరు జట్లే తుది పోరులో ఢీకొననున్నాయని ఇరు దేశాల అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.
ఏదేమైనా వీరి లెక్కల నిజమై.. పదిహేను రోజులలో ఇరు దేశాలు మూడు సార్లు మ్యాచ్ ఆడిత అది క్రికెట్ అభిమానులకు పండుగే. ఇక సెప్టెంబర్ 11 ఫైనల్ తర్వాత.. మరో నెలరోజుల తర్వాత ఇరు దేశాలు ఎలాగూ మళ్లీ టీ20 ప్రపంచకప్-2022 లో పోటీ పడనున్న విషయం తెలిసిందే. అంటే రాబోయే రెండు నెలలలో భారత్-పాక్ అభిమాలకు క్రికెట్ విందు కనువిందు చేయనుండటం ఖాయం.