- Home
- Sports
- Cricket
- ఫైవ్ స్టార్ హెటల్స్‌లో దొబ్బి తినడానికే పీసీబీ హైబ్రిడ్ మోడల్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ మాజీ క్రికెటర్
ఫైవ్ స్టార్ హెటల్స్‌లో దొబ్బి తినడానికే పీసీబీ హైబ్రిడ్ మోడల్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2023: పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఏకంగా పీసీబీకి కాబోయే ఛైర్మన్ జకా అష్రఫ్ కూడా దీనిపై విమర్శలు చేశాడు. తాజాగా మరో మాజీ క్రికెటర్ కూడా..

ఆసియా కప్ -2023 హైబ్రీడ్ మోడల్ లో జరుగనున్న విషయం తెలిసిందే. ఆగస్టులో జరుగబోయే ఈ టోర్నీలో పాకిస్తాన్ లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మేరకు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) టోర్నీని గ్రాండ్ సక్సెస్ చేసే ఏర్పాట్లలో పడింది.
అయితే పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఏకంగా పీసీబీకి కాబోయే ఛైర్మన్ జకా అష్రఫ్ కూడా వ్యక్తిగతంగా తనకు ఈ హైబ్రీడ్ మోడల్ నచ్చదని కామెంట్స్ చేసిన విషయం విదితమే. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. సేథీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ... ‘ఆసియా కప్ ను హైబ్రీడ్ మోడల్ లో నిర్వహిస్తున్నందుకు మనం కచ్చితంగా పీసీబీ మాజీ ఛైర్మన్ నజమ్ సేథీని మెచ్చుకోని తీరాలి. అతడు, తన టీమ్ వ్యక్తిగత ప్రయోజనాల మేరకు దీనికి అంగీకరించాడు. అతడి టీమ్ (పీసీబీ) గురించి మాట్లాడుకుంటే.. వాళ్లు ఆసియా కప్ ను దుబాయ్, శ్రీలంకలలో నిర్వహించాలని భావించారు.
దీనికి కారణం ఏంటంటే విదేశాలకు వెళ్లి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇందుకే నజమ్ సేథీ అండ్ కో. పాపం చాలా కష్టపడ్డారు. సేథీ అయితే ఏసీసీ అధ్యక్షుడు నజమ్ సేథీని ఒప్పించడానికి ఎంతో కృషి చేశాడు..’అంటూ సెటైర్స్ వేశాడు.
ఆసియా కప్ ఆతిథ్య హక్కులు దక్కినా మెయిన్ మ్యాచ్ లు ఇక్కడ లేకపోవడంతో పాకిస్తాన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారని.. పీసీబీ ఆరు నెలల పాటు చర్చల మీద చర్చలు జరిపి చివరికి హైబ్రీడ్ మోడల్ ను తీసుకొచ్చిందని దానివల్ల పాక్ కు ఒరిగేదేమీ లేదని అక్మల్ వాపోయాడు.
ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.