ఐదు రోజుల టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిస్తే ఎలా..? బీజేపీ ఎంపీ ఆగ్రహం
INDvsAUS: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు మూడు టెస్టులు ముగియగా ఏ ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా మూడు రోజుల పాటు సాగలేదు.

ఐదు రోజులు ఆడాల్సిన టెస్టు మ్యాచ్ లు మూడు రోజులు కూడా పూర్తిగా ఆడకుండానే రెండున్నర రోజుల్లోనే ముగుస్తుండటంపై భారత మాజీ ఓపెనర్, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండున్నర రోజులలో టెస్టు మ్యాచ్ లు ముగియడం ఆటకు ఏమాత్రం మంచిదికాదని గంభీర్ అన్నాడు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులతో పాటు ఇండోర్ టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. టెస్టు క్రికెట్ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది ఇది కాదని, ఇలా అయితే ఆటకు ప్రమాదమని హెచ్చరించాడు.
స్టోర్ట్స్ టుడేతో గంభీర్ మాట్లాడుతూ... ‘టర్నింగ్ పిచ్ (స్పిన్ ను అనుకూలించేవి) లు మంచివే. పిచ్ లను నేనేమీ నిందించడం లేదు. కానీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడం ఏమాత్రం మంచిది కాదు. అభిమానులు ఇటీవల న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగినట్టుగా ఉత్కంఠగా టెస్టు జరగాలని కోరుకుంటున్నారు.
ఒక టెస్టు నాలుగు లేదా ఐదు రోజులు ఆడితేనే దానికి అందం. కానీ మరీ రెండున్నర రోజులకే ముగియడం మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు...’అని గంభీర్ చెప్పాడు. ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ నడుమ జరిగిన రెండో టెస్ట్ లో ఐదో రోజు చివరి సెషన్ లో విజేత తేలడం గమనార్హం. ఒక్క పరుగు తేడాతో కివీస్ విజయం సాధించింది.
ఇక ఆధునిక క్రికెట్ లో డీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తున్నదని గంభీర్ అన్నాడు. గతంలో డీఆర్ఎస్ అందుబాటులో లేనప్పుడు బ్యాటర్లు వాళ్ల టెక్నిక్ మీద దృష్టిపెట్టేవాళ్లని, కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడేవారే కరువయ్యారని అన్నాడు.
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మలు స్పిన్ ఆడటంలో దిట్ట అని లేకుంటే వాళ్లు ఇంతకాలం ఎలా ఆడగలరని గంభీర్ ప్రశ్నించాడు. పుజారా, కోహ్లీలు టెస్టులలో వంద మ్యాచ్ లు ఆడారని.. స్పిన్, పేస్ లను సమర్థంగా ఎదుర్కున్నారు కాబట్టే వాళ్లు ఇంతకాలం నిలదొక్కుకున్నారని గంభీర్ చెప్పాడు.