దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు వీరే
Duleep Trophy 2024 : సర్ఫరాజ్ ఖాన్ సోదరుడైన ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్ట సమయంలో తన జట్టుకు నిలబెట్టే సెంచరీ ఇన్నింగ్స్ తో అందరి మనసులు గెలుచుకోవడంతో పాటు సచిన్ టెండూల్కర్ రికార్డును సైతం బ్రేక్ చేశాడు.
Duleep Trophy 2024 : ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ తో దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభం అయింది. ఈ సారి బీసీసీఐ ఇండియా ఏ, ఇండియా బీ, ఇండియా సీ, ఇండియా డీ అనే నాలుగు జట్లను ప్రకటించి దులీప్ ట్రోఫీని నిర్వహిస్తోంది.
సెప్టెంబరు 5 నుండి ప్రారంభమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో బెంగళూరు వేదికగా ఇండియా ఏ-ఇండియా బీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో 19 ఏళ్ల యంగ్ ప్లేయర్ ముషీర్ ఖాన్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లోనే దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇండియా బీ జట్టు తరఫున దులీప్ ట్రోఫీలో బరిలోకి దిగిన యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో అండర్ 19 ప్రపంచ కప్ తర్వాత జరుగుతున్న దులీప్ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన 181 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ముషీర్ ఖాన్ తో పాటు ఇదివరకు మరికొంత మంది క్రికెటర్లు వారి దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీలు, డబుల్ సెంచరీలు కూడా చేసారు. దులీఫ్ ట్రోఫీలో అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితా ఇలా ఉంది
బాబా అపరాజిత్
మొదట బ్యాటింగ్ చేయడానికి ఎంచుకున్న సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగిన బాబా అపరాజిత్ తన తొలి మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అపరాజిత్ 212 పరుగుల ఇన్నింగ్స్ తో పాటు ఈ మ్యాచ్ లో మనీష్ పాండే 213, మలోలన్ రంగరాజన్ అర్ధ సెంచరీతో ఈ టీమ్ 600/9 వద్ద డిక్లేర్ చేసింది.
రంగరాజన్ ఐదు వికెట్ల బౌలింగ్ విజృంభణతో వెస్ట్ జోన్ 287 పరుగులకు ఆలౌటైంది. అయితే, చివరకు ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దురదృష్టవశాత్తు, అపరాజిత్ దేశవాళీ క్రికెట్ కే పరిమితమయ్యాడు. అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి ఇంకా అడుగుపెట్టలేకపోయాడు.
వినోద్ కాంబ్లీ
వెస్ట్ జోన్ కెప్టెన్ శంతను సుగ్వేకర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈస్ట్ జోన్ సారథి కులకర్ణి నాలుగు వికెట్ల బౌలింగ్ విజృంభణతో 185 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వెస్ట్ జోన్ 682/9 వద్ద డిక్లేర్ చేసింది. కేదార్ చవాన్, సుగ్వేకర్‌ల సెంచరీలతో అదరగొట్టారు.
అరంగేట్రం ఆటగాడు వినోద్ కాంబ్లీ డబుల్ సెంచరీతో చేలరేగాడు. కాంబ్లీ 208 పరుగుల ఇన్నింగ్స్ తో పాటు నయన్ మోంగియా అర్ధ సెంచరీతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సంజయ్ పాటిల్ ఐదు వికెట్ల అద్భుత బౌలింగ్ తో ఈస్ట్ జోన్ 142 పరుగులకే ఆలౌటైంది. కాంబ్లీ భారతదేశం తరపున 17 టెస్టులు ఆడాడు. 54.2 సగటుతో 1084 పరుగులు చేశాడు.
యష్ ధుల్
దులీప్ ట్రోఫీలో తన అరంగేట్రం మ్యాచ్ లో యష్ ధుల్ 193 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్, వెస్ట్ జోన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. యష్ ధుల్ 23 ఫస్ట్‌క్లాస్ గేమ్‌లలో ఐదు సెంచరీలతో 1610 పరుగులు చేశాడు.
గతంలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన 21 ఏళ్ల యశ్ ధూల్ ఈ ఏడాది ప్రారంభంలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో మైదానంలోకి పునరాగమనం చేశాడు. అతనికి పుట్టుకతో వచ్చే గుండె సమస్య ఉండటంతో శస్త్రచికిత్స అవసరమైంది.
ముషీర్ ఖాన్
ముషీర్ ఖాన్ అద్బుతమైన బ్యాటింగ్ తో దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో కష్ట సమయంలో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 181 పరుగులు చేశాడు. దీంతో ముషీర్ ఖాన్ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు.
ముషీర్ ఖాన్ సూపర్ ఇన్నింగ్స్ తో ఇండియా బీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు బోర్డుపై 321 పరుగులు చేసింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా ముషీర్ ఖాన్ బ్రేక్ చేశాడు. దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సమయంలో సచిన్ 159 పరుగులు చేశాడు. ఇప్పుడు ముషీర్ ఖాన్ సచిన్ రికార్డును బ్రేక్ చేసి తన అరంగేట్రం మ్యాచ్ లో 181 పరుగులు చేశాడు.
సచిన్ టెండూల్కర్
క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా దులీప్ ట్రోఫీలో తన అరంగేట్రం మ్యాచ్ లో సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. తన తొలి మ్యాచ్ లో 159 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ లో ఎదురులేని బ్యాటర్ గా ఎదిగాడు.
అనేక రికార్డులు బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులు సృష్టించి గాడ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు సాధించాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో వన్డే, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్.