- Home
- Sports
- Cricket
- రోహిత్ వాళ్లలా కాదు.. మాలో స్ఫూర్తి నింపుతాడు : హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపించిన సిరాజ్
రోహిత్ వాళ్లలా కాదు.. మాలో స్ఫూర్తి నింపుతాడు : హిట్ మ్యాన్ పై ప్రశంసలు కురిపించిన సిరాజ్
Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆటగాళ్లందరిలోనూ స్ఫూర్తినింపుతాడని.. వారి మానసిక స్థితిని అర్థం చేసుకునే గొప్ప కెప్టెన్ అని మహ్మద్ సిరాజ్ కొనియాడాడు.

భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ పై యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రశంసలు కురిపించాడు. ఆటగాళ్ల మానసిక స్థితి తెలుసుకుని అందుకు తగ్గట్టుగా వారిలో స్ఫూర్తినింపుతాడని కొనియాడాడు.
రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతుండటం వల్ల తాను చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాననే ఫీలింగ్ లో ఉంటానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. తాజాగా అతడు ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగతా కెప్టెన్ల మాదిరిగా తనకు బాగా బౌలింగ్ చేస్తే చాలనుకునే కెప్టెన్ రోహిత్ శర్మ కాదని.. అందరి గురించి అతడు ఆలోచిస్తాడని చెప్పాడు.
సిరాజ్ మాట్లాడుతూ.. ‘ఒక ఆటగాడి మానసిక స్థితి ఏంటో రోహిత్ భాయ్ అర్థం చేసుకుంటాడు. మేము ఫీల్డ్ లో సవాళ్లు ఎదుర్కుంటున్నప్పుడు రోహిత్ మనదగ్గరికొచ్చి మనతో ప్రత్యేకంగా మాట్లాడతాడు.
మన సమస్యలు విని.. వాటి నుంచి మనను దూరం చేసేలా మనలో స్ఫూర్తి నింపుతాడు. ముఖ్యంగా బౌలర్లతో రోహిత్ భాయ్.. ఎప్పుడూ ప్లాన్ బి తో సిద్ధంగా ఉంటాడు. మీ మనసు అర్థం చేసుకునే సారథుల సారథ్యంలో ఆడటం ఎప్పటికైనా గొప్ప ఫీలింగే కదా..’ అని చెప్పాడు.
త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జట్టులో సిరాజ్ కూడా ఎంపికయ్యాడు. అయితే ఇటీవల ఐపీఎల్ ప్రదర్శనలు సిరాజ్ కు అంతగా అనుకూలించలేదు. అతడు భారీగా పరుగులిచ్చుకోవడమే గాక 14 మ్యాచులలో 9 వికెట్లు మాత్రమే తీశాడు.
ఈ నేపథ్యంలో సిరాజ్.. తాను ఐపీఎల్ లో విఫలమైనా ఇంగ్లాండ్ తో జరుగబోయే ఆఖరి టెస్టులో సత్తా చాటుతానని అంటున్నాడు. ఐపీఎల్ ను, విదేశీ పిచ్ లపై జరిగే టెస్టు మ్యాచులను పోల్చడం సరికాదన్నాడు.
ఈ సిరీస్ లో ఇప్పటికే టీమిండియా 2-1 ఆధిక్యంతో ఉంది. తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నామని.. చివరి టెస్టులో కూడా విజయం తమనే వరిస్తుందని సిరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి తాను డ్యూక్ బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నానని.. రాబోయే సిరీస్ లో నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు.